పట్నానికి ప్రగతి వెలుగులు
► భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పనపై సర్కారు దృష్టి
► కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వేల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధం
► ప్రణాళికలు రూపొందించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలు
► హైదరాబాద్‌కు మంచినీటి రిజర్వాయర్లు నిర్మించాలి
►ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలి
► నిజామాబాద్, కరీంనగర్‌లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ
► పట్టణాలు, నగరాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలి
► అక్రమ కట్టడాలను నియంత్రించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో భారీ ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు 62 మున్సిపాలిటీల్లో మంచినీటి సరఫరా, డ్రైనేజీల నిర్వహణ, సీవరేజ్ పనులు, రహదారుల నిర్మాణాలకు పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే 35 ఏళ్ల వరకు సరిపడ రీతిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయిం చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జల మండలి, పబ్లిక్ హెల్త్ విభాగాలు గత కొద్ది రోజులుగా ఈ మేరకు ప్రాథమిక నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు దేశీయ, విదేశీ ఆర్థిక సంస్థల నుంచి వేల కోట్ల రుణాలు సమీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై మరోసారి విస్తృతంగా చర్చించారు.
నిధులిచ్చేందుకు సిద్ధం
మౌలిక సదుపాయాల కోసం కార్యాచరణ రూపొందించాలని, తగిన నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం అధికారులకు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నగరానికి మంచి నీటి రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు ప్రతీ ఇంటికి మంచినీటి సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నిజామాబాద్, కరీంనగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. నగరాలు, పట్టణాలు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చెందాలని, అక్రమ నిర్మాణాలు, కట్టడాలను నియంత్రించాలని స్పష్టంచేశారు. పట్టణ ప్రాంతాల్లో బలహీన వర్గాలకు గృహ సముదాయాల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషన ర్ సోమేశ్‌కుమార్, పురపాలక శాఖ సంచాలకుడు జనార్దన్ రెడ్డి, వరంగల్ కమిషనర్ సర్ఫరాజ్ అహమ్మద్ ఈ భేటీలో పాల్గొన్నారు.
రుణాల కోసం వేట..
మౌలిక వసతుల కోసం చేపట్టే ప్రాజెక్టులకు భారీ ఎత్తున రుణాలను సమీకరించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. పట్టణ ప్రాంత వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అవసరాల కోసం రూ.10 వేల కోట్ల రుణాలను సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో రూ.2 వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు హడ్కో సంసిద్ధత వ్యక్తం చేయగా.. మిగిలిన రూ.8 వేల కోట్లను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్(ఐఎల్‌ఎఫ్‌ఎస్) నుంచి పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సోమవారం ఐఎల్‌ఎఫ్‌ఎస్ ప్రతినిధులతో కూడా సీఎం చర్చలు జరిపారు. గ్రేటర్ హైదరాబాద్ నగర శివార్లలో రేడియల్ రోడ్లు, నగరంలో రహదారుల నిర్మాణం, మూసీ ప్రక్షాళనతోపాటు ఇతర పనుల కోసం రూ.20 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులకు ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. అలాగే వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లలో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, సీవరేజీ సదుపాయాల కోసం రూ.6 వేల కోట్లతో పనులు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులకు కావాల్సిన రూ.26 వేల కోట్లను ‘బ్రిక్స్’ బ్యాంక్ నుంచి సమీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం.