పరుచుకొనేనా పచ్చందం!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమానికి క్షేత్రస్థాయిలోనే ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో 25 శాతం మాత్రమే ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని, పచ్చందాలు ఆపాదించి పర్యావరణ సమతుల్యం సాధించాలన్న సదాశయంతో తలపెట్టిన యజ్ఞమే హరితహారం. అయితే ఇప్పుడు మొక్కలు నాటడం కంటే వాటి సంరక్షణ బాధ్యత పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు ఈ కార్యక్రమానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ లేకపోవడంతో చాలా మంది బాధ్యతగా కన్నా భారంగా భావిస్తూ తూతూ మంత్రంగా చేపడుతున్నారనే విమర్శలున్నాయి.
తూప్రాన్: ‘హరితహారం’ కార్యక్రమానికి ముఖ్యంగా నీళ్లు, సంరక్షణ అవరోధంగా మారుతున్నాయి. ఖరీఫ్‌లో వర్షాలు సమృద్ధిగా కురుస్తే మొక్కల పెంపకం సులభతరం అవుతుందని భావించారు. ప్రతి గ్రామంలో సుమారు 40 వేల మొక్కలు రానున్న మూడేళ్లలో నాటాలని లక్ష్యం కాగా జిల్లాలో చాలా గ్రామాల్లో తాగడానికే నీరు దొరకని పరిస్థితి ఇప్పుడు. పాఠశాలల్లోనూ నీటి కొరతే. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వేల మొక్కలను నాటడం అంత సులభమైన పని కాదు. దీనికితోడు ప్రభుత్వం అందిస్తున్న చాలా మొక్కల్లో ఒక్క టేకు మినహా ప్రతిదీ పశువులు తినడానికి అస్కారం ఉన్నదే. ఇక ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే అస్కారం ఉన్న గ్రామాలు, కుంటలు, పొలాలు, గట్లు తదితర ప్రదేశాల్లో నాటిన మొక్కల సంరక్షణ కత్తిమీదసామే.
సమ్మె దెబ్బ...
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది సమ్మె చేస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా పనులు నిలిచిపోయాయి. నెల రోజులుగా సమ్మె కొనసాగుతుండటంతో ఉపాధి హామీ పనులు పూర్తిగా బందయ్యాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఈసీలు, ఏపీవో ఇలా మొత్తం సిబ్బంది సమ్మెలో పాల్గొంటుండటంతో పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. జిల్లాలో 37,520 శ్రమశక్తి సంఘాలు ఉండగా జాబ్ కార్డులు కలిగినవారు 5,56,753 మంది ఉన్నారు.
తూప్రాన్ మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక్కో పంచాయతీ 40 వేల మొక్కలు పెంచేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ.. కార్మికుల సమ్మెతో ఈ లక్ష్యం నెరవేరే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు.