Wages hike
-
ఉపాధి హామీ పని దినాలు పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్ కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటగా 14 కోట్ల పని దినాల కల్పనకు ఆమోదం తెలిపిన కేంద్రం.. ప్రస్తుతం ఆ కేటాయింపులను 19 కోట్ల పని దినాలకు పెంచింది. ఈ పథకం ద్వారా ప్రస్తుత ఆర్థిక ఏడాదికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత పేదలకు పనుల కల్పనలో అదనపు పని దినాల కేటాయింపుపై గురువారం ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో పని దినానికి రూ.428 చొప్పున కేటాయింపు ఒక్కొక్క పని దినానికి గరిష్టంగా రూ.428 చొప్పున గ్రామీణాభివృద్ధి శాఖకు అందుతాయి. పేదలకు వారు చేసే రోజు వారీ పని ఆధారంగా కూలీ రూపంలో గరిష్టంగా రూ.257 చొప్పున అందజేస్తారు. కూలీల వేతనాల ఆధారంగా మిగిలిన రూ.171 మెటీరియల్ కేటగిరీ నిధులుగా పేర్కొంటారు. మెటీరియల్ కేటగిరీ నిధులను 75–25 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి ఇప్పటికే 17.30 కోట్ల పని దినాల పాటు పేదలకు పనులు కల్పన పూర్తయిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా.. 19 కోట్ల పని దినాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించింది. వీటిని పూర్తి చేసిన వెంటనే అదనపు పని దినాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయగా.. అదనపు కేటాయింపులు కూడా చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు హామీ ఇచ్చారు. -
గోపాలమిత్రలకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక శాఖ పరిధిలో పనిచేస్తున్న గోపాలమిత్రలకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న నెలవారీ వేతనానికి అదనంగా 30 శాతం పెంచుతున్నట్టు వెల్లడించింది. గోపాలమిత్రలకు రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరహాలోనే 30 శాతం వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీచేశామని, ప్రస్తుతం నెలకు వస్తున్న రూ.8,500కు తోడు పెంచిన 30 శాతం (రూ.2550) కలిపి రూ.11,050 చెల్లిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి అందుబాటులో ఉంటూ పాడిగేదెలకు కృత్రిమ గర్భధారణ, వ్యాక్సినేషన్, నట్టల నివారణ మందుల పంపిణీ లాంటి కార్యక్రమాల అమలులో సేవలందిస్తున్న గోపాల మిత్రలను ప్రభుత్వ గుర్తించి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణలో గోపాలమిత్రలకు ఇస్తున్న వేతనాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తాజా పెంపుతో 1,530 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. (చదవండి: ఉపఎన్నికలో ఓ గ్రామ ఇన్చార్జిగా కేసీఆర్.. ఏ గ్రామానికి అంటే?) -
గుడ్‌న్యూస్: గెస్ట్ లెక్చరర్ల వేతనాలు.. గంటకు రూ. 90 పెంపు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని గెస్ట్ లెక్చరర్ వేతనాలు గంటకు రూ.300 నుంచి 390 వరకూ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి రొనాల్డ్ రాస్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నెలకు 72 గంటలపాటు బోధించే అవకాశం కల్పించాలని, నెలసరి వేతనం రూ. 28,080కి పరిమితం చేయాలని జీవోలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దాదాపు 2 వేలమంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. వేతనం పెంపు నిర్ణయం పట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణ చేయకుంటే 12న ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్ కళా శాలల్లోని కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీ కరించాలని, ఆ జాబితాను ఈ నెల 12లోగా ప్రభుత్వానికి పంపకుంటే అదేరోజు ఆందోళన చేపడతామని ఇంటర్ విద్యా పరి రక్షణ సమితి హెచ్చరించింది. ఈ మేరకు ఇం టర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణ గౌడ్, సమన్వయకర్త మైలారం జంగయ్య, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీ కరణ సాధన సమితి సమన్వయకర్త కొప్పిశెట్టి సురేష్ ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. -
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భరోసా
సాక్షి, అమరావతి: ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం 2019 నుంచి రాష్ట్రప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకున్నట్టు కార్యదర్శుల కమిటీ తన నివేదికలో తెలిపింది. 27 శాతం ఐఆర్ అమలు, అంగన్వాడీ, ఆశ, ఇతర ఉద్యోగుల వేతనాల పెంపు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల కారణంగా ప్రభుత్వంపై అదనపు భారం పడినట్టు పేర్కొంది. ► ప్రభుత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్రప్రభుత్వం 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్ అమలు చేస్తోంది. ► 2019 జూలై 1 నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఐఆర్ కింద ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.15,839.99 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.11,270.21 కోట్లు, ఉద్యోగుల కోసం, రూ.4,568.78 కోట్లు పెన్షనర్ల కోసం వెచ్చించింది. ► అంగన్వాడీలు, ఆశావర్కర్లు, హోమ్‌గార్డులు సహా 3,01,021 మంది ఉద్యోగులకు జీతాలు, రోజువారీ వేతనాలు పెంపొందించింది. వీరి వేతనాలు, జీతాల కోసం సంవత్సరానికి చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ► కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వీరికి మినిమం టైమ్ స్కేల్‌ను అమలులోకి తెచ్చింది. ఈ ఏడాది జూన్ 18న టైమ్ స్కేల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. మొదటి రెండు ప్రసవాలకు మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులను వర్తింపచేసింది. ► కాంట్రాక్టు ఉద్యోగి యాక్సిడెంటల్‌గా మరణిస్తే రూ.5లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను వర్తింప జేసింది. ► అదనంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కల్పించిన వసతులకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.360 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. -
తెలంగాణలో భారీగా జీతాల పెంపు
ఫుల్‌టైమ్ కంటింజెంట్ వర్కర్లు, కన్సాలిడేటెడ్ పే వర్కర్ల జీతం రూ.8 వేల నుంచి రూ.10,400కు.. ఇందులో పార్ట్‌టైమ్ వారి వేతనం రూ.4 వేల నుంచి రూ.5,200కు పెంపు. సర్పంచులు, ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6,500కు.. జడ్పీటీసీలకు రూ.10 వేల నుంచి రూ.13 వేలకు చేరనుంది. దినసరి వర్కర్లకు రూ.300 నుంచి రూ.390కు పెంపు.. వేతనాల పెంపు ఈ ఏడాది జూన్ నుంచే అమల్లోకి.. అంటే పెరిగిన జీతాలు జూలై ఒకటిన ఉద్యోగుల చేతికి అందుతాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 30 శాతం జీతాల పెంపు.. దాదాపు అన్ని కేటగిరీల వారికి అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గౌరవ వేతనం/ ప్రోత్సాహకం రూపంలో వేతనం పొందుతున్న ఉద్యోగులు, పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులకు కూడా వేతనాల పెంపును వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ జాబితాలో హోంగార్డులు, అంగన్వాడి వర్కర్లు, అంగన్వాడి అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఏలు), విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వీఏవోలు), ఆశ వర్కర్లు, సెర్ప్ సిబ్బందితో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉన్నారు. వీరందరికీ ప్రస్తుతం వస్తున్న వేతనంపై 30 శాతం పెంచాలని నిర్ణయించినందున.. ఉద్యోగుల వివరాలన్నీ వెంటనే పంపాలని కోరుతూ సంబంధిత శాఖలకు ఆర్థిక శాఖ నోట్ పంపింది. ఆయా శాఖల నుంచి వివరాలు అందగానే జీతాల పెంపు ఉత్తర్వులు వెలువడతాయని అధికారులు తెలిపారు. సర్కారుపై మరింత భారం: ఏయే వర్గాలకు వేతనాలు పెంచితే ఎంత మేర భారం పడుతుందన్న దానిపై ఆర్థిక శాఖ వర్గాలు లెక్కలు వేశాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గౌరవ వేతనం పెంపు ద్వారా ఖజానాపై రూ.35 కోట్ల మేర భారం పడనుంది. హోంగార్డులకు పెంపు వల్ల రూ.130 కోట్లకు పైగా, వీఆర్ఏలకు రూ.83 కోట్లు, అంగన్వాడీ వర్కర్లకు రూ.135 కోట్లు, అసిస్టెంట్లకు పెంపుతో రూ.85 కోట్ల మేర అదనపు భారం పడనుంది. వీరితోపాటు సెర్ప్ సిబ్బంది, ఆశావర్కర్ల గౌరవ వేతనాలు కలిపితే.. ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.550 కోట్ల మేర భారం పడుతుందని అంచనా వేశారు. ఆ కేటగిరీల్లోకి రాని తాత్కాలిక ఉద్యోగులకూ.. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 1, 2, 3 కేటగిరీల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను 30శాతం పెంచుతూ ప్రభుత్వం ఈనెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులైనా.. ఈ మూడు కేటగిరీల్లోకి రాకుండా నిర్ధారిత వేతనం మీద పనిచేస్తున్న సిబ్బందిని ఆ ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు. తాజాగా వారికి కూడా పెంపు అమలవుతుందని, అయితే 2020 రివైజ్డ్ పేస్కేల్ నిబంధనల ప్రకారం ఈ పెంపు ఉంటుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కేటగిరీలకు పెంచుతూ ఉత్తర్వులు దినసరి వేతనంపై పనిచేస్తున్నవారు, కంటింజెంట్ వర్కర్లు, కన్సాలిడేటెడ్ పే వర్కర్లు, పార్ట్‌టైమ్ వర్కర్లకు వేతనాలు 30 శాతం పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు మరో ఉత్తర్వు జారీ చేశారు. ఈ మేరకు జీవో నం.64ను విడుదల చేశారు. జూన్ నుంచే పెంపు అమల్లోకి వస్తుందని, జూలై నుంచి పెంచిన వేతనాలు అందుతాయని తెలిపారు. గౌరవ వేతనం పెరిగే కేటగిరీలు, లబ్ధిదారుల సంఖ్య కేటగిరీ సంఖ్య హోంగార్డులు 17,850 అంగన్వాడీ వర్కర్లు 35,700 అంగన్వాడీ హెల్పర్లు 31,711 వీఆర్ఏలు 20,292 ఆశా వర్కర్లు 26,341 సెర్ప్ 4,200 జెడ్పీటీసీలు 538 ఎంపీటీసీలు 5,817 సర్పంచ్‌లు 12,759 -
‘ఆశ’లు నెరవేరాయి
విశాఖ సిటీ :పేరుకు రూ.3 వేల గౌరవ వేతనం.. వేతనంలో ఉన్న గౌరవం పనిలో లేని దైన్యం.. ఇదీ ఆశ కార్యకర్తల ఆవేదన. గత ప్రభుత్వ హయాంలో వీరు చేయని పని లేదు. పడని మాట లేదు. వీరంతా ప్రజా సంకల్పయాత్రలో తమ గోడును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెప్పుకున్నారు. ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ కార్యకర్తలు కూడా ఊహించని విధంగా రూ.10 వేలకు వేతనం పెంచి వారిని గౌరవించారు. సీఎం జగన్ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 5,600 మంది ఆశ కార్యకర్తలు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు, బుక్ కీపర్స్ వేతనాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. -
జగన్ రాక.. ఆశల కేక!
పర్చూరు: ఎప్పటి నుంచో వేతనాల పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆశ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపి కబురు అందించారు. మూడు వేల రూపాయల వేతనంతో కుటుంబ పోషణను భారంగా నెట్టుకొస్తున్న ఆశ కార్యకర్తలు గత ప్రభుత్వ కాలంలో అనేక పోరాటాలు చేశారు. రోడ్లెక్కారు.. ధర్నాలు చేశారు.. విధులు బహిష్కరించారు. అన్ని రకాలుగా తమ నిరసనను వ్యక్త పరిచారు. చివరకు ప్రతి పక్ష నేత హోదాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కేవలం ఒక్కో సేవకు ఒక్కో రేటును నిర్ణయించి వేతనాలు లెక్కకట్టేవారు. దీంతో చాలీచాలని వేతనంతో అవస్థలు పడుతున్న ఆశ కార్యకర్తలకు జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలను రూ. 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆయన ప్రకటించిన విధంగా అధికారం చేపట్టిన వారంలోనే వారి వేతనాలను రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ వైద్యశాఖాధికారుల సమీక్షలో ప్రకటన చేశారు. విషయాన్ని తెలుసుకున్న ఆశ కార్యకర్తలు ఆనందోత్సహాలను జరుపుకుంటూ తమ ఆనందాన్ని తెలుపుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మేము ఊహించలేదు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే మా గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని మేము ఊహించలేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. – విజయలక్ష్మి, ఆశ కార్యకర్త (ఇడుపులపాడు -
ఆశ తీరింది
వారి కష్టానికి ఎట్టకేలకు ప్రతిఫలం దక్కింది. వారి జీవితాలకు కొండంత అండ లభించింది. ఇన్నాళ్లూ అష్టకష్టాలు పడ్డ ఆశా వర్కర్లకు మంచి రోజులొచ్చాయి. వారి కష్టాన్ని గుర్తించే నాయకుడొచ్చాడు. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన మాటను వైఎస్.జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి వారం కూడా కాకమునుపే ఆశా వర్కర్ల వేతనాలను భారీగా పెంచారు. రూ.3 వేలు ఉన్న వేతనాన్ని ఏకంగా రూ.10 వేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆశా వర్కర్లు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నొచ్చాడని.. ఆనందంతో స్వీట్లు తినిపించుకున్నారు. చిత్తూరు అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నా.. వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాల్సింది మాత్రం ఆశా వర్కర్లే. ప్రభుత్వ వైద్యసేవలకు.. ప్రజలకు మధ్య వారధిగా ఆశా వర్కర్లు పనిచేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులను చైతన్య పరచడం, టీకాలు పరిస్థితి అధికారులకు నివేదించడం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే కొత్త ఆరోగ్య పథకాలను ప్రజలకు తెలియజేయడంతో ఆశా వర్కర్లది కీలకపాత్ర. గత ప్రభుత్వం వీరి సేవలను దోచుకుంటూ కనీస వేతనాలు ఇవ్వడంలో వివక్ష చూపిస్తూ వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశా వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపారు. నెలకు రూ.3 వేల గౌరవ వేతనం తీసుకుంటున్న వారికి ఒక్కసారిగా రూ.10 వేల జీతాన్ని ఇవ్వనున్నట్లు సంచలనాత్మక నిర్ణయాన్ని సోమవారం ప్రకటించారు. ఆనందానికి అవధుల్లేవు పల్లెల్లో గడగడపకూ తిరుగుతూ ట్యాబ్‌లలోగర్భిణులు, బాలింతల వివరాలను నమోదు చేయాలి. ప్రతినెలా గర్భిణులను వైద్యపరీక్షల కోసం జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రులకు తీసుకెళ్లాలి. కాన్పులకు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు సైతం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను పట్టణాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంత చారికీ చేస్తున్నా గౌరవ వేతనం పేరిట ఆశా వర్కర్ల శ్రమను దోచుకున్న గత ప్రభుత్వం వారి సంక్షేమాన్ని ఏమాత్రమూ పట్టించుకోలేదు. గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పలుమార్లు ఆశా వర్కర్లు ఆందోళనకు సైతం దిగారు. అయినా సరే నాటి పాలకుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. తాజాగా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం.. స్వయాన ముఖ్య మంత్రే వేతనాలపెంపుపై ప్రకటన చేయడంతో ఆశా వర్కర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వేల కుటుంబాలకు లబ్ధి జిల్లా వైద్యశాఖలో 3,685 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం వీరికి నెలకు రూ.3 వేలు చొప్పున గౌరవ వేతనం ఇచ్చేది. దీన్ని కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఆశా వర్కర్లకు రూ.8 వేలు ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం వారిని మోసం చేసింది. ఓ వైపు పాత వేతనాలు ఇవ్వకుండా, మరోవైపు పారితోషికాలు విడుదల చేయకుండా ఇబ్బందులపాలు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజా నిర్ణయంతో జిల్లాలోని మూడు వేలకు పైగా ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వానికి నెలకు రూ.36.85 లక్షల ఆర్థిక భారం పడ్డా లెక్కచేయకుండా ఆశా వర్కర్ల జీవితాలకు ముఖ్యమంత్రి భరోసా కల్పించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికగా పేరొందిన ఆరోగ్యశ్రీకి కొత్తపేరు సైతం సీఎం ప్రతిపాదించారు. ఇక నుంచి ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’గా ఈ పథకానికి నామకరణం చేశారు. 108 అంబులెన్సులు, 104 సంచార వైద్య చికిత్స వాహనాల పనితీరు కూడా మెరుగుపడాలన్నారు. ఇక నుంచి వైద్యరంగాన్ని స్వయానా తానే పర్యవేక్షిస్తానని చెప్పి అధికారుల్లో బాధ్యతను పెంచారు. దీంతో సామాన్యుడికి ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యసేవలు అందుతాయని ప్రజలు నమ్ముతున్నారు. -
పోలీసులకు తీపి కబురు
సాక్షి బెంగళూరు: రాష్ట్రంలోని 86 వేల మంది పోలీసుల పంట పండింది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. బహుకాల నిరీక్షణకు తెరపడనుంది. వేతన పెంపు కోసం ఎదురు చూస్తున్న పోలీసుల ఆశలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పోలీసుల జీతాల పెంపు అనివార్యమని ఐపీఎస్ అధికారి రాఘవేంద్ర ఔరాద్కర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు పెంచాల్సిన జీతాలను ప్రకటించనున్నట్లు సమాచారం. ఆందోళనలతో కమిటీ.. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల పోలీసు జీతాలతో పోల్చినా ఇక్కడి రక్షకభటుల వేతనాలు తక్కువగా ఉన్నాయి. గతంలో తమ జీతాలను పెంచాలని అనేక సార్లు పోలీసులు ఆందోనలకు దిగారు. గత కాంగ్రెస్ హయాంలోనూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో మాజీ సీఎం సిద్ధరామయ్య అప్పట్లో ఐపీఎస్ అధికారి రాఘవేంద్ర ఔరాద్కర్ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. 30 శాతం పెంపునకు సిఫారసు.. 2016 సెప్టెంబర్ 27న ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. రాష్ట్ర పోలీసులు జీతాల పెంపు అనివార్యమని ప్రభుత్వానికి నివేదించింది. పోలీసు శాఖలోని పని చేసే ఆయా విభాగాల్లోని సిబ్బందికి 30 శాతం మేర జీతాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ తర్వాత కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను అమలు చేయాలని పోలీసులు ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. కర్ణాటక 8వ స్థానం.. కమిటీ నివేదిక ప్రకారం పోలీసుల వేతన శ్రేణిలో కర్ణాటక ఎనిమిదో స్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలో వెనుకబడి ఉంది. కర్ణాటక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు సైతం ముందుగానే ఉన్నాయి. దీంతో ఇక్కడి పోలీసులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వీరి జీతాలు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న బడ్జెట్ పూర్వ సమావేశాల్లో ఈ విషయంపై తీర్మానించి వచ్చే బడ్జెట్లో పెంపు మేర కేటాయింపులు జరపనున్నారు. -
వేతనాలు అడిగితే ఈడ్చేశారు
సాక్షి, అమరావతి బ్యూరో: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల విద్యుత్ సౌధ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ‘వేతనాలు పెంచండి మహాప్రభో’ అని నినదించిన కార్మికులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. న్యాయమైన వేతనాల కోసం ఆందోళనబాట పట్టిన వారిపై పోలీసు జులుం ప్రదర్శించింది. వందలాదిమంది కార్మికులను పోలీసులు బలవంతంగా ఈడ్చేసి అరెస్టులు చేశారు. డిమాండ్ల సాధన కోసం ఓ కార్మికుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎక్కడికక్కడ అరెస్టులు వేతనాలు పెంపు ఇతరత్రా డిమాండ్లతో విద్యుత్తు కాంట్రాక్టు కార్మికులు కొన్ని నెలలుగా దశలవారీగా ఉద్యమిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం విజయవాడలోని విద్యుత్ సౌధ ముట్టడి చేపట్టారు. అయితే విద్యుత్ సౌధకు వచ్చే అన్ని మార్గాలను పోలీసులు బుధవారం తెల్లవారుజాము నుంచే మూసివేశారు. తనిఖీలు చేస్తూ విద్యుత్తు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో దాదాపు వెయ్యిమందిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఉదయం 11 గంటల సమయంలో దాదాపు 200 మందికిపైగా కార్మికులు వేరేమార్గంలో ఒక్కసారిగా గుణదల చేరుకుని విద్యుత్ సౌధను ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బలవంతంగా ఈడ్చివేసి వాహనాల్లోకి ఎక్కించారు. కార్మికుల వెంటపడి మరీ లాఠీలతో కొడుతూ అదుపులోకి తీసుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.గఫూర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, విద్యుత్తు కాంట్రాక్టు కార్మికుల ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి కె.మల్లికార్జునరెడ్డి, శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కార్యదర్శి కల్లేపల్లి శైలజ తదితరులతోపాటు 200 మంది కార్మికులను అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఇంతలో విజయ్ అనే కార్మికుడు విద్యుత్ సౌధ వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. దాదాపు గంట తరువాత ఇద్దరు కానిస్టేబుళ్లు టవర్‌ఎక్కి ఆయన్ని ఒప్పించి కిందకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, న్యాయమైన వేతనాలు కల్పించాలన్న తమ ఆందోళనను పోలీసు బలంతో అణచివేయాలని ప్రయత్నించడం దారుణమని కె.మల్లికార్జునరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా నాన్చుడు వైఖరి విడనాడి తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అణచివేత వైఖరికి బెదిరేదిలేదని ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. -
హోంగార్డ్స్ వేతనం పెంపు
నెల్లూరు : రెండేళ్ల సుదీర్ఘ ఎదురుచూపులు ఫలించాయి. హోంగార్డ్స్ దినసరి వేతనా న్ని రూ.400 నుంచి రూ.600కు పెంచుతూ రా ష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 77ను సోమవారం రాత్రి విడుదల చేసింది. పెంచిన వేతనాలు జూలై ఒకటినుంచి అమలులోకి రానున్నాయి. జిల్లాలో 841 మంది హోంగార్డులుండగా వీరిలో సాధారణ విధుల్లో 590 మంది, డిప్యూటేషన్ విధుల్లో 296 మంది ఉన్నారు. వీరికి 2016 మార్చి 29వ తేదీన దినసరి వేతనం రూ.400కు పెంచుతూ ప్రభుత్వం జీఓ నంబర్ 37ను జారీచేసింది. అయితే పెరిగిన అవసరాలకు అనుగుణంగా తమ వేతనాన్ని పెంచాని హోంగార్డ్స్ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ హోంగార్డ్స్ దినసరి వేతనాన్ని ఇప్పటికే రెండు పర్యాయాలు పెంచుతూ జీఓలు జారీచేసింది. దీంతో మన రాష్ట్రంలోనూ వేతనాలను పెంచాలని హోంగార్డ్స్ ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో జీఓ జారీ అయింది. మహిళా హోంగార్డ్స్కు ప్రసూతి సెలవులు మూడునెలలు పెంపు, నెలకు రెండురోజుల సెలవులు, అకాల మరణం చెందితే అంత్యక్రియల ఖర్చులు రూ.1,000 నుంచి రూ.10 వేలకు పెంపు, ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.2.50 లక్షల వరకు వైద్యసాయం, విధి నిర్వహణలో (ప్రమాదవశాత్తు, సాధారణ) మృతిచెందితే రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా), ప్రభుత్వ గృహనిర్మాణ పథకంలో లబ్ధికల్పిస్తున్నట్లు జీఓలో పేర్కొన్నారు. హోంగార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా నాయకులు మస్తాన్, ఎం.ప్రసాద్, కాయల్ భాస్కర్లు హర్షం తెలిపారు. -
మినీ గురుకుల సిబ్బందికి వేతన కష్టాలు
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని మినీ గురుకులాల్లో సిబ్బందికి వేతన కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అత్తెసరు జీతాలే ఇస్తోంది. ఒక్కో ఉద్యోగికి నెలవారీ వేతనం రూ.5వేలకు మించడం లేదు. మెజార్టీ ఉద్యోగులకు నెలకు కేవలం రూ.2,500 చొప్పున ఇవ్వడం గమనార్హం. వీటిని పెంచాలని ఉద్యోగులు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. సాధారణంగా గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి అడ్మిషన్లు తీసుకుంటారు. కానీ గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని మినీ గురుకులాలు ఏర్పాటు చేసింది. ఇందులో ప్రాథమిక స్థాయి నుంచే అడ్మిషన్లు తీసుకుని వసతితో కూడిన బోధన అందిస్తుంది. ఇలా గిరిజన సంక్షేమ శాఖ 29 మినీ గురుకులాలను తెరిచింది. వీటిలో వార్డెన్, సీఆర్టీ, పీఈటీ, ఏఎన్ఎం, అకౌంటెంట్, కుక్, ఆయా, హెల్పర్, స్వీపర్, వాచ్మెన్ కేటగిరీల్లో 418 మందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించింది. ఏళ్లుగా అరకొర జీతాలే మినీ గురుకులాల్లో సిబ్బందికి ఏళ్లుగా అరకొర వేతనాలే ఇస్తున్నారు. వార్డెన్‌కు రూ.5 వేలు, సీఆర్టీ, పీఈటీ, ఏఎన్ఎంలకు రూ.4 వేలు, అకౌంటెంట్‌కు రూ.3,500, కుక్, ఆయా, స్వీపర్, వాచ్మెన్లకు రూ.2,500 చొప్పున వేతనాలిస్తున్నారు. ఆరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ గురుకులాల్లో సిబ్బందికి ఇప్పటికీ వేతనాలు పెంచలేదు. వేతన పెంపును కోరుతూ పలుమార్లు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేదు. గిరిజన సంక్షేమ శాఖ వేతన పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించి ఏడాది కావస్తున్నా ఫైలుకు మోక్షం కలగలేదు. మరో పక్షం రోజుల్లో 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆలోపు వేతనాలు పెంచాలని మినీ గురుకులాల సిబ్బంది అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గడువులోగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకుంటే విధులు బహిష్కరించి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. -
నేటి నుంచి మునిసిపల్ సమ్మె
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగిలిన 72 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న 16 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు బుధవారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న కార్మికుల వేతనాల పెంపు డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు దిగుతున్నామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం ప్రకటించింది. కార్మికుల వేతనాలను తక్షణమే పెంచాలని జేఏసీ నేతృత్వంలోని కార్మిక సంఘాలు మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నాయి. ప్రస్తుతం పురపాలికల్లో పని చేస్తున్న కార్మికులకు ప్రతి నెలా రూ.8,300 వేతనం చెల్లిస్తున్నారు. జీవో నం.14 ప్రకారం కార్మికుల వేతనాలను కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా వరుసగా రూ.17.5 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలకు పెంచాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. వేతనాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఈనెల 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొంటూ 11న పురపాలక శాఖ డైరెక్టర్‌కు సమ్మె నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నామని ప్రకటించింది. స్తంభించనున్న సేవలు.. మునిసిపల్ సమ్మెతో రాష్ట్రంలోని పురపాలికల్లో కీలకమైన పారిశుధ్య సేవలు స్తంభించిపోనున్నాయి. నగరాలు, పట్టణాల్లో టన్నుల కొద్దీ చెత్త, వ్యర్థ పదార్థాలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. పార్కులు, నీటి సరఫరా, వీధి దీపాలు, మలేరియా నివారణ విభాగాల్లోని సిబ్బందితోపాటు బిల్ కలెక్టర్లు, సూపర్వైజర్లు, ఆఫీసు సిబ్బంది కూడా సమ్మెబాట పట్టనున్నారు. దీంతో ఆయా విభాగాల్లో పౌర సేవలకు ఇక్కట్లు ఎదురుకానున్నాయి. అత్యంత దయనీయ పరిస్థితిలో పారిశుధ్య పనులు నిర్వహించే మునిసిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం శోచనీయమని ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, టీఎన్‌టీయూసీల కార్మికుల సంఘాలతో ఏర్పడిన మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ మండిపడింది. ‘దేవుళ్ల’ ఎదురుచూపు! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేతనాల పెంపు డిమాండ్‌తో 2015 జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు సమ్మె నిర్వహించారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యర్థాలు, చెత్త పేరుకుపోయి సామాన్య ప్రజలు తీవ్ర అవస్తలకు గురయ్యారు. సమ్మెకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలు పెంచింది. సమ్మె విరమిస్తే మిగిలిన పురపాలికల్లో పని చేస్తున్న కార్మికుల వేతనాల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో ప్రకటించడంతో కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. సఫాయివాలాలను దేవుళ్లతో పోల్చి వారి సేవలను ఆకాశానికెత్తారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ అపరిష్కృతంగానే ఉండిపోయింది. వేతనాలు పెంచినా చెల్లించాల్సింది పురపాలికలే కాబట్టి అవే నిర్ణయం తీసుకోవాలన్న ప్రభుత్వ వాదనలో ఎలాంటి మార్పు రాలేదు. మరోవైపు పురపాలికల ఆదాయం అంతంత మాత్రమే ఉందని, వేతనాలు పెంచితే చెల్లించే స్తోమత పురపాలికలకు లేదని మేయర్లు, మునిసిపల్ చైర్పర్సన్లు తేల్చి చెప్పారు. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలనే మూడు నెలలకోసారి చెల్లిస్తున్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుందో అలానే ఇతర పురపాలికల కార్మికుల విషయంలోనూ అలానే నిర్ణయం తీసుకోవాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. -
పెరిగిన ఉపాధి కూలీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీల రోజువారీ గరిష్ట వేతనాన్ని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణలోనూ మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో కూలీల రోజువారీ గరిష్ట వేతనం రూ.197 ఉండేది. ఈ మొత్తాన్ని రూ.205కు పెంచారు. ఈ నెల 1 నుంచి ఈ పెరిగిన వేతనం అమల్లోకి వచ్చింది. ఉపాధి కూలీల రోజువారీ గరిష్ట వేతనాన్ని ఏటా పెంచాలని చట్టంలోనే పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం ఎప్పటికప్పుడు పెంచుతోంది. దీనికి అనుగుణంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఉపాధి కూలీల రోజువారీ వేతనం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో దేశంలోనే గరిష్టంగా రూ.273 ఉంది. జార్ఖండ్‌లో అతి తక్కువగా రూ.168 వేతనం ఇస్తున్నారు. పెంచిన గరిష్ట వేతనం ప్రకారం కూలీలకు అందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు పెంపు
హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రూ.18 వేల వేతనాన్ని రూ. 27 వేలకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన ఈ వేతనాలను ఈ నెల నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. -
ఎస్ఎస్ఏలో ‘కాంట్రాక్టు’ వేతనాలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న అటెండర్లు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)లకు వేతనాలను పెంచాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అటెండర్లకు ప్రస్తుత వేతనం రూ.7500 ఉండగా, దీన్ని రూ.10 వేలకు, సీఆర్పీల రూ.9500 వేతనాన్ని రూ.11,400లకు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం జరగనున్న ఎస్ఎస్ఏ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో పేరిణీ నృత్యం తరగతులను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని విద్యా శాఖ యోచిస్తోంది. పేరిణీ నృత్యం కోర్సులు చేసిన వారిని తెలుగు యూనివర్సిటీలో ఆర్ట్ ఎడ్యుకేషన్ కింద ఇన్స్ట్రక్టర్లుగా నియమించాలని భావిస్తోంది. దీనిపై కూడా ఎస్ఎస్ఏ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. -
'మాది అదానీ-అంబానీ ప్రభుత్వం కాదు'
న్యూఢిల్లీ: తమది అదానీ-అంబానీ ప్రభుత్వం కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వ కార్మికుల వేతనాలు 50 శాతం పెంచిన సందర్భంగా తనను కలిసిన వాణిజ్య సంస్థల ప్రతినిధులతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'కార్మికుల కనీస వేతనాలు 50 శాతం పెంచాం. భారీ స్థాయిలో ఉద్యోగులకు జీతాలు పెంచడంతో దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఎందుకంటే ఇది అదానీ-అంబానీ ప్రభుత్వం కాదు. మాది పేద కార్మికుల ప్రభుత్వమ'ని కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంబానీ జేబు సంస్థగా పనిచేస్తే, మోదీ సర్కారు అదానీ సేవలో తరిస్తోందని విమర్శించారు. గత మూడేళ్లలో అదానీ సంపద మూడింతలు పెరిగిందని వెల్లడించారు. పేదల ఆదాయం పెరిగితే ఆహారపు గింజలు, సైకిళ్లు కొనుక్కుంటారని.. అదానీ జేబులోకి సంపద వెళితే ఆయన భార్యకు హెలికాప్టర్ కొంటారని పేర్కొన్నారు. అదానీ చేసిన చాలునని, ఇక ప్రజలకు సేవ చేయాలని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ సూచించారు. -
వేతన చర్చల్లో పురోగతి... యధావిధిగా మళ్ళీ షూటింగ్‌లు...
సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో తెలుగు సినీ నిర్మాతలకూ, పరిశ్రమలోని 24 శాఖల కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ.పి. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కూ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశలో పురోగమిస్తున్నాయి. బుధవారం, శుక్రవారం జరిగిన చర్చల ఫలితంగా కార్మికులకు సగటున 35 నుంచి 40 శాతం దాకా వేతనాలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమలో 20వ తేదీ నుంచి జరుగుతున్న షూటింగ్‌ల బంద్‌కు తెరపడింది. శుక్రవారం నుంచి షూటింగ్‌లూ యధావిధిగా జరుగుతున్నాయి. ఏ.పి. ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ ప్రతినిధులు చర్చించుకొంటూ, రోజుకు రెండు, మూడు యూనియన్ల వంతున ప్రతి ఒక్కరితో కొత్త వేతన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ‘‘నవంబర్ 9 నాటి కల్లా అన్ని శాఖలతో కొత్త వేతన ఒప్పందాలు పూర్తవుతాయి. కొత్త వేతనాలు అక్టోబర్ 24 నుంచే అమలులోకి వస్తాయి. నిర్మాతల మండలి నుంచి లిఖితపూర్వక హామీ కూడా ఇచ్చారు. ఈలోగా షూటింగులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. అందుకు మేమూ అంగీకరించాం’’ అని ఫెడరేషన్ అధ్యక్షుడు కొమర వెంకటేశ్, ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరుతో ముగిసిన మూడేళ్ళ వేతన ఒప్పందానికి కొనసాగింపుగా ఇప్పుడీ కొత్త ఒప్పందాలు అమలులోకి వస్తాయి. పెరిగిన ఖర్చుల దృష్ట్యా నూరు శాతం మేర వేతనాలు పెంచాలని కార్మికులు అభ్యర్థించారు. ఆ మేరకు పెరగనప్పటికీ, తాజా వేతనాల వల్ల 20 వేల మంది దాకా తెలుగు సినీ కార్మికులకు నేరుగా లబ్ధి కలగనున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంపు
నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు రూ. 6,700 నుంచి 8,300 వర్కర్ల వేతనాలను రూ.6,700 నుంచి 7,300కి పెంపు సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపును తక్షణమే అమలు చేయాలని సంబంధిత మునిసిపల్ కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ మునిసిపల్ వాటర్ వర్క్స్, ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి మేరకు .. వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో పనిచేస్తున్న నాన్ పబ్లిక్ హెల్త్ ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలను పెంచుతూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న నాన్ పబ్లిక్ హెల్త్ కాంట్రాక్టు వర్కర్ల వేతనాలు రూ.6,700 నుంచి 8,300లకు, నగర పంచాయతీ కాంట్రాక్టు వర్కర్ల వేతనాలను రూ.6,700 నుంచి రూ.7,300లకు పెంచింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ ఉత్తర్వులను అమలు చేయాలని మంగళవారం మరోసారి ఆదేశించింది.