సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగిలిన 72 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న 16 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు బుధవారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న కార్మికుల వేతనాల పెంపు డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు దిగుతున్నామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం ప్రకటించింది. కార్మికుల వేతనాలను తక్షణమే పెంచాలని జేఏసీ నేతృత్వంలోని కార్మిక సంఘాలు మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నాయి.
ప్రస్తుతం పురపాలికల్లో పని చేస్తున్న కార్మికులకు ప్రతి నెలా రూ.8,300 వేతనం చెల్లిస్తున్నారు. జీవో నం.14 ప్రకారం కార్మికుల వేతనాలను కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా వరుసగా రూ.17.5 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలకు పెంచాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. వేతనాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఈనెల 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొంటూ 11న పురపాలక శాఖ డైరెక్టర్‌కు సమ్మె నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నామని ప్రకటించింది.
స్తంభించనున్న సేవలు..
మునిసిపల్ సమ్మెతో రాష్ట్రంలోని పురపాలికల్లో కీలకమైన పారిశుధ్య సేవలు స్తంభించిపోనున్నాయి. నగరాలు, పట్టణాల్లో టన్నుల కొద్దీ చెత్త, వ్యర్థ పదార్థాలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. పార్కులు, నీటి సరఫరా, వీధి దీపాలు, మలేరియా నివారణ విభాగాల్లోని సిబ్బందితోపాటు బిల్ కలెక్టర్లు, సూపర్‌వైజర్లు, ఆఫీసు సిబ్బంది కూడా సమ్మెబాట పట్టనున్నారు. దీంతో ఆయా విభాగాల్లో పౌర సేవలకు ఇక్కట్లు ఎదురుకానున్నాయి. అత్యంత దయనీయ పరిస్థితిలో పారిశుధ్య పనులు నిర్వహించే మునిసిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం శోచనీయమని ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీల కార్మికుల సంఘాలతో ఏర్పడిన మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ మండిపడింది.
‘దేవుళ్ల’ ఎదురుచూపు!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేతనాల పెంపు డిమాండ్‌తో 2015 జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు సమ్మె నిర్వహించారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యర్థాలు, చెత్త పేరుకుపోయి సామాన్య ప్రజలు తీవ్ర అవస్తలకు గురయ్యారు. సమ్మెకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాలు పెంచింది. సమ్మె విరమిస్తే మిగిలిన పురపాలికల్లో పని చేస్తున్న కార్మికుల వేతనాల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో ప్రకటించడంతో కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. సఫాయివాలాలను దేవుళ్లతో పోల్చి వారి సేవలను ఆకాశానికెత్తారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ అపరిష్కృతంగానే ఉండిపోయింది.
వేతనాలు పెంచినా చెల్లించాల్సింది పురపాలికలే కాబట్టి అవే నిర్ణయం తీసుకోవాలన్న ప్రభుత్వ వాదనలో ఎలాంటి మార్పు రాలేదు. మరోవైపు పురపాలికల ఆదాయం అంతంత మాత్రమే ఉందని, వేతనాలు పెంచితే చెల్లించే స్తోమత పురపాలికలకు లేదని మేయర్లు, మునిసిపల్ చైర్‌పర్సన్లు తేల్చి చెప్పారు. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలనే మూడు నెలలకోసారి చెల్లిస్తున్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుందో అలానే ఇతర పురపాలికల కార్మికుల విషయంలోనూ అలానే నిర్ణయం తీసుకోవాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment