సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ఐఏఎస్‌లను ఎండీలుగా నియమిస్తామంటూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయ కార్పొరేషన్ల ఎండీల్లో గుబులు నెలకొంది. మరోవైపు కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వ్యవసాయ శాఖలో కొందరు అధికారులు మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
సంక్రాంతికి ముందుగానే లేదా ఆ వెంటనే కార్పొరేషన్ల ఎండీలు, జనరల్ మేనేజర్లు మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తనకు గతంలో తెలిసిన, సమర్థులైన అధికారులను ఆయా పోస్టుల్లో నియమించవచ్చని చెబుతున్నారు. వ్యవసాయ శాఖలో మార్క్‌ఫెడ్, ఆయిల్ ఫెడ్, ఆగ్రోస్, సీడ్, హాకా, వేర్ హౌసింగ్ లాంటి కార్పొరేషన్లు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత కూడా వీటిల్లో కొన్నింటికి ఐఏఎస్‌లు ఎండీలుగా ఉన్నారు. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఐఏఎస్‌లు కానివారు ఎండీలుగా కొనసాగుతున్నారు.
గత సర్కారుతో సంబంధాలపై ఆరా
ప్రస్తుతం కార్పొరేషన్ల ఎండీలుగా ఉన్నవారి గురించిన సమాచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సేకరిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వంతో వారెలా ఉన్నారు? వృత్తిపరంగా వ్యవహరించారా? లేక అప్పటి అధికార పార్టీ నేతల్లా పనిచేశారా? అన్నది ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొన్ని కార్పొరేషన్లలో ఎండీలు, చైర్మన్లు కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. కొందరు ఎండీ స్థాయి లేకున్నా పైరవీలతో ఆయా సీట్లలో కూర్చున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఆయా పోస్టుల్లో కొనసాగేందుకు కొందరు
పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది.
ఉండేదెవరు? ఊడేదెవరు?: మార్క్‌ఫెడ్‌కు సత్యనారాయణరెడ్డి ఎండీగా ఉన్నారు. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఆయన ఈ బాధ్యతల్లోకి వచ్చారు. అంతకుముందు ఆయన గత ప్రభుత్వంలోని మంత్రి దయాకర్‌రావు వద్ద పీఎస్‌గా పనిచేశారు. ఇలా గతంలో పీఎస్‌లుగా పనిచేసిన వారి ని ఇప్పుడు తీసుకోబోమని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సత్యనారాయణరెడ్డి కొనసాగింపుపై చర్చ జరుగుతోంది.
వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు ఎండీగా ఉన్న జితేందర్‌రెడ్డి ఒక బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధికి దగ్గరి బంధువు. కాబట్టి ఈయన కొనసాగింపుపైనా ప్రభుత్వం ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఇక ఆయిల్‌ఫెడ్, ఆగ్రోస్, సీడ్, హాకా సంస్థలకు ఎండీలుగా సీనియర్ అధికారులు ఉన్నారు. వీరికి గతంలో బీఆర్‌ఎస్‌తో రాజకీయపరమైన సంబంధాలు లేవంటున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కేశవులు అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణ సంస్థ (ఇష్టా)కు అధ్యక్షుడిగా ఉన్నారు.
అంతర్జాతీయంగా రాష్ట్ర ఖ్యాతిని చాటుతున్నారు. కాబట్టి ఈయన మార్పు ఉండబోదన్న వాదన వినిపిస్తోంది. ఇక ఆయిల్ ఫెడ్, హాకాలకు ఎండీగా ఉన్న సురేందర్, ఆగ్రోస్ ఎండీ రాములు ఇద్దరూ సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు చెందినవారు. కాబట్టి వారిని కూడా మార్చక పోవచ్చని చెబుతున్నారు. వారికి సీఎంతో ఉన్న అనుబంధం కూడా కలిసి వస్తుందని అంటున్నారు.
రఘునందన్‌రావు కొనసాగుతారా?
వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు కొనసాగుతారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సన్నిహితుడన్న ప్రచారముంది. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనూ, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోనూ రఘునందన్‌రావుకు మంచి సంబంధాలే ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొనసాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒకవేళ మార్చినా మంచి పోస్టులోకే వెళ్తారని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment