ఆశ తీరింది | Asha Workers Wages Hikes in Chittoor | Sakshi
Sakshi News home page

ఆశ తీరింది

Published Tue, Jun 4 2019 12:03 PM | Last Updated on Tue, Jun 4 2019 12:03 PM

Asha Workers Wages Hikes in Chittoor - Sakshi

పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెంట నడుస్తున్న ఆశా వర్కర్లు (ఫైల్‌)

వారి కష్టానికి ఎట్టకేలకు ప్రతిఫలం దక్కింది. వారి జీవితాలకు కొండంత అండ లభించింది. ఇన్నాళ్లూ అష్టకష్టాలు పడ్డ ఆశా వర్కర్లకు మంచి రోజులొచ్చాయి. వారి కష్టాన్ని గుర్తించే నాయకుడొచ్చాడు. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన మాటను వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి వారం కూడా కాకమునుపే ఆశా వర్కర్ల వేతనాలను భారీగా పెంచారు. రూ.3 వేలు ఉన్న వేతనాన్ని ఏకంగా రూ.10 వేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆశా వర్కర్లు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నొచ్చాడని.. ఆనందంతో స్వీట్లు తినిపించుకున్నారు.

చిత్తూరు అర్బన్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నా.. వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాల్సింది మాత్రం ఆశా వర్కర్లే. ప్రభుత్వ వైద్యసేవలకు.. ప్రజలకు మధ్య వారధిగా ఆశా వర్కర్లు పనిచేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులను చైతన్య పరచడం, టీకాలు పరిస్థితి అధికారులకు నివేదించడం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే కొత్త ఆరోగ్య పథకాలను ప్రజలకు తెలియజేయడంతో ఆశా వర్కర్లది కీలకపాత్ర. గత ప్రభుత్వం వీరి సేవలను దోచుకుంటూ కనీస వేతనాలు ఇవ్వడంలో వివక్ష చూపిస్తూ వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశా వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపారు. నెలకు రూ.3 వేల గౌరవ వేతనం తీసుకుంటున్న వారికి ఒక్కసారిగా రూ.10 వేల జీతాన్ని ఇవ్వనున్నట్లు సంచలనాత్మక నిర్ణయాన్ని సోమవారం ప్రకటించారు.

ఆనందానికి అవధుల్లేవు
పల్లెల్లో గడగడపకూ తిరుగుతూ ట్యాబ్‌లలోగర్భిణులు, బాలింతల వివరాలను నమోదు చేయాలి. ప్రతినెలా గర్భిణులను వైద్యపరీక్షల కోసం జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రులకు తీసుకెళ్లాలి. కాన్పులకు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు సైతం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను పట్టణాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంత చారికీ చేస్తున్నా గౌరవ వేతనం పేరిట ఆశా వర్కర్ల శ్రమను దోచుకున్న గత ప్రభుత్వం వారి సంక్షేమాన్ని ఏమాత్రమూ పట్టించుకోలేదు. గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పలుమార్లు ఆశా వర్కర్లు ఆందోళనకు సైతం దిగారు. అయినా సరే నాటి పాలకుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. తాజాగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం.. స్వయాన ముఖ్య మంత్రే వేతనాలపెంపుపై ప్రకటన చేయడంతో ఆశా వర్కర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

వేల కుటుంబాలకు లబ్ధి
జిల్లా వైద్యశాఖలో 3,685 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం వీరికి నెలకు రూ.3 వేలు చొప్పున గౌరవ వేతనం ఇచ్చేది. దీన్ని కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఆశా వర్కర్లకు రూ.8 వేలు ఇస్తామని చెప్పి చంద్రబాబు  ప్రభుత్వం వారిని మోసం చేసింది. ఓ వైపు పాత వేతనాలు ఇవ్వకుండా, మరోవైపు పారితోషికాలు విడుదల చేయకుండా ఇబ్బందులపాలు చేసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తాజా నిర్ణయంతో జిల్లాలోని మూడు వేలకు పైగా ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వానికి నెలకు రూ.36.85 లక్షల ఆర్థిక భారం పడ్డా లెక్కచేయకుండా ఆశా వర్కర్ల జీవితాలకు ముఖ్యమంత్రి భరోసా కల్పించారు.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానసపుత్రికగా పేరొందిన ఆరోగ్యశ్రీకి కొత్తపేరు సైతం సీఎం ప్రతిపాదించారు. ఇక నుంచి ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’గా ఈ పథకానికి నామకరణం చేశారు. 108 అంబులెన్సులు, 104 సంచార వైద్య చికిత్స వాహనాల పనితీరు కూడా మెరుగుపడాలన్నారు. ఇక నుంచి వైద్యరంగాన్ని స్వయానా తానే పర్యవేక్షిస్తానని చెప్పి అధికారుల్లో బాధ్యతను పెంచారు. దీంతో సామాన్యుడికి ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యసేవలు అందుతాయని ప్రజలు నమ్ముతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement