ఈ చెత్తకిక మోక్షం లభించినట్లే
మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మె విరమించేందుకు మున్సిపల్ కార్మికులు అంగీకరించారు. హైదరాబాద్‌లో రూ. 8500, మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో రూ.8.300, నగర పంచాయతీ కార్మికులకు రూ.7.300 వంతున జీతం పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే హైదరాబాద్‌లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్ పథకం కింద కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కూడా అంగీకారం కుదిరింది. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో కార్మికులకు ఇందిరమ్మ పథకం కింద గృహ నిర్మాణానికి అంగీకరించారు.
పదో పీఆర్సీ అమలైన వెంటనే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకొంది. రెగ్యులర్ ఉద్యోగులకు జీపీఎఫ్ అకౌంట్లకు కూడా అంగీకారం కుదిరింది. జీహెచ్ఎంసీ, జీవీఎంసీ, విజయవాడలో కార్మికులకు సిటీ అలవెన్సులను ఇచ్చే విషయంలో స్థానిక సంస్థల్లో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల హెల్త్ కార్డుల అంశంపై లేఖ రాస్తానని కార్మిక నేతలకు మున్సిపల్ శాఖ మంత్రి మహిధర్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఇవి కాక ఇంకా..
ప్రమాద బీమా కల్పిస్తారు, కొబ్బరినూనె, సబ్బులు, చెప్పులు, గ్లోవ్స్, యాప్రాన్లు, మాస్కులు తదితర రక్షణ సామగ్రి అందిస్తారు. ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు రూ. 10,000 ఇస్తారు. వారాంతపు సెలవులు, ప్రభుత్వ సెలవులు వర్తిస్తాయి. ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఎప్పటికప్పుడు చెల్లించడంతో పాటు ఎవరికి వారికి విడివిడిగా స్లిప్పులు ఇస్తారు.