Haritaharam program
-
సింధు హరితహారం
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కాన్హా శాంతివనంలో రామచంద్ర మిషన్ గురూజీ కమ్లేష్ డీ పాటిల్ జన్మదినం సందర్భంగా శనివారం హరితహారం నిర్వహించారు. ఆశ్రమంలో కమ్లేష్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మొక్కలు నాటారు. శాంతివనం నర్సరీ నిర్వాహకులు శరవణన్ మాట్లాడుతూ.. గురూజీ జన్మదినం సందర్భంగా శనివారం దేశవ్యాప్తంగా 64 నగరాల్లో 64 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. -
విద్యాసంస్థల్లో 2 కోట్ల మొక్కలు నాటాలి: కడియం
సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా విద్యాసంస్థల్లో 2కోట్ల మొక్కలు నాటాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా విద్యా, అటవీశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యాశాఖ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు, పాఠశాల్లో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులున్నారని, ఇందులో 25 లక్షల మంది విద్యార్థులకు 5 పండ్ల మొక్కల చొప్పున ఇచ్చి వారి ఇంటి ఆవరణలో నాటేలా ప్రోత్సహించాలన్నారు. దీంతో దాదాపు 1.25కోట్ల మొక్కలు నాటడం పూర్తవుతుందన్నారు. అదే విధంగా యూనివర్సిటీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న ఖాళీ స్థలాల్లో కోటి మొక్కలు నాటాలని చెప్పారు. దీంతో 2 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం పూర్తవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, అటవీశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీకే ఝా, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పాఠశాల విద్యాశాఖ ఇన్చార్జి కమిషనర్ అదర్ సిన్హా పాల్గొన్నారు. -
‘హరితహారం’పై హ్యాండ్ బుక్
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల మొదటివారంలో మొదలుకానున్న మూడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా అందుబాటులో ఉన్న మొక్కల వివరాలపై అటవీశాఖ ఒక హ్యాండ్ బుక్‌ను రూపొందిస్తోంది. త్వరలోనే జిల్లాల వారీగా నర్సరీ డైరెక్టరీలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ విడత హరితహారం ప్రత్యేకత, ఏయే మొక్కలు ఎక్కడెక్కడ దొరుకుతాయన్న వివరాలను దీనిలో పొందుపరుస్తున్నారు. ఒక్కో జిల్లాలోని నర్సరీల వివరాలు మండలాలు, గ్రామాల వారీగా ఆయా నర్సరీల్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల మొక్కల వివరాలు, ఆ నర్సరీ ఏ మండలానికి, గ్రామానికి అనుసంధానం చేయబడిందన్న వివరాలు ఇందులో ఉంటాయి. దీనిని హరితహారానికి సంబంధించిన ప్రతి అధికారి వద్ద అందుబాటులో ఉంచటంతో పాటు, ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మంత్రి మొదలుకుని ఎమ్మెల్యే, సర్పంచ్ దాకా ఈ పుస్తకాన్ని చేరవేయనున్నారు. మొక్కలను నాటడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంరక్షణ చర్యలు, తదితరాలను పొందుపరుస్తున్నారు. హరితహారంలో భాగంగా ఏ జిల్లాకు ఆ జిల్లాలో నాటాల్సిన మొక్కల లక్ష్యం ఎంత, ఏ ఏ మొక్కలు ఏ నర్సరీలో ఉన్నాయి వాటి సంఖ్య లాంటి వివరాలు కూడా ఈ హ్యాండ్ బుక్ లో ఉంటాయి. ఒక్కో జిల్లాకు ఇక ప్రత్యేక బుక్ లెట్ అంటుబాటులో తెచ్చే ప్రయత్నం అటవీ శాఖ చేస్తోంది. ఆ జిల్లాకు సంబంధించిన నర్సరీలు, వాటి ఇన్చార్జీల పేరు, సెల్ నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. -
కొత్త ఇంట్లో చెట్లు తప్పనిసరి
- లేకుంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాదు - ప్రతిపాదనలకు కేటీఆర్ ఆమోదం సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటా చెట్ల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కొత్తగా నిర్మించిన ఇళ్లల్లో విస్తీర్ణం ఆధారంగా నిర్ణీత సంఖ్యలో చెట్లను పెంచితేనే ఇకపై ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తాజాగా ఆమోదించడంతో ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2012లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన బిల్డింగ్ నిబంధనల ప్రకారం... కొత్తగా నిర్మించిన భవనం ప్లాట్ విస్తీర్ణం 100 చదరపు మీటర్లకు మించి ఉన్నా, లేక ఎత్తు 7 మీటర్లకు మించినా గృహ ప్రవేశానికి ముందే స్థానిక మునిసిపాలిటీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సర్టిఫికెట్ లేని భవనాలకు విద్యుత్, నల్లా, డ్రైనేజీ కనెక్షన్ చార్జీలను మూడింతలకు పెంచాలని, ఆస్తి పన్నును రెండింతలు చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్తో ముడిపెట్టి చెట్ల పెంపకాన్ని ప్రతి ఒక్కరికి తప్పనిసరి చేసింది. ఒకటి రెండు రోజుల్లో అమల్లోకి రానున్న నిబంధనల ప్రకారం భవన నిర్మాణ ప్లాన్‌ను స్థానిక మునిసిపాలిటీ ఆమోదించిన వెంటనే మొక్కలు నాటాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తైఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునే నాటికి మొక్కలు కొంతైనా పెరిగుండాలి. అప్పటికప్పుడు నాటేసి దరఖాస్తు చేసుకొంటే వాటిని తిరస్కరిస్తారు. 200 చదరపు మీటర్ల లోపు స్థలంలో నిర్మించిన ఇళ్లల్లో కనీసం రెండు చెట్లు ఉండాలనేది నిబంధన. -
సర్పంచ్ల పాత్ర మారాలి
- రాజకీయ పాత్ర కాదు.. సంక్షేమ పాత్ర అని చాటాలి: గవర్నర్ నరసింహన్ - నాటిన మొక్కల్ని కాపాడాలి..లేదంటే జరిమానా విధిస్తా - మెదక్ జిల్లాలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో ముఖాముఖి సిద్దిపేట : ‘‘సర్పంచ్ పాత్ర గ్రామంలో చాలా పెద్దది. ఈ రోజు నుంచి కొత్త కథ మొదలుకావాలి. ప్రజలందరినీ భాగస్వామ్యం చేసుకొని కలసి పనిచేయాలి. సర్పంచ్‌ది రాజకీయ పాత్ర కాదని, సంక్షేమ పాత్ర అని చాటాలి. బాధ్యతాయుతంగా ప్రజాసేవకే అంకితం కావాలి’’ అని గవర్నర్ నరసింహన్ సూచించా రు. శుక్రవారం మెదక్ జిల్లా సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో నాగుల బండ శివారులోని నర్సరీ వద్ద మంత్రి హరీశ్‌రావుతో కలసి ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రజాప్రతినిధులను పరిచయం చేసుకొని వారితో ము చ్చటించారు. హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కలు నాటారంటూ ప్రశ్నించారు. ‘‘మొక్కను నాటడమే కాదు. వాటిని పరిరక్షిం చడం ముఖ్యం. మొక్కల్ని కాపాడడంలో విఫలమైతే జరిమానా విధిస్తా. డిసెంబర్లో మొ క్కల లెక్క చూస్తా తక్కువగా ఉంటే జరిమా నా తప్పదు మరి’’ అని అన్నారు. సర్పంచ్ అనగానే రాజకీయాలు అనుకోవద్దని, సేవా, సంక్షేమ భావంతో పనిచేయాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట ఆసుపత్రి సూపర్ ‘సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రోగులు రావడం ఆశ్చర్యంగా ఉంది. అలా వస్తారా..? నిజమా!’ అంటూ గవర్నర్ నరసింహన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ కేంద్రం ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పిల్లల వైద్యానికి సంబంధించిన పలు కేసులను ఇక్కడికి రిఫర్ చేస్తున్నారని వైద్యులు చెప్పడంతో గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. రాజ్‌భవన్‌లో దోమలున్నాయి.. ‘‘హైదరాబాద్‌లో, రాజ్‌భవన్‌లో దోమలున్నాయి. కానీ పారిశుధ్యంలో ఆదర్శంగా నిలిచిన ఇబ్రహీంపూర్ గ్రామంలో ఒక్క దోమ కూడా లేదు. ఇదే స్ఫూర్తితోనే రాజ్‌భవన్‌లో దోమల్లేకుండా కృషి చేస్తా. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఎమ్మెల్యే తన ప్రాంతంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి. ఇందుకు చట్టం తీసుకురావాలి’’ అని గవర్నర్ అన్నారు. శుక్రవారం హరితహారంలో భాగంగా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ఏర్పడి రెండేళ్లయింది. నన్ను సమావేశాలకు పిలుస్తారు. స్వీట్లు తినిపిస్తారు.. స్పీచ్ ఇస్తాను.. సన్మానిస్తారు.. కానీ ఇబ్రహీంపూర్లో పర్యటించాక జీవితంలోనే మధురమైన అనుభూతి కలిగింది’’ అని ఆనందం వ్యక్తంచేశారు. అంతకుముందు ప్రజాప్రతినిధులతో కలసి మొక్కలు నాటారు. ‘‘రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ అవుతుందో.. లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఇబ్రహీంపూర్ మాత్రం బంగారు గ్రామంగా రూపుదిద్దుకుంది. ఐక్యతతోనే ఈ అభివృద్ధి సాధించింది’’ అని గవర్నర్ అన్నారు. మరోవైపు గవర్నర్‌కు సిద్దిపేటలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏకాదశి భోజనాన్ని ఏర్పాటు చేశారు. పెసరట్టు, మిర్చి, సర్వపిండి, మక్కగారెలు, పులిహోర, క్యారెట్ హల్వా, సేమియా పాయసం, పప్పు, పన్నీరు, గుమ్మడి సాంబారు, వెజ్ బిర్యానీని వడ్డించారు. -
6 రోజుల్లో 5.5 కోట్ల మొక్కలు
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంగా సాగుతున్న హరితహారం - ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 71 లక్షల మొక్కలు నాటిన ప్రజలు - ఏరోజుకారోజు సమీక్షిస్తున్న సీఎస్... సీఎంకు నివేదిక సాక్షి, హైదరాబాద్ : ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమస్ఫూర్తితో సాగుతోంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపునకు స్పందించి స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు, యాజమాన్యాలు, ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల ఉద్యోగులు, అధికారులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ఈ నెల 8న కార్యక్రమం మొదలైనప్పటి నుంచి 12వ తేదీ (మంగళవారం) వరకు ప్రజలు 4.42 కోట్ల మొక్కలను నాటినట్లు అధికారిక లెక్కలు విడుదలవగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కోటికిపైగా మొక్కలను నాటినట్లు అంచనా. అడవుల జిల్లాలోనే అత్యధికంగా... అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం నాటికి అత్యధికంగా 61.54 లక్షల మొక్కలను నాటారు. బుధవారం మరో పది లక్షల మొక్కలు నాటినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో 50.84 లక్షల మొక్కలు రంగారెడ్డి జిల్లా పరిధిలో మంగళవారం నాటికి 2.65 కోట్ల మొక్కలు, జీహెచ్ఎంసీలో 19.36 లక్షలు, హెచ్ఎండీఏ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో 2.55 లక్షల మొక్కలు నాటినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో హరితహారం లక్ష్యాల మేరకు సాగడం లేదు. కరీంనగర్, వరంగల్. ఖమ్మం జిల్లాల్లో గత మూడు రోజులుగా ఆశించిన స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ‘తెలంగాణకు హరితహారం’లో ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు నాటి కొత్త రికార్డు సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాల్లో హరితహారం సాగుతున్న తీరుపై ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ ఏరోజుకారోజు కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకొని పర్యవేక్షిస్తున్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. -
ఆకుపచ్చ ఉద్యమం
-
హరితహారంపై డేగకన్ను
-
హరితహారంపై డేగకన్ను
- అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రతిరోజు నిఘా నివేదికలు: సీఎం కేసీఆర్ - ఈ కార్యక్రమం నేతల పనితీరుకు నిదర్శనం - ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పరీక్షా సమయం సాక్షి, హైదరాబాద్ : హరితహారం కార్యక్రమాన్ని ఆషామాషీ వ్యవహారంగా తీసుకోవద్దని అధికారులు, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. రెండువారాల పాటు కొనసాగే హరితహారం అధికారులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సహా గ్రామ సర్పం చుల పని తీరుకు నిదర్శనంగా నిలుస్తుందని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పరీక్షా సమయమని, తేలిక భావనను వీడి మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. ‘‘వేగులతో రోజువారీగా హరితహారం పురోగతిని, పనితీరు నివేదికలను వివిధ రకాలుగా తెప్పిం చుకుంటున్నాం. ఎవరెట్లా పని చేస్తున్నారో పది జిల్లాల నుంచి ప్రతిరోజు నివేదికలు వస్తున్నాయి. అలసత్వం వహించిన ప్రజాప్రతిని ధులు, అధికారుల పేర్లు సరైన సమయంలో బయటికొస్తాయి’’ అని పేర్కొన్నారు. ‘‘కాలం కనికరించింది. వానలు పడుతున్నాయి. మొ క్కల పెంపకానికి ఇది అనువైన సమయం. నిర్లక్ష్యంతో ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఎలాంటి అలసత్వాన్ని ప్రభుత్వం సహించదు’’ అని అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం హరితహారంపై సమీక్ష నిర్వహించారు. హరితహారాన్ని విజయవంతం చేసేందుకు సీఎస్‌కు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామం.. ప్రతి విభాగం.. ‘‘విభాగాల వారీగా ఉద్యోగులు వారి కార్యాలయాల పరిధిలో నిర్దేశించిన ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎలా పాల్గొంటున్నారు..? ఎన్ని మొక్కలు నాటారు? వాటి సంరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టారన్న వివరాలు ప్రతిరోజు అధికారులు సేకరించాలి. తమ నివేదికలను పైఅధికారులకు అందించాలి. సంబంధిత శాఖాధిపతుల ద్వారా ఏ రోజుకారోజు అన్ని శాఖల కార్యదర్శులు ఈ నివేదికలు తెప్పించుకోవాలి. వీటిని సీఎస్‌కు అందజేయాలి’’ అని సీఎం సూచించారు. ప్రతిరోజు సాయంత్రానికి ఈ నివేదికలు సీఎంవో కార్యాలయానికి చేరాలన్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు వారి సిబ్బంది హరితహారంలో పూర్తి స్థాయిలో పాల్గొనాలని, జిల్లావ్యాప్తంగా పర్యటించి కార్యక్రమాన్ని సమన్వయం చేసే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. రోజూ గ్రామాలకు వెళ్లాలి ‘‘తహసీల్దార్లు, ఎంపీడీవోలు మండలంలో ఉన్న గ్రామాలను పంచుకోవాలి. హరితహారం కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించాలి. ప్రతిరోజు గ్రామాలకు వెళ్లాలి. మొక్కలు ఎలా నాటుతున్నారు, సంరక్షించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో ప్రతి గ్రామ సర్పంచ్‌తో మాట్లాడాలి’’ అని సీఎం చెప్పారు. ప్రజాప్రతినిధులూ.. పారాహుషార్! రెండు వారాలపాటు గ్రామాల్లో ఉంటూ ప్రజలతో మమేకమై, అంతటా కలియ తిరిగి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండలాల్లోని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. మొక్కలు పెంపకంపై దృష్టి సారించిన విధంగానే పెరిగిన చెట్లను నరికివేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. అక్రమంగా అడవుల నుంచి కలపను తరలించే స్మగ్లర్ల అటకట్టించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. స్మగ్లింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వారికి ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నుంచి దూరం పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విపక్షాల విమర్శలు హాస్యాస్పదం ప్రతిపక్ష నేతలు హరితహారం కార్యక్రమాన్ని విమర్శించడం హాస్యాస్పదమని సీఎం దుయ్యబట్టారు. ‘‘గతంలో ఏడాది పొడవునా కనీసం కోటి మొక్కలు నాటిన పాపాన పోలేదు. హరితహారం ప్రజా ఉద్యమంలా సాగుతుంటే ఓర్వలేకపోతున్నారు. హరితహారానికి ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంతో తెలుసుకోలేని నేతలు ఇందులో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనం. భవిష్యత్ తరాల కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విమర్శించడం మానుకోవాలి’’ అని హితవు పలికారు. వనాల పెంపకం, సంరక్షణపై గత ప్రభుత్వాల అలసత్వం కారణంగానే తెలంగాణలో పచ్చదనం పలుచబడిందన్నారు. ఈ దుస్థితిని అధిగమించేందుకే హరితహారం కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా చేపట్టినట్లు చెప్పారు. -
ఆకుపచ్చ ఉద్యమం
- భాగ్యనగరిలో వెల్లివిరిసిన హరిత స్ఫూర్తి - 29.19 లక్షల మొక్కలు నాటిన సిటీజనులు సాక్షి, హైదరాబాద్ : హరిత స్ఫూర్తి వెల్లివిరిసింది.. ‘మొక్క’వోని దీక్ష సక్సెస్ అయింది.. ఎటు చూసినా మొక్కల పండుగే.. వనం కోసం కదిలిన జనం నేలతల్లి మెడలో ‘పచ్చ’ల హారం వేశారు..! గ్రేటర్ హైదరాబాద్‌లో మహోద్యమంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతమైంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మహానగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ విభాగాల ఆధ్వర్యంలో 3,985 చోట్ల వంద జాతులకు చెందిన సుమారు 29.19 లక్షల మొక్కలు నాటారు. 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నా అంతకుమించి రికార్డు స్థాయిలో మొక్కలు నాటడం విశేషం. నగరంలో 41 చోట్ల జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు, వీఐపీలు, సినీ, క్రీడారంగ ప్రముఖులు పాల్గొన్నారు. సుమారు 200 ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు హరితహారంలో పాలుపంచుకున్నాయి. పదిచోట్ల మెగా హరితహారం నిర్వహించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బీహెచ్ఈఎల్ టౌన్షిప్ వద్ద మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్స్ ప్రాంగణంలో కదంబం, రెండు వేప మొక్కలు నాటి నగరంలో హరితహారాన్ని లాం ఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలో వేప, రావి, మద్ది, మోదుగ వంటి సంప్రదాయ మొక్కలు నాటేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. ఈదురుగాలులు, విపత్తులను సమర్థవంతంగా తట్టుకునేందుకే ఈ మొక్కలు నాటినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కదంబం, వేప మొక్కలు నాటిన సీఎం సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం 11.30 గంటలకు నిమ్స్‌లోని నర్సింగ్ కాలేజీ వెనుకభాగంలోని ఖాళీ స్థలంలో ఒక కదంబం, రెండు వేప మొక్కలు నాటారు. కార్యక్రమంలో భాగంగా నిమ్స్ ఆవరణలో 4 వేల మొక్కలు నాటినట్లు మంత్రి లకా్ష్మరెడ్డి తెలిపారు. వేప, కానుగ, సిల్వర్ ఓక్, నెమలినారలతోపాటు వెయ్యి ఔషధ మొక్కలు నాటామన్నారు. నిమ్స్ ఆవరణలో 2003లో అప్పటి రాష్ట్రపతి కలాం నాటిన మొక్క ఇప్పుడు అందరికీ నీడనిస్తోంది. ఆ తర్వాత సీఎం హోదాలో నిమ్స్ ఆవరణలో మొక్కలు నాటిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రి లక్ష్మారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రె డ్డి, నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ మనోహర్, అధికారులు, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. తమ శాఖ ఆధ్వర్యంలో 4 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. అనంతగిరి కొండలు, హిమాయత్ సాగర్ పరిసరాల్లో లక్ష ఔషధ మొక్కలు నాటనున్నట్లు చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో సాగాలి: హరీష్ తెలంగాణలో కరువు పరిస్థితులను దూరం చేసేం దుకు ప్రజలందరూ మొక్కలు పెంచాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆదిలాబాద్, ఖమ్మంలో వర్షాలు బాగా పడుతున్నాయని, కానీ మెదక్ జిల్లాలో వర్షాలు కురవకపోవడానికి కారణం పచ్చదనం లేకపోవడమేనన్నారు. 33% అటవీప్రాంతం ఉంటేనే ప ర్యావరణం సమతుల్యంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో హరితహారం సాగాలన్నారు. ప్రముఖులు ఎవరెవరు.. ఎక్కడ? పాతబస్తీలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కుందన్భాగ్లో స్పీకర్ మధుసూదనాచారి, హైటెక్‌సిటీలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, ఖైరతాబాద్‌లో మంత్రి తలసాని, పార్శీగుట్టలో టి.పద్మారావు, జన్వాడలో మంత్రి హరీష్‌రావు, శ్రీనగర్‌కాలనీలో ఎంపీ కవిత, కేబీఆర్ పార్క్‌లో మేయర్ బొంతు రామ్మోహన్‌లు మొక్కలు నాటారు. గచ్చిబౌలిలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, సనత్‌నగర్‌లో ముఖేశ్, నోవాటెల్ వద్ద పీవీ సింధు, మజీద్‌బండ వద్ద శ్రీకాంత్, బంజారాహిల్స్‌లో చిరంజీవి, చిత్రపురిలో సినీరంగ ప్రముఖులు రాజేంద్రప్రసాద్, రెజీనా తదితరులు మొక్కలు నాటారు. బృహత్తర యజ్ఞమిది: పేర్వారం హరితహారం బృహత్తర యజ్ఞమని తెలంగాణ పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్ పేర్వారం రాములు, రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, టీఎస్‌టీడీసీ మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ పేర్కొన్నారు. సోమవారం లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ వెనుక ప్రాంతంలో వారు మొక్కలు నాటారు. టూరిజం ఆధ్వర్యంలో దాదాపు 5 లక్షల మొక్కలు నాటనున్నట్లు రాములు చెప్పారు. ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు: కేటీఆర్ ఇకపై ఇంటి ఆవరణలో 10 మొక్కలు నాటితేనే ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన హరితహారం మానవ ఇతిహాసంలో మూడో అతిపెద్ద ప్రయత్నం అని చెప్పారు. దేశంలోని 28 రాష్ట్రాలలో కలిపి ఏటా 50 కోట్ల మొక్కలు నాటితే ఒక్క తెలంగాణలో ఏటా 46 కోట్ల మొక్కలు చొప్పున ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. మాదాపూర్‌లోని టీసీఎస్ క్యాంపస్, బయోడైవర్సిటీ పార్కులో మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ప్రస్తుతం తెలంగాణలో 24 శాతం మాత్రమే అటవీ ప్రాంతం ఉందని దాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పూల బొకేలకు స్వస్తి పలుకుదాం: నరసింహన్ హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ నరసింహన్ అభిలషించారు. 10 మొక్కలు నాటితేనే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలనే నిబంధన తేవాలన్నారు. మొక్కలు బాగా పెంచిన వారికి అవార్డులివ్వాలని, పెంచని వారిని గుర్తించి జరిమానాలు విధించే విధానాలు తీసుకురావాలన్నారు. పూల బొకేలిచ్చే పద్ధతికి స్వస్తి పలకాలన్నారు. పూల బొకేలకు బదులుగా చిన్న మొక్కలను కుండీల్లో అతిథులకు ఇవ్వాలని సూచించారు. ఏడాదిపాటు పూలను తుంచకుండా ఉండాలన్నారు. మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం బీహెచ్ఈఎల్ టౌన్షిప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, పి.మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో మాట్లాడూతూ.. ప్రస్తుతం నాటుతున్న మొక్కల వివరాలను తీసుకుంటున్నానని, ఆరు నెలల తర్వాత ఆ మొక్కల ఎదుగుదలపై ప్రత్యేకంగా సర్వే చేయిస్తానని చెప్పారు. ఒక్క మొక్క పెరగకపోయినా దానికి కారణాలను తెలుసుకుని బాధ్యుడైన వ్యక్తికి జరిమానా విధిస్తామన్నారు. -
హరితహారంలో గులాబీ దళం
విధిగా పాల్గొనాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమంలో పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు పార్టీ అధినాయకత్వం ఇప్పటికే జిల్లా నాయకత్వాలకు సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకుపోవాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలకూ ఉందని సీఎం కేసీఆర్ పలుమార్లు పార్టీ వేదికల్లో పేర్కొన్నారు. తాజాగా ఆయన రెండో విడత ‘హరిత హారం’ కార్యక్రమాన్ని శుక్రవారం నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఇందులో పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుర్తింపు కోసం నేతల ఆరాటం ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందేందుకు జిల్లాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఆరాటపడుతున్నారు. తమ పరిధిలో విరివిగా భాగం పంచుకోవడం ద్వారా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిలో పడే అవకాశం ఉండడంతో హరిత హారాన్ని సదవకాశంగానే పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రభుత్వ నామినేటెడ్ పదవులు భర్తీ కాకపోవడం, మండల స్థాయి పదవులు మొదలు అన్ని పదవులకు విపరీతమైన పోటీ ఉండడంతో మరోసారి నేతల దృష్టిని ఆకర్షించేందుకు ఇదే తరుణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సహజంగానే ఇది పార్టీ కేడర్ మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టించిందని.. రెండు వారాల పాటు సాగే హరితహారంలో కార్యకర్తలంతా విరివిగా పాల్గొంటే కార్యక్రమం విజయవంతం అవుతుందని అగ్రనాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేస్తామని తొలి నుంచీ చెబుతున్నా వాస్తవంలో అంతగా సాధ్యం కాలేదు. కానీ హరితహారం మాత్రం విస్తృత కార్యక్రమం కావడం, ప్రజల భాగస్వామ్యం ఉండడంతో నేతలు ప్రజల్లోకి వెళ్లడానికి అందివచ్చిన అవకాశమని అభిప్రాయపడుతున్నారు. హరిత తెలంగాణ కోసం హరిత తెలంగాణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక కార్యకర్తలకు కూడా బాధ్యతలు అప్పజెప్పనున్నారు. ఉద్యమ స్థాయిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో... ముందుగా పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేయడం ద్వారా ఊపు తేవాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా స్థానిక ప్రజాప్రతినిధులకు కార్యకర్తలను భాగస్వాములను చేయాలని ఆదేశాలు వెళ్లినట్లు చెబుతున్నారు. -
చెరువుకట్టలను తీర్చిదిద్దాలి
- పర్యాటక కేంద్రాలుగా మార్చాలి - ‘హరితహారం’ను విజయవంతం చేయూలి - భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు - మంత్రులు రామన్న, పద్మారావుతో కలిసి పర్యటన నెక్కొండ/నల్లబెల్లి/చెన్నారావుపేట/దుగ్గొండి: మిషన్ కాకతీయ పథకంలో భాగంగా అభివృద్ధి పనులు నిర్వహించిన చెరువు కట్టలపై హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయూలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు కోరారు. చెరువు కట్టలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించా రు. మంత్రులు జోగు రామన్న, టి. పద్మారావుతో కలిసి మంగళవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. చెరువు కట్టలపై ఈత, తాటి, టేకు మొక్కులు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నెక్కొండలో హరీష్‌రావు మాట్లాడారు. గ్రామీణులకు జీవనాధారంగా చెరువులను మార్చి అభివృద్ధి చేయూల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బండ్‌కు ఇరువైపులా నాటే మొక్కలను గౌడ కులస్తులు, ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షించాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావు సూచించారు. హరత తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కోరారు. నెక్కొండలోని తెలంగాణ బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థినులు హరితహారం ర్యాలీ నిర్వహించారు. మంత్రి హరీష్‌రావుకు సమస్యలు విన్నవించారు. గీత కార్మికుల బతుకులు బాగు పడాలె మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల అభివృద్ధి పనులు, చెరువు కట్టలపై ఈత, తాటి వనాల పెంపకంతో గీత కార్మికుల బతుకులు బాగుపడాలని మంత్రి హరీష్‌రావు ఆకాంక్షించారు. చెన్నారావుపేట మండలం వుగ్దుంపురం, గురిజాలలో పర్యటించారు. గురిజాలలో వుహిళలు బతుకవ్ము, బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. ‘గురిజాల గ్రావూన్ని వురువలేం..పల్లెనిద్ర చేసింది గుర్తుంది..తప్పనిసరిగా వుుఖ్యవుంత్రి కేసీఆర్ వురల వస్తాడు.. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిచేస్తాం’ అన్నారు. పింఛన్లు ఇప్పించాలంటూ మంత్రులకు పలువురు వృద్ధులు వినతిపత్రాలు అందించారు. దుగ్గొండిలో.. దుగ్గొండి మండలంలో మిషన్ కాకతీయలో భాగంగా 10 చెరువులను పునరుద్ధరించారు. ఈ చెరువు కరకట్టలపై స్థానిక గౌడ కులస్థులతో మంగళవారం మొక్కలు నాటిం చారు. వెంకటాపురం పెద్దచెరువు, దుగ్గొండి పెద్దచెరువుల వద్ద, తిమ్మంపేట గుండం చెరువు కట్టలపై మంత్రులు హరీష్‌రావు, పద్మారావు, జోగు రామన్న మొక్కలు నాటారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో 60 చెరువులపై ఒకేసారి లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి పెద్ది సుదర్శన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని మంత్రి రామన్న అభినందించారు. జిల్లాలో ఇప్పటికే 1.17 కోట్ల మొక్కలు నాటడం పూర్తి అయిందన్నారు. మానుకోట ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, సీఎం పీఆర్వో గటిక విజయ్‌కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కలపెల్లి రవీందర్రావు, ఆర్డీఓలు భాస్కర్‌రావు, రామకృష్ణారెడ్డి, డీఎస్పీ మురళీధర్‌రావు, నెక్కొండ ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, జెడ్పీటీసీ బక్కి కవిత, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు షేక్ అబ్దుల్నభి,సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు హంస విజయురావురాజు తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. పార ఎందుకు తెచ్చుకోలేదు? నల్లబెల్లి మండలం నారక్కపేట లచ్చిరెడ్డికుంట కట్టపై మొక్కలు నాటేందుకు పార లేకపోవడంతో అటవీశాఖ అధికారులపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్లు సక్రమంగా లేవని అసహనం ప్రదర్శించారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మరావు, టీఆర్ఎస్ నర్సంపేట నియోజక వర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డిలతో కలిసి ఆయన మొక్కలు నాటారు. చెరువు ఆయకట్టు, చెరువు శిఖం వివరాలను సర్పంచ్ మోర్తాల రామారావును మంత్రి అడిగి తెలుసుకొన్నారు. మొక్కలు నాటడం పూర్తయ్యేవరకు అటవీశాఖ అధికారులు ఇక్కడే ఉండి పర్యవేక్షించాలన్నారు. అంతకు ముందు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. వరంగల్ సౌత్ డీఎఫ్ఓ కిష్టా, నర్సంపేట ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ సుధీర్, ఎంపీపీ బానోతు సారంగపాణి, తాహసీల్దార్ డీఎస్ వెంకన్న, ఎంపీడీఓ మూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అడవి బొగ్గుపాలు...
కలప టు కోల్ దందా - జోర్పూర్ శివారు కేంద్రంగా బాగోతం - కలపతో బట్టీల్లో బొగ్గు తయూరీ - 15 రోజులకు 7,500 క్వింటాళ్ల విక్రయం - రూ.1.50 కోట్ల మేర అక్రమ వ్యాపారం - అధికారులతో అక్రమార్కుల కుమ్మక్కు - ఇతర రాష్ట్రాలకు తరలింపు - పట్టించుకోని యంత్రాంగం - తగ్గుతున్న అటవీ సంపద నందిపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి గొడ్డలి పెట్టుగా మారి కొందరు అక్రమార్కులు వృక్ష సంపదను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారు. ఏళ్ల తరబడి పెరిగిన వృక్షాలను నేలకూలుస్తూ.. కలపను వందలాది కిలోమీటర్లు తరలిస్తూ.. అక్రమంగా బొగ్గు తయారుచేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు కర్మాగారపు కేంద్రాలను తలపిస్తున్నాయి. ఉత్పత్తి చేసిన బొగ్గును నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కరాష్ట్రాలైన మహా రాష్ర్ట, రాజ స్థాన్‌కు తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి చర్యలను అడ్డుకోవాల్సిన అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జోర్పూర్ గ్రామ శివారులోని మారుమూల ప్రాంతంలో మూడో కంటికి కనిపించకుండా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న దందా ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని జోర్పూర్ శివారులో మారుమూల ప్రాంతంలో సుమారు 6 ఎకరాల స్థలంలో బొగ్గు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని గత మూడు నెలల నుండి వందలాది టన్నుల కలపను కాల్చి బొగ్గును తయారు చేస్తున్నారు. ఉత్పత్తిని చేసిన బొగ్గును జిల్లా కేంద్రానికి తరలించి అక్కడి నుండి మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పక్క జిల్లాల నుంచి కలప సరఫరా బొగ్గు ఉత్పత్తికి కావల్సిన కలపను నిజామాబాద్‌తోపాటు పక్క జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్‌లోని అటవీ ప్రాంతంలోని మహా వృక్షాలను నరికి వేస్తూ, కలప దుంపలుగా తయారు చేసి చెక్‌పోస్టులను దాటుకుంటూ జోర్పూర్ శివారుకు తీసుకువస్తున్నారు. అక్రమ కలప తరలింపులో ఫారెస్టుల వద్ద అధికారుల నిఘా కొరవడడం, చెక్‌పోస్టు అధికారులతో వ్యాపారులు కుమ్మక్కు కావడంతో యథేచ్ఛగా బొగ్గు ఉత్పత్తికి కావాల్సిన కలప నందిపేట మండలంలోని జోర్పూర్ శివారుకు చేరుకుంటోంది. వారంలో రోజుకోసారి లారీల్లో కలప జోర్పూర్ శివారుకు వస్తున్నట్లు సమాచారం. పక్క రాష్ట్రాలకు వేల క్వింటాల్లో బొగ్గు బొగ్గు ఉత్పత్తికి ముడి సరుకైన రకరకాల కలప దుంపలను జోర్పూర్ శివారుకు దిగుమతి చేసుకుంటూ ఇటుక బట్టీలుగా పేర్చి నిప్పు పెడుతున్నారు. 15 రోజులుగా కాల్చుతూ బొగ్గు తయారు చేస్తున్నారు. ఇలా 15 రోజులకోసారి 5 బట్టీలతో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కో బట్టి నుంచి సుమారు 1,500 క్వింటాళ్ల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నట్లు అక్కడ పనిచేసే కార్మికులు చెబుతున్నారు. ఇలా వేల క్వింటాళ్లుగా తయారు చేసిన బొగ్గును పక్క రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. రాజస్థాన్, మహారాష్ట్రకు చెందిన 50 మంది కూలీలు తమ కుటుంబాలతో మూడు నెలలుగా బొగ్గు ఉత్పత్తి కేంద్రం వద్దే ఉంటున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన బొగ్గు నిల్వలు, ఉత్పత్తి కేంద్రంలో పనిచేసే కార్మికుల గుడారాలు కర్మాగారాన్ని తలపిస్తున్నాయి. మాది రాజస్థాన్ రాష్ట్రం. మాతో పాటు మహారాష్ర్ట నుంచి పనిచేసేందుకు 50 మంది కూలీలం కుటుంబాలతో వచ్చాం. మాకు ప్రతి ఒక్కరికి రోజుకు రూ. 300 కూలి ఇస్తున్నారు. కలపను పేర్చి నిప్పుపెట్టి బొగ్గును తయారు చేసి సంచుల్లో నింపి లారీల్లో లోడు చేస్తాం. బొగ్గు మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు వెళ్తోంది. కలప ఎక్కడి నుంచి వస్తోందో మాకు తెలవదు. మూడు నెలలుగా పనిచేస్తున్నాం.’అని బట్టీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు చెబుతుండడాన్ని బట్టి ఈ దందా ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. అధికారికంగా అనధికార దందా... కుద్వాన్పూర్ పంచాయతీ.. జోర్పూర్ శివారు... సర్వే నంబర్ 55, 59 లోని అసైన్డ్ భూమిలో కలప టు కోల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. కలప కాల్చి బొగ్గును తయారు చేసేందుకు పంచాయతీ పాలకవర్గ సభ్యులు తీర్మానం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి వచ్చే ఏడాది ఈ సమయం వరకు కట్టెలు కాల్చి బొగ్గు తయూరు చేసుకునేలా ఆ భూమిని లీజుకు ఇచ్చారు. ఇంటి నిర్మాణం కోసం రూ.1184 ఫీజును సైతం సదరు వ్యక్తి నుంచి వసూలు చేశారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు చార్కోల్ డిపో పేరిట అనుమతులు ఇచ్చారు. ఇంకేముంది.. అధికారికం గా అనుమతులు పొందిన సదరు వ్యక్తి ఆరు ఎకరాల్లో అనధికార బాగోతానికి తెరలేపాడు. 15 రోజులకు సుమారు రూ.1.50 కోట్ల దందా సాగిస్తున్నాడు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకానికి గొడ్డలిపెట్టుగా మారి.. అటవీ సంపద అంతరించిపోయే ప్రమాదం ఉంది. -
మొక్క బతికేదెలా!!
♦ మొక్కుబడిగా మారిన హరితహారం ♦ వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణం ♦ సంరక్షణకు ముందుకు రాని సర్పంచులు ♦ ఆలోచనలో పడిపోరుున అధికారులు ♦ మొక్కల పంపిణీకి తాత్కాలిక విరామం ♦ వనరులను వెతుకుతున్న వ్యవసాయ శాఖ బాన్సువాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం వర్షాభావ పరిస్థితులతో మొక్కుబడిగా మారింది. గ్రామాలలో మొక్కలను నాటేందుకు సర్పంచులు అం తగా ముందుకు రాకపోవడంతో మొక్కలు నర్సరీలలోనే ఉండిపోతున్నాయి. సకాలంలో వానలు కురియకపోవడమే ఇందుకు కారణం. జిల్లాలో హరితహారం ఈ నెల మూడున ప్రారంభమైంది. సుమారు 3.60 కోట్ల మొక్కలను నాటాలని అధికారులు నిర్ణయించా రు. దీనికోసం అన్ని మండలాలలోని నర్సరీలలో మొక్కలను పెంచారు. ఒక్కొక్క గ్రామంలో 40 వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. అందుకు అన్ని ప్ర భుత్వ/ప్రరుువేటు సంస్థలు, విద్యాలయాలు, అధికారులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాలలో కమిటీలను ఏ ర్పాటు చేసి, పంచడానికి మొక్కలను సిద్ధంగా ఉంచారు. మొక్కల పంపిణీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీఓలకు ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. సంరక్షణ వనరులు, వసతు లు తెలుసుకొని సంతృప్తి చెందితేనే మొక్కలు అం దించాలని వారికి సూచించారు. తీసుకుపోయిన మొక్కలపై శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. జాడలేని వానలు జూన్ నెలలో అడపాదడపా వర్షాలు కురియడం తో, జూలైలోనూ వర్షం కురుస్తుందని ప్రభుత్వం భావించి హరితహారాన్ని ప్రారంభించింది. కానీ ఆశించిన స్థారుులో వానలు కురియలేదు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 20 లక్షల మొక్కలను నాటామని అధికార యంత్రాంగం పేర్కొంటోం ది. ఇందులో చాలా మొక్కలు ఇప్పటికే వర్షాభావంతో వాడిపోతున్నాయి. పాఠశాలలు, కార్యాలయాలలో నాటిన మొక్కలకు సంరక్షణ చర్యలు చేపడుతున్నా మిగితా ప్రాంతాలలో నాటినవాటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాభావం, పంచాయతీ సిబ్బంది సమ్మెతో వాటిని సంరక్షించలేకపోతున్నామని సర్పంచులు అంటున్నారు. ఈ దురు గాలులు, ఎండలతో చాలా వర కు భూమిలో తేమ లేకుండా పోతోంది. ఇది లా ఉండగా, వర్షాభావ పరిస్థితులతో వ్య వసాయ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ఆలోచనలో పడింది. జిల్లాలో పలు చోట్ల వే సిన మెట్ట పంటలు ఎండిపోతున్నారుు. ప్రతికూల పరిస్థితులలో వ్యవసాయదారులు పంటల సాగుకు ముందుకు రావడం లేదు. ఇక హరితహారం పరిస్థితి చెప్పలేకుండా ఉన్నామని, మొక్కలను నాటితే వాటిని బతికించడం కష్టమేనని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఎండుతున్న మొక్కలు పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారుల వెంట నాటిన మొక్కలకు నీళ్లు పోయకుంటే అవి ఎండిపోయే ప్రమాదముంది. ప్రస్తుతం మొక్కను సంరక్షించే చర్యలు పకడ్బందీగా చేపట్టడం లేదు. జిల్లా లో వర్షాభావ పరిస్థితి అధికంగా ఉంది. ప్రస్తుత సమయంలో మొక్కలు నాటితే చ నిపోయే పరిస్థతి ఉన్నందున నీటిసౌకర్యం ఉంటే నే మొక్కలు నాటాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సర్పంచులు కూడా గ్రామాలకు మొక్కలను తీసుకుపోయేందుకు ముందుకు రావడం లేదు. బాన్సువాడ పట్టణంలో నేటికీ వెయ్యి మొక్కలను కూడా నాటలేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అధికారులు కూడా అడిగిన వారందరికీ మొక్కలు ఇవ్వకుండా వాటిని బతికించే వనరుల ను చూస్తున్నారు. జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. లక్ష్యాలు ముఖ్యం కాదు మొక్క బతకడమే ప్రధానమంటూ ఉన్నతాధికారులు సూచించడంతో మొక్కలు నాటే కార్యక్రమానికి తాత్కాలిక విరామం ఏర్పడింది. ఫలితంగా నర్సరీలలోని మొక్కలు నర్సరీలలోనే ఉండిపోతున్నాయి. -
వాడిపోతున్న హరితం
♦ పట్టించుకొనేవారు లేక ♦ నేలవాలుతున్న మొక్కలు తెలంగాణకు ‘హరితహారం’ కలగానే మిగిలేట్టుంది. ప్రతి అడుగూ పచ్చందాలు పరుచుకోవాలన్న ఆకాంక్ష ‘మొగ్గ’గానే వాడిపోతోంది. మెదక్ డివిజన్లో.. నాటిన మొక్కలకు నీరు పోసే దిక్కే లేక... సంరక్షించేవారు లేక ‘హరితహారం’ మరో ఉద్యమంలా సాగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి ఆదిలోనే గండి పడుతోంది. మెదక్ టౌన్ : మన బిడ్డల భవిష్యత్తు కోసం మొక్కలు నాటాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టుబట్టి, జట్టుకట్టి ఉద్యమించిన ప్రజలు స్ఫూర్తితో రాష్ట్రంలో మరో ఉద్యమంలా ‘హరితహారం’ చేపట్టాలి... ఇదీ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు. కానీ మెదక్ డివిజన్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పచ్చదనానికి ఆదిలోనే హంసపాదు పడుతోంది. రాష్ర్టంలో అటవీ సంపదను పెంచి వాతావరణ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సర్కారు చేపట్టిన ఈ ప్రాజెక్టు నీరుగారిపోతోంది. దీని కింద డివిజన్లో నాటిన మొక్కలు చాలాచోట్ల చెట్లు ఎండిపోతున్నాయి. మరో వైపు ఎండలు మండుతుండటంతో మొక్కల పంపిణీకి తాత్కాలికంగా బ్రేకు పడింది. పర్యవేక్షణ ఎక్కడ? ‘హరితహారం’లో మొదటి విడతగా మెదక్ రెవెన్యూ డివిజన్లో కోటి మొక్కలు నాటాలన్నది లక్ష్యం. వీటిల్లో ఇప్పటి వరకు సుమారు 10 లక్షల గుంతలు తవ్వి 1.2 లక్షల మొక్కలు నాటారు. అంతేకాదు వాటి సంరక్షణ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు అప్పగించారు. పట్టించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మంత్రులు, ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఇందుకు గాను ప్రతి గ్రామ పంచాయితీలో కోఆర్డినే షన్ అధికారులను నియమించారు. ఆ గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ, వీఆర్ఏ, మహిళ, యువజన సంఘాలు ప్రజలను సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ కూడా అంతే బాధ్యతగా చేయాలి. కానీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు, నీళ్లు లేని ప్రాంతాల్లో నాటడం తదితర కారణాలతో అవి ఎండిపోతున్నాయి. ఇక బాధ్యత తీసుకోవాల్సివారు వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక ఆదరాబాదరా నాటినవి, ట్రీగార్డు లేనివి పశువులకు ఆహారంగా మారుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మొక్కలకు ట్యాంకర్లు, ఫైరింజన్ల ద్వారా నీరుపోయించే ప్రయత్నాలు మందకొడిగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయితీ కార్మికులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉండటంతో ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. -
పరుచుకొనేనా పచ్చందం!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమానికి క్షేత్రస్థాయిలోనే ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో 25 శాతం మాత్రమే ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని, పచ్చందాలు ఆపాదించి పర్యావరణ సమతుల్యం సాధించాలన్న సదాశయంతో తలపెట్టిన యజ్ఞమే హరితహారం. అయితే ఇప్పుడు మొక్కలు నాటడం కంటే వాటి సంరక్షణ బాధ్యత పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు ఈ కార్యక్రమానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ లేకపోవడంతో చాలా మంది బాధ్యతగా కన్నా భారంగా భావిస్తూ తూతూ మంత్రంగా చేపడుతున్నారనే విమర్శలున్నాయి. తూప్రాన్: ‘హరితహారం’ కార్యక్రమానికి ముఖ్యంగా నీళ్లు, సంరక్షణ అవరోధంగా మారుతున్నాయి. ఖరీఫ్‌లో వర్షాలు సమృద్ధిగా కురుస్తే మొక్కల పెంపకం సులభతరం అవుతుందని భావించారు. ప్రతి గ్రామంలో సుమారు 40 వేల మొక్కలు రానున్న మూడేళ్లలో నాటాలని లక్ష్యం కాగా జిల్లాలో చాలా గ్రామాల్లో తాగడానికే నీరు దొరకని పరిస్థితి ఇప్పుడు. పాఠశాలల్లోనూ నీటి కొరతే. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వేల మొక్కలను నాటడం అంత సులభమైన పని కాదు. దీనికితోడు ప్రభుత్వం అందిస్తున్న చాలా మొక్కల్లో ఒక్క టేకు మినహా ప్రతిదీ పశువులు తినడానికి అస్కారం ఉన్నదే. ఇక ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే అస్కారం ఉన్న గ్రామాలు, కుంటలు, పొలాలు, గట్లు తదితర ప్రదేశాల్లో నాటిన మొక్కల సంరక్షణ కత్తిమీదసామే. సమ్మె దెబ్బ... మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది సమ్మె చేస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా పనులు నిలిచిపోయాయి. నెల రోజులుగా సమ్మె కొనసాగుతుండటంతో ఉపాధి హామీ పనులు పూర్తిగా బందయ్యాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఈసీలు, ఏపీవో ఇలా మొత్తం సిబ్బంది సమ్మెలో పాల్గొంటుండటంతో పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. జిల్లాలో 37,520 శ్రమశక్తి సంఘాలు ఉండగా జాబ్ కార్డులు కలిగినవారు 5,56,753 మంది ఉన్నారు. తూప్రాన్ మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక్కో పంచాయతీ 40 వేల మొక్కలు పెంచేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ.. కార్మికుల సమ్మెతో ఈ లక్ష్యం నెరవేరే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. -
‘ఉపాధి’పైసమ్మెట
జోగిపేట : ఉపాధి హామీ పథకం కూలీలకు పస్తులే దిక్కవుతున్నాయి. ఈజీఎస్ సిబ్బంది సమ్మె బాట పట్టడమే ఇందుకు కారణం. ఏడాది పొడవునా పనులు చేయించే సిబ్బందే విధులను బహిష్కరించి సమ్మె చేయడంతో కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. వారికి పనులు కల్పించే విషయమై ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించినా పూర్తి స్థాయిలో సఫలీకృతం కావడంలేదని తెలుస్తోంది. ఫలితంగా హరితహారం పథకానికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో కూలీలు గుంతలు తవ్వి మొక్కలు నాటే పనులు చేపట్టాల్సి ఉంటుంది. 20 రోజులుగా సిబ్బంది ధర్నా చేస్తుండటంతో తాము పనులు చేపడితే ఎవరు రికార్డు చేస్తారు? డబ్బులు వస్తాయా? పని దినాలు పరిగణనలోకి తీసుకుంటారా? అన్న విషయమై అనుమానాలను కూలీలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 34 వేల శ్రమ శక్తి సంఘాలుండగా, 7 లక్షల మంది కూలీలు ఈజీఎస్ పనులు చేపడుతున్నారు. 12.15 లక్షల మంది వివిధ రకాల కూలీ పనుల కోసం జాబ్‌కార్డులను పొందినవారున్నారు. 2015-16 సంవత్సరానికిగాను 1.20 కోట్ల పనిదినాలు చేపట్టేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. జూలై మాసం వరకు 83 లక్షల పనిదినాలను పూర్తి చేయాల్సి ఉండగా ఈజీఎస్ సిబ్బంది సమ్మె కారణంగా 73 లక్షల పనిదినాలను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సీజన్లో కేవలం గుంతలు మాత్రమే తవ్వే పనులు చేపట్టాల్సి ఉండడంతో ఎంపీడీఓల జోక్యంతో జిల్లాలోని అక్కడక్కడ ఈజీఎస్ కూలీలతో పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో మాత్రం ఎక్కడా పనిచేయడంలేదనే చెప్పవచ్చు. ‘హరితహారా’నికి తప్పని తిప్పలు జిల్లా వ్యాప్తంగా హరితహారం కింద 1.50 కోట్ల వరకు మొక్కలను పెంచేందుకు ఈజీఎస్ ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేశారు. అయితే నర్సరీల నిర్వహణ ఖర్చులు, కూలీల డబ్బులు చెల్లించాల్సి ఉంది. సమ్మె కారణంగా వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో నిర్వాహకులు మొక్కలు ఇచ్చేందుకు అభ్యంతరం తెలుపుతున్నారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లోనే ఈజీఎస్ పథకం కింద ఎక్కువ పనులు చేపడతారు. గత సంవత్సరం 22వేల కుటుంబాలు 100 రోజుల పనిదినాలను పూర్తి చేయగలిగారు. జిల్లాలోని కొంత మంది కూలీలు అక్కడక్కడా గుంతలు తీసే పనుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఇప్పటి వరకు 10 నుంచి 12 లక్షల వరకు గుంతలు తీసినట్లు సమాచారం. ఒకవేళ ఈజీఎస్ సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేసినట్లయితే 80 లక్షల వరకు గుంతలు తీసే అవకాశం ఉండేదని ఈజీఎస్ సిబ్బంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈజీఎస్ సిబ్బంది సమ్మె కారణంగా హరితహారం కార్యక్రమానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపి హరిత హరం పథకానికి పూర్తి స్థాయిలో సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం ఈజీఎస్ సిబ్బంది సమ్మె కారణంగా కూలీలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది. మండలాల్లో ఎంపీడీలకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. పలు ప్రాంతాల్లో కూలీలు పనిచేస్తున్నట్లు తమ వద్ద రికార్డులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో కాకున్నా కూలీలకు పనులను మాత్రం కల్పిస్తున్నాం. హరితహారం కార్యక్రమంలో గుంతలు తీసే పనులను చేపడుతున్నాం. కూలీలకు సంబంధించి కూలీ డబ్బులు బకాయిలు ఉన్నట్లు తన దృష్టిలో లేదన్నారు. - ఓజే మధు, ఇన్చార్జి పీడీ -
హరిత ఉద్యమం చేద్దాం
శామీర్‌పేట్ : దేశం ఎడారిలా మారకముందే హరితహారంను ఒక ఉద్యమంలా చేపట్టాలని, ప్రతి విద్యార్థి ఒక సైనికుడు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ‘హరితహారం’లో భాగంగా తూంకుంట పరిధిలోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్, శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణ, తుర్కపల్లిలో జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ఆవరణలో శనివారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ఒక ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. కరువు కాటకాలు రావడానికి వర్షాలు రాక పోవడమే కారణమని, వర్షాలు పడకపోవడానికి అడవులు లేకపోవడమే కారణమన్నారు. అడవులను పెంచితే వర్షాలు కురిసి దేశం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. మొత్తం పది జిల్లాలో 230 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ప్రతి కుటుంబంతో పాటు అన్ని వర్గాల ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు ఏకమై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షిస్తే మూడేళ్లలో రాష్ట్రం పచ్చగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి జలాలతో శామీర్‌పేట్ చెరువును నింపుతాం.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. తాగునీరు, రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు వేగవంతంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. శామీర్‌పేట్ మండలంతో పాటు నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కాళేశ్వరం నుంచి శామీర్‌పేట్‌కు గోదావరి జలాలు తరలించేందుకు రూ.3వేల కోట్లు కేటాయించి పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. పాములపర్తి నుంచి శామీర్‌పేట్ పెద్ద చెరువులోనికి గోదావరి జలాలు తీసుకువచ్చి సంవత్సరంలోగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు పద్మారావు, జోగురామన్న, ఎమ్మెల్యేలు మలిపెద్ది సుధీర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కనకారెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారులు గుత్తా జ్వాల, సింధూ, కష్యప్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డెరైక్టర్ దినకర్‌బాబు, స్కూల్ డెరైక్టర్ నర్సయ్య, ప్రిన్సిపాల్ ఎస్.వి.ప్రకాశ్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శశిధర్‌రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, జేసీ రజత్‌కుమార్ సైనీ, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక, ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణుగౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు ఎద్దునగేశ్, బత్తుల కిశోర్‌యాదవ్, నీరుడి కృష్ణ, ఎంపీటీసీలు సుదర్శన్, రేనుక మహేందర్, జహంగీర్, మల్లేష్‌గౌడ్, తహసీల్దార్ దేవుజా, ఎంపీడీఓ శోభారాణి, ఎంఈఓ వరలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఓవైపు పెంచుడు.. మరోవైపు నరుకుడు
- ముఖ్యమంత్రి ఆశయానికి తూట్లు - యథేచ్ఛగా చెట్లు నరికివేత - సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు - కలప లారీకి నామమాత్రంగా రూ.2 వేలు జరిమానా బషీరాబాద్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రారంభించగా.. మరోవైపు అక్రమార్కులు చెట్లను నరికి సొమ్ముచేసుకుంటున్నారు. సర్కార్ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభిస్తే బషీరాబాద్‌లో రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో అక్రమార్కులు చెట్లను నరికి తరలించారు. అధికారులు మాత్రం నామమాత్రంగా రూ. 2 వేల జరిమానా విధించి కలప లారీని పంపించడం పలు విమర్శలకు తావిస్తోంది. వివరాలు.. బషీరాబాద్‌లోని ఇందర్‌చెడ్ మార్గంలోని ఈద్గా వెనుకాల ఓ లారీలో కలపను లోడ్ చేస్తున్నారు. పలు గ్రామాల నుంచి చెట్లను నరికి ట్రాక్టర్లలో లారీ వద్దకు తీసుకువచ్చి లోడ్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో అక్రమార్కులు ఈ తతంగం నడిపించినా అధికారులకు తెలియకపోవడం గమనార్హం. బషీరాబాద్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వీఆర్వోలు నామమాత్రంగా రూ.2 వేలు జరిమానా వేసి త్వరగా లోడు తరలించాలని అక్రమార్కులకు సలహా ఇచ్చి వెళ్లడం గమనార్హం. శుక్రవారం ఉదయం మొక్కలు నాటాలని పాఠశాల నుంచి ర్యాలీ తీశామని, మరోవైపు అక్రమార్కులు చెట్లను నరికి తరలించుకుపోతే పట్టించుకునే వారేలేరని విద్యార్థులు అసహనానికి గురయ్యారు. అధికారులు అండదండలు! అక్రమార్కులు అధికారుల అండదండలతోనే చెట్లను నరికి సొమ్ముచేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం ముండల పరిధిలోని పలు గ్రామాల నుంచి లారీల్లో కలప తరలించుకుపోతున్నా ఇటు అటవీశాఖ అధికారులు గాని, అటు రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతరించి పోతున్న అడవి.. మండల పరిధిలో ఉన్న అటవీప్రాంతం రోజురోజుకూ అంతరించుకుపోతోంది. ఫారెస్టు అధికారులు అడవులను పర్యవేక్షణ మరిచి తాండూరు రేంజ్ కార్యాలయంలోనే ఉంటూ టైమ్‌పాస్ చేస్తున్నారని మండలవాసులు ఆరోపిస్తున్నా రు. గతంలో మైల్వార్, నీళ్లపల్లి గ్రామా ల్లో కొందరు చెట్లను నరికి పొలం చదునుచేసి సాగుచేసుకోవడం.. ఫారెస్టు అధికారుల పనితీరుకు నిదర్శనం. రూ.2వేలు జరిమానా వేశాం బషీరాబాద్ శివారులో లారీలో కలపను తరలిస్తున్నారనే సమాచారంతో వీఆర్ఓలను పంపించాం. రూ. 2 వేల జరిమానా కూడా విధిం చాం. మా అధికారులే దగ్గరుండి కలప లోడ్‌ను పంపించారనే విషయం నా దృష్టికి రాలేదు. -భిక్షపతినాయక్, తహసీల్దార్, బషీరాబాద్ -
వన సంపదను నాశనం చేసుకోవద్దు
అడవులను కాపాడడం మనందరి బాధ్యత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిలుకూరులో హరిత హారానికి శ్రీకారం బాలాజీ టెంపుల్ ఆవరణలో సంపంగి మొక్క నాటిన సీఎం కుటుంబ సమేతంగా బాలాజీ దర్శనం సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: అటవీ సంపద తరిగిపోవడంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తన చిన్నతనంలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపించేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వానలు కూడా రాకుండా పోయాయని అన్నారు. శుక్రవారం మొయినాబాద్ మండలం చిలుకూరులో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన సీఎం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘వికారాబాద్ అనంతగిరిలో అద్భుతమైన అడవి ఉండేది. ‘కరీంనగర్, ఆదిలాబాద్ నుంచో ఎవరైనా ఇక్కడికి వచ్చి నెలరోజులపాటు ఉంటే.. తెల్లగ నిగనిగలాడేవోళ్లు.. వాళ్లను చూసిన వాళ్లెవరైనా నీకు గండిపేట నీళ్లు బాగా పడ్డయనేవాళ్లు.. అది గండిపేట నీళ్లలో మహాత్యం..’ అని సీఎం గుర్తుచేశారు. మొక్కల సంరక్షణ గ్రామ సేవకులదే.. మొక్కలు నాటడంలో గ్రామ సేవకులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఇద్దరు ఉద్యోగులున్నారు. ఒకరు వీఆర్ఓ.. మరొకరు గ్రామ కార్యదర్శి. వీరిద్దరు హరితహారంలో మొక్కల పెంపకాన్ని పర్యవేక్షించారు. ఇక వీఆర్ఏలకు పనిలేకుండా పోయింది. వారికి చెట్ల సంరక్షణ బాధ్యత అప్పగించాలి. అని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రతి విద్యార్థిని హరితసైనికుడిలా మార్చే బాధ్యత ఉపాధ్యాయలోకంపై ఉందని ఆయన అన్నారు. చిల్కూరు అర్చకులు కూడా ప్రభుత్వానికి సహాకారం అందించాలని, ప్రతి భక్తుడిని ఒక మొక్క నాటమని సూచించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు జోగు రామన్న, మహేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. -
భాగ్యనగరికి పచ్చలహారం
రాజధానికి హరితహారం ఔటర్ ఔటర్ రింగ్ రోడ్డు రాజధానికి హరిత హారంలా ఉంటుందని ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ డెరైక్టర్ శ్వేత మహంతి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డుపై లక్షన్నర మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించాయన్నారు. -గచ్చిబౌలి సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో... రాష్ట్రవ్యాప్తంగా మొదలైన హరిత హారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని సిటీ పోలీసు ట్రైనింగ్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న జాయింట్ పోలీసు కమిషనర్(హెడ్‌క్వార్టర్స్) ఎం.శివప్రసాద్, ఇతర సిబ్బంది, శిక్షకులు. అమీర్‌పేటలో అసదుద్దీన్ ఓవైసీ హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎస్ఆర్నగర్ పోలీసులతో కలిసి శుక్రవారం అమీర్‌పేటలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక నాయకులతోపాటు ఎస్సైలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి రవాణాశాఖలో శుక్రవారం హరితహారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయ ఆవరణలో కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధికారులు టి.రఘునాథ్, పాండురంగారావు, ప్రసాద్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్రావు అన్నారు. శుక్రవారం గోషామహల్ డివిజన్లోని షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో డీసీపీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏసీపీ కొలన్పాక రాంభూపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. అపార్డ్‌లో... రాజేంద్రన గర్ని అపార్డ్‌లో శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపార్డ్‌లో లక్ష మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. -
రేపు సిద్దిపేటలో సీఎం పర్యటన
- పాత బస్టాండ్‌లో కేసీఆర్ ప్రసంగం, 10వేల మందితో సమావేశం - రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు - పట్టణంలోని రోడ్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట రూరల్: సీఎం కేసీఆర్ శనివారం సిద్దిపేటలో పర్యటించనున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం సిద్దిపేటలో మొక్కలు నాటనున్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సీఎం పర్యటన సాగే రూట్లను పరిశీలించారు. సుమారు గంట పాటు ఆయన రోడ్లుపైనే సంబంధిత అధికారులతో చర్చించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని పలు రోడ్లను పరిశీలించారు. సీఎం పట్టణ పరిధిలోని పొన్నాల దాబాల నుంచి సిద్దిపేటకు రానున్న క్రమంలో రహదారికి ఇరువైపులా చెట్లను నాటనున్నారు. అలాగే పట్టణంలోని పాత బస్టాండ్ వరకు మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద సుమారు 10వేల మంది మహిళలతో సమావేశం ఏర్పాటు చేసేందుకు మంత్రి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో సీఎం హరితహారంపై ప్రసంగిస్తారు. పది బ్లాక్‌లుగా విభజన సిద్దిపేట పట్టణాన్ని పది బ్లాకులుగా విభజించినట్లు మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒక్కో బ్లాక్‌ను ఒక్కో శాఖకు కేటాయించి, ఆ బ్లాక్‌లో మొక్కలు నాటే బాధ్యత ఆ శాఖ అధికారులే తీసుకోవాలన్నారు. సీఎం పర్యటిస్తున్న క్రమంలో విజిలేస్తే అధికారులు అలర్ట్ కావాలన్నారు. మొక్కలపై ఆరా సీఎం పర్యటన సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని రోడ్లకు ఇరువైపులా ఎలాంటి మొక్కలు నాటాలని, ఏ మొక్కలు నాటితే బాగుంటుందనే విషయమై మంత్రి అధికారులతో చర్చించారు. రోడ్లకు ఇరువైపులా పలు రకాల మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి పాల్గొన్నారు. జిల్లాలోనే వర్షపాతం తక్కువ సిద్దిపేట రూరల్: గతంలో చైనా ఇసుక తుఫానులతో ఆగమయ్యేదని, తుఫానుల నివారణ కోసం దేశమంతా 80 కోట్ల మొక్కలు నాటడంతో ఇసుక తుఫాన్ జాడలేకుండా పోయిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండాయన్నారు. మెదక్ జిల్లాలో ఎక్కడా ఒక్క చెరువు కూడా నిండలేదన్నారు. హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 120 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు భాగస్వాములై మొక్కలు పెంచితే వారికి మంచి గుర్తింపు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, వైస్ ఎంపీపీ శ్రీహరిగౌడ్, ఎంపీడీఓ సమ్మిరెడ్డి పాల్గొన్నారు. లక్షా ఇరవై వేల ట్రీ గార్డులు అందజేస్తాం: మంత్రి నంగునూరు: హరితహారం పథకంలో భాగంగా జిల్లాకు లక్షా ఇరవై వేల ట్రీగార్డులు అందజేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం జరిగిన నంగునూరు మండల సర్వసభ్య సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో అడవులు ఎక్కువగా ఉన్నందునే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడవులను పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు ప్రతి గ్రామంలో 40 వేల చొప్పున మొక్కలు నాటి హరిత తెలంగాణలో భాగస్వాములు కావాలన్నారు. మెదక్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున మొక్కలను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో జిల్లాకు కోటి 20 లక్షల ట్రీగార్డులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రతి గ్రామానికి వంద చొప్పున ట్రీ గార్డులు అందజేసి 20 వేల ట్రీగార్డులు కలెక్టర్ ఆధీనంలో ఉంచుతామన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు, రోడ్ల వెంబడి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ప్రజాప్రతినిధుకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ ఉపాద్యక్షుడు నర్సింలు, నాయకులు దువ్వల మల్లయ్య, ఎంపీడీఓ ప్రభాకర్, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, మంత్రి ఓఎస్డీ బాలరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసాచారి, ఇరిగేషన్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
శభాష్ కలెక్టర్ !
- హరితహారం కార్యాచరణ భేష్ - కలెక్టర్ కరుణను అభినందించిన మంత్రి కేటీఆర్ హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కలెక్టర్ వాకాటి కరుణనుయ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో హరితహారం, పుష్కర పనులు, ఇతర గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ మంత్రి జోగురామన్న, గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జిల్లాలో 10 వేల ఎకరాల పోడు భూముల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటించే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. రా ష్ట్రంలో ఇది ఒక రికార్డ్డుగా నిలిచిపోతుందని అభినందనలు తెలిపారు. కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ జిల్లాలో మొక్కలు నాటిన తర్వాత ర క్షణ కోసం ట్రీగార్డులు కొనుగోలు చేయుస్తున్నామని తెలిపారు. హరితహారం విజయవంతం కోసం గ్రామా ల్లో మహిళా సంఘాలు, వనసంరక్షణ సమితుల సహకారం తీసుకుంటామని తెలి పారు. గ్రామాలు, నర్సరీల వారిగా మొక్కల వివరా లు ఆన్లైన్లో ఉంచామని తెలిపారు. సమావేశంలో డీపీఓ ఈఎస్నాయక్, డీఎఫ్‌వోలు పాల్గొన్నారు.