సమ్మె బాటలో పారిశుద్ధ్య కార్మికులు
-
కార్మికుడిపై మేయర్ అనుచరులు దాడికి నిరసన
-
మూడు రోజులగా నగరంలో పేరుకుపోయిన చెత్త
నెల్లూరు, సిటీ:నెల్లూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు నగర పాలక వర్గం చిన్నచూపు చూస్తోంది. 279జీఓతో తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని, ఆ జీఓను అమలు చేయొద్దంటూ నిరసన చేపట్టిన కార్మికులపై నగర మేయర్ అజీజ్ అనుచరులు శుక్రవారం దాడి చేశారు. దీంతో 37వ డివిజన్‌కు చెందిన కార్మికుడు జయకుమార్ స్పృహకోల్పోయిన విషయం తెలిసిందే. కార్మికుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, మేయర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు గత నెల 29వ తేదీ నుంచి కార్పొరేషన్ పరిధిలో కార్మికులు సమ్మెబాట పట్టారు.
ప్రధాన కూడళ్లు, వీధుల్లో పేరుకుపోయిన చెత్త
877 మంది పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టడంతో నగరంలోని వీధుల్లో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయింది. నగరంలోని ప్రధాన కూడళ్లు వీఆర్సీసెంటర్, మద్రాసు బస్టాండ్, ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్, గాంధీబొమ్మ తదితర ప్రాంతాల్లో రోడ్లపై చెత్త పేరుకుపోయింది.
చర్యలు తీసుకోని కార్పొరేషన్
కార్మికులు సమ్మెబాటలో ఉంటే నగర పాలక సంస్థ అధికారులు చెత్త తొలగింపునకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే ప్రజారోగ్య శాఖ అధికారులు ప్రత్యేక వాహనాలు, కాంట్రాక్ట్ పద్ధతిన తాత్కాలిక కార్మికులతో చెత్తతరలిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా నగరంలోని ప్రముఖుల ఇళ్ల వద్ద మాత్రమే చెత్తతొలగింపు చర్యలు చేపట్టారని విమర్శలున్నాయి.
రోడ్లు పైనే టపాసుల చెత్త
గత నెల 30వ తేదీన దీపావళి సందర్భంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో టపాసులు కాల్చారు. వాటి నుంచి వచ్చే చెత్తను తొలగించేవారు రాకపోవడంతో రోడ్లుపై ఎటు చూసినా కాల్చేసిన చెత్తే కనిపిస్తోంది.
చర్చలు విఫలం
మేయర్ అజీజ్, కార్మిక సంఘనాయకుల మధ్య సోమవారం సాయంత్రం గంటపాటు చర్చలు జరిగాయి. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ 279జీఓ అమలు చేయబోమని మీరు హామీ ఇవ్వాలని, టెండర్లు పిలవకుండా చూడాలని కోరారు. మేయర్ స్పందిస్తూ తాను మంత్రి నారాయణతో చర్చించి న్యాయం చేస్తామని చెప్పారు. దీంతో సమ్మె కొనసాగించేందుకు కార్మిక సంఘాల నాయకులు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జరిగిన దాడిలో కార్మికుడు జయకుమార్ గాయాలపాలైన విషయంపై మేయర్ స్పందించలేదు. చర్చల్లో కార్మిక సంఘ నాయకుడు పెంచలనరసయ్య ఏపీ మున్సిపల్‌వర్కర్క్స్ నాయకులు అల్లాడి గోపాల్, మస్తాన్‌బీ పాల్గొన్నారు.
పోలీసుల ప్రొటెక‌్షన్‌తో చెత్త తొలగింపు
నగర పాలక సంస్థ పరిధిలో చెత్తపేరుకుపోవడంతో మేయర్ అజీజ్, అధికారులు పోలీసుల ప్రొటెక‌్షన్‌తో మంగళవారం నుంచి చెత్త తొలగింపునకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఒక్కో డివిజన్ నుంచి 10 నుంచి 15 మంది కార్మికులతో చెత్త తరలించనున్నారు. కార్మికుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ముందస్తు సమాచారంతో పోలీసుల ప్రొటెక‌్షన్‌ను తీసుకోనున్నారు.