చర్చలు విఫలం.. సమ్మె ఉధృతం | APSRTC strike throws normal life out of gear in Andra Pradesh, Telangana | Sakshi
Sakshi News home page

చర్చలు విఫలం.. సమ్మె ఉధృతం

Published Sat, May 9 2015 1:44 AM | Last Updated on Tue, Aug 21 2018 6:13 PM

చర్చలు విఫలం.. సమ్మె ఉధృతం - Sakshi

చర్చలు విఫలం.. సమ్మె ఉధృతం

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది.. కార్మిక సంఘాలతో సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటివరకు కార్మిక సంఘాల నేతలంతా రాష్ట్రాలకు అతీతంగా ముందుకు సాగగా.. శుక్రవారం సాయంత్రం యాజమాన్యంతో చర్చల సందర్భంగా ఉన్నట్టుండి తెలంగాణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో అసలు అంశం పక్కదోవపట్టి చర్చలు విఫలమవటానికి కారణమైంది. సమావేశం నుంచి ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అర్ధాంతరంగా వెళ్లిపోవడంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.

ప్రత్యామ్నాయం తుస్సే..

మరోవైపు ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమూలకూ సరిపోలేదు. శుక్రవారం కూడా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గురువారం 1,550 బస్సులు రోడ్డెక్కగా శుక్రవారం ఆ సంఖ్య 2140కి పెరిగింది. ముఖ్యంగా అన్ని అద్దె బస్సులను పోలీసు రక్షణ మధ్య నడిపించారు. కార్మికులకు, పోలీసులకు.. కార్మికులకు, తాత్కాలిక సిబ్బందికి మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 18 బస్సులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వరంగల్‌లో కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో 15 మంది మహిళా కార్మికులు సహా పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. ఇక ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో డ్రైవర్ ఎస్‌కె గులాం సంధాని పాషా ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇక ప్రైవేటు వాహనాలు చార్జీలను మరింత పెంచి వసూలు చేస్తుండడంతో ప్రయాణికుల జేబు గుల్లవుతోంది.
 
ఎండీ వర్సెస్ టీఎంయూ

ఆర్టీసీ ఎండీగా ఉన్న సాంబశివరావు తెలంగాణ కార్మిక సంఘాలను వ్యూహాత్మకంగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా ఆరోపిస్తున్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నేత అశ్వత్థామరెడ్డి... శుక్రవారం నాటి చర్చ సందర్భంగా ఇదే అంశాన్ని లేవనెత్తారు. దీంతో అసలు తెలంగాణకు, తనకు సంబంధమే లేదని... ఆ రాష్ట్ర విషయాలను తనను అడగొద్దని ఎండీ ఘాటుగా పేర్కొన్నారు. అలాం టప్పుడు చర్చలకు తెలంగాణ నేతలను ఎందుకు ఆహ్వానించారని అశ్వత్థామరెడ్డి  నిలదీయగా... ఇది ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు సూచన మేరకు ఏర్పాటు చేసిన సమావేశమని, అవసరం లేదనుకుంటే తెలంగాణ నేతలు వెళ్లిపోవచ్చని సాంబశివరావు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రమే కార్మికులకు 27 శాతం ఫిట్‌మెంట్ ప్రతిపాదన పెట్టిం దని, తెలంగాణ ప్రభుత్వం ఒక శాతం కూడా ఫిట్‌మెంట్ ప్రతిపాదన పెట్టలేదన్నారు. ఈ తరుణంలో ఆయనకు, అశ్వత్థామరెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తర్వాత సాంబశివరావు సమావేశం నుంచి నిష్ర్కమించారు. దాంతో అర్ధాంతరంగా భేటీ ముగిసింది.
 
ఎండీ మాటల్లో తప్పులేదు..

తెలంగాణ అంశాలకు తనకు సంబంధం లేదని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిన అవసరం లేదని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం 27 శాతం ఫిట్‌మెంట్ ప్రతిపాదించని విషయం కూడా నిజమేనని చెప్పారు. ప్రత్యేకంగా మంత్రుల సబ్‌కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత అది తేల్చకుండా ఫిట్‌మెంట్ ప్రతిపాదన ఎలా సాధ్యమన్నారు. కాగా.. ఎండీ సాంబశివరావు కావాలనే తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నారని టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు.

కార్మిక నేతల రిలీఫ్‌లకు కత్తెర..: విధుల్లో ఉండాల్సిన అవసరం లేకుండా కార్మిక సంఘం నేతలకు ఉన్న రిలీఫ్‌లను ఆర్టీసీ యాజమాన్యం తొలగించింది. ఎన్‌ఎంయూ, ఈయూ, టీఎంయూలకు చెందిన 43 మంది నేతలకు 365 రోజుల పాటు విధుల్లో ఉండాల్సిన అవసరం లేకుండా ఉన్న వెసులుబాటును రద్దు చేసింది. ఇక సంఘం సభ్యుల నుంచి చందా వసూలు చేసి కార్మిక నేతలకు చెల్లించే ఏర్పాటును కూడా రద్దు చేసింది.
 
రాజధానిలో రోడ్డెక్కిన 531 బస్సులు


 రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతున్నా.. రాజధాని హైదరాబాద్‌లో మాత్రం బస్సులను నడిపించడంలో అధికారులు కొంత వరకు సఫలమయ్యారు. ప్రైవేటు, కాంట్రాక్టు సిబ్బంది సహాయంతో శుక్రవారం హైదరాబాద్ పరిధిలో 531 బస్సులను తిప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఏపీ ఎంసెట్‌కు హాజరైన విద్యార్థులతో పాటు ఉద్యోగులు, ప్రయాణికులకు కొద్దిగా ఊరట లభించింది. ఇక నగరంలోని 28 డిపోల్లో కార్మికులు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేశారు. హయత్ నగర్ డిపో వద్ద బస్సులు బయటకు వెళ్లకుండా సిబ్బంది అడ్డుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. దక్షిణ మధ్య రైల్వే రోజువారీగా తిరిగే 121 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మరో 8 రైళ్లను అదనంగా నడిపింది.
 
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు

ఆర్టీసీ సమ్మె, వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. కాకినాడ-విజయవాడ (07051) ప్రత్యేక రైలు 9వ తేదీ రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఇక తిరుపతి-కాచిగూడ (07046/07047) ప్రత్యేక రైలు 10న సాయంత్రం 7కు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.20కి కాచిగూడకు వస్తుంది. తిరుగు ప్రయాణంలో 11న ఉదయం 11.30కు కాచిగూడ నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 10.40కి తిరుపతి చేరుకుంటుంది. కాచిగూడ-విజయవాడ ఏసీ డబుల్‌డెక్కర్ (02118/02117) రైలు 11న ఉదయం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10కి విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.45కు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 8.10కి కాచిగూడ చేరుకుంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement