దేవుళ్లకు డబ్బులు... కార్మికులకు మొండిచెయ్యా?
* బస్సు యాత్ర ముగింపు సభలో సీఎం కేసీఆర్‌పై తమ్మినేని ధ్వజం
* ఆయన హైదరాబాద్‌కే ముఖ్యమంత్రా?
* జీహెచ్‌ఎంసీ కార్మికులకు జీతాలు పెంచి ఇతరులను విస్మరించడం తగదు
* కేసీఆర్, చంద్రబాబు ఒకే గూటి పక్షలు: చాడ
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం కేసీఆర్ దేవుళ్లకు పుష్కలంగా డబ్బులు పెట్టిండు. యాదగిరిగుట్టకు రూ.200 కోట్లు, వేములవాడకు రూ.100 కోట్లు ఇచ్చిండు. బెజవాడ కనకదుర్గమ్మకు రూ.6 కోట్లతో ముక్కుపుడుక చేయించిండు.
కానీ ముక్కుపుటాలు అదిరే దుర్గంధంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం మొండి చెయ్యి చూపిండు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. కేసీఆర్ కేవలం హైదరాబాద్‌కే సీఎంగా భావిస్తున్నారా అని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంటే కేసీఆర్ కేవలం జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాలు పెంచి ఇతర మున్సిపాలిటీల కార్మికులను విస్మరించడం తగదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతుగా 10 వామపక్ష పార్టీలు ఈ నెల 21 నుంచి చేపట్టిన బస్సు యాత్ర ముగింపు సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన బహిరంగ సభలో తమ్మినేని ప్రసంగించారు.
రాష్ట్రంలో మిగులు ఆదాయం ఉందని పదేపదే గొప్పలకు పోతున్న ప్రభుత్వం... పారిశుద్ధ్య కార్మికుల కనీస కోరికలను నెరవేర్చేందుకు డబ్బులు లేవనడం సమంజసం కాదన్నారు. ప్రజలు, కార్మికులే దేవుళ్లు అంటూ ఎన్నికలకు ముందు గొప్పలకు పోయిన కేసీఆర్ దృష్టిలో నేడు వారంతా దయ్యాలయ్యారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఆయన కొడుకు, కోడలు, అల్లుడు, కూతురు తప్ప ప్రజలెవరూ బాగుపడలేదన్నారు.
కేసీఆర్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదు...
తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ ఒకే గూటి పక్షులని, ఇరు రాష్ట్రాల్లో కార్మికుల సమ్మె చేస్తుంటే ఇద్దరు సీఎంలూ అణచివేత విధానాన్నే ఎంచుకున్నారని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలకు ఏం మేలు చేయకుండానే తెలంగాణ, ఏపీ సెంటిమెంట్‌లను అడ్డుపెట్టుకుని కేసీఆర్, చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. పేద, బడుగు, బలహీనవర్గాల శాఖలన్నీ తన దగ్గరే పెట్టుకున్న కేసీఆర్ వారిని ఏం ఉద్ధరించారని ప్రశ్నించారు.
పాలనను తన కుటుంబం గుప్పిట్లో పెట్టుకున్న కేసీఆర్ ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నారని, ఏదో ఒక రోజు వారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. మీడియాతో బాధలు చెప్పుకున్నంత మాత్రాన 1,050 మంది జీహెచ్‌ఎంసీ కార్మికులను వెతికివెతికి ఉద్యోగాల నుంచి కేసీఆర్ తొలగింపజేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ ఏడాది పాలనలో ఇందిరాపార్కు వద్ద జరిగిన ధర్నాలు, ఆందోళనలు మరెప్పుడూ జరగలేదని ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపాలిటీల కార్మికులను ప్రభుత్వం విభజించి పాలిస్తోందని సీపీఎం నేత చెరుపల్లి సీతారాములు విమర్శించారు.
ప్రజల జీవితాలేం మారలేదు.. విమలక్క
తెలంగాణ స్వప్నం సాకారమైనా, ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ప్రజల జీవితాలు ఉన్నాయని, పాలకుల జీవితాలు మాత్రం వెలిగిపోతున్నాయని అరుణోదయ సంస్థ అధ్యక్షురాలు విమలక్క విమర్శించారు. సర్వరోగ నివారిణిగా తెలంగాణను భావించడం పొరపాటైందన్నారు. కార్మికుల జీవితాలను మారుస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చినవాళ్లు నేడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ సర్కారు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని, ఎక్కడికీపోవాల్సిన వాళ్లు అక్కడికి వెళ్లిపోతారన్నారు. ఇలానే వ్యవహరించిన గత పాలకులకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికీపడుతుందని మండిపడ్డారు. దళితులు, పేదలపట్ల తమకెంతో ప్రేమ ఉందని చెప్పుకుంటూనే మరోవైపు పొట్టకొడుతున్న పాలకులపై తిరుగుబాటు చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే నవ తెలంగాణ నిర్మాణానికి పోరాడి దొంగల భరతం పట్టాలన్నారు.
భవిష్యత్ కార్యాచరణపై నేడు లెఫ్ట్ భేటీ
రాష్ర్టవ్యాప్తంగా సమ్మెను కొనసాగిస్తున్న మున్సిపల్ కార్మికులకు మద్దతుగా మరింత ఉధృతంగా కార్యాచరణను చేపట్టేందుకు వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సమావేశంలో పది వామపక్షాల నేతలు పాల్గొంటారు. కార్మికులు సమ్మెలో పాల్గొన్నంత కాలం వామపక్షాలు వారికి అండగా నిలబడతాయని ఈ పార్టీలు పేర్కొన్నాయి.
మున్సిపల్ పారిశుద్ధ్య, గ్రామపంచాయతీ కార్మికులు గత 24 రోజులుగా సాగిస్తున్న సమ్మెకు మద్దతుగా పది వామపక్షాలు 20-24 తేదీల్లో పది జిల్లాల్లో 3200 కిలోమీటర్ల మేర బస్సుయాత్రను నిర్వహించి, హైదరాబాద్‌లో ముగింపు సభను నిర్వహించాయి. జీతాలు పెరిగే దాకా సమ్మెను కొనసాగిస్తామని ఈ బస్సు జాతా సందర్భంగా కార్మికులు పట్టుదలను ప్రదర్శించడాన్ని ఈ పార్టీలు అభినందించాయి. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల డిమాండ్లపై నిరంకుశంగా, మొండిగా వ్యవహరించడాన్ని ఖండించాయి.