వాడిపోతున్న హరితం
♦ పట్టించుకొనేవారు లేక
♦ నేలవాలుతున్న మొక్కలు
తెలంగాణకు ‘హరితహారం’ కలగానే మిగిలేట్టుంది. ప్రతి అడుగూ పచ్చందాలు పరుచుకోవాలన్న ఆకాంక్ష ‘మొగ్గ’గానే వాడిపోతోంది. మెదక్ డివిజన్‌లో.. నాటిన మొక్కలకు నీరు పోసే దిక్కే లేక... సంరక్షించేవారు లేక ‘హరితహారం’ మరో ఉద్యమంలా సాగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి ఆదిలోనే గండి పడుతోంది.
మెదక్ టౌన్ : మన బిడ్డల భవిష్యత్తు కోసం మొక్కలు నాటాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టుబట్టి, జట్టుకట్టి ఉద్యమించిన ప్రజలు స్ఫూర్తితో రాష్ట్రంలో మరో ఉద్యమంలా ‘హరితహారం’ చేపట్టాలి... ఇదీ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు. కానీ మెదక్ డివిజన్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పచ్చదనానికి ఆదిలోనే హంసపాదు పడుతోంది. రాష్ర్టంలో అటవీ సంపదను పెంచి వాతావరణ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సర్కారు చేపట్టిన ఈ ప్రాజెక్టు నీరుగారిపోతోంది. దీని కింద డివిజన్‌లో నాటిన మొక్కలు చాలాచోట్ల చెట్లు ఎండిపోతున్నాయి. మరో వైపు ఎండలు మండుతుండటంతో మొక్కల పంపిణీకి తాత్కాలికంగా బ్రేకు పడింది.
పర్యవేక్షణ ఎక్కడ?
‘హరితహారం’లో మొదటి విడతగా మెదక్ రెవెన్యూ డివిజన్‌లో కోటి మొక్కలు నాటాలన్నది లక్ష్యం. వీటిల్లో ఇప్పటి వరకు సుమారు 10 లక్షల గుంతలు తవ్వి 1.2 లక్షల మొక్కలు నాటారు. అంతేకాదు వాటి సంరక్షణ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు అప్పగించారు. పట్టించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మంత్రులు, ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఇందుకు గాను ప్రతి గ్రామ పంచాయితీలో కోఆర్డినే షన్ అధికారులను నియమించారు. ఆ గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ, వీఆర్‌ఏ, మహిళ, యువజన సంఘాలు ప్రజలను సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ కూడా అంతే బాధ్యతగా చేయాలి.
కానీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు, నీళ్లు లేని ప్రాంతాల్లో నాటడం తదితర కారణాలతో అవి ఎండిపోతున్నాయి. ఇక బాధ్యత తీసుకోవాల్సివారు వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక ఆదరాబాదరా నాటినవి, ట్రీగార్డు లేనివి పశువులకు ఆహారంగా మారుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మొక్కలకు ట్యాంకర్లు, ఫైరింజన్ల ద్వారా నీరుపోయించే ప్రయత్నాలు మందకొడిగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్‌లు, పంచాయితీ కార్మికులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉండటంతో ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి.