Telangana: Sarpanch, MPTC, ZPTC Wages Increased | తెలంగాణలో భారీగా జీతాల పెంపు - Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా జీతాల పెంపు

Published Wed, Jun 16 2021 1:28 AM | Last Updated on Wed, Jun 16 2021 10:55 AM

Telangana: Sarpanch, MPTC, ZPTC Wages Increased - Sakshi

  • ఫుల్‌టైమ్‌ కంటింజెంట్‌ వర్కర్లు, కన్సాలిడేటెడ్‌ పే వర్కర్ల జీతం రూ.8 వేల నుంచి రూ.10,400కు.. ఇందులో పార్ట్‌టైమ్‌ వారి వేతనం రూ.4 వేల నుంచి రూ.5,200కు పెంపు.
  • సర్పంచులు, ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6,500కు.. జడ్పీటీసీలకు రూ.10 వేల నుంచి రూ.13 వేలకు చేరనుంది.

దినసరి వర్కర్లకు

  • రూ.300 నుంచి
  • రూ.390కు పెంపు.. 
  • వేతనాల పెంపు ఈ ఏడాది జూన్‌ నుంచే అమల్లోకి.. అంటే పెరిగిన జీతాలు జూలై ఒకటిన ఉద్యోగుల చేతికి అందుతాయి.


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 30 శాతం జీతాల పెంపు.. దాదాపు అన్ని కేటగిరీల వారికి అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గౌరవ వేతనం/ ప్రోత్సాహకం రూపంలో వేతనం పొందుతున్న ఉద్యోగులు, పంచాయతీరాజ్‌ ప్రజాప్రతినిధులకు కూడా వేతనాల పెంపును వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ జాబితాలో హోంగార్డులు, అంగన్‌వాడి వర్కర్లు, అంగన్‌వాడి అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఏలు), విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్లు (వీఏవోలు), ఆశ వర్కర్లు, సెర్ప్‌ సిబ్బందితో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉన్నారు. వీరందరికీ ప్రస్తుతం వస్తున్న వేతనంపై 30 శాతం పెంచాలని నిర్ణయించినందున.. ఉద్యోగుల వివరాలన్నీ వెంటనే పంపాలని కోరుతూ సంబంధిత శాఖలకు ఆర్థిక శాఖ నోట్‌ పంపింది. ఆయా శాఖల నుంచి వివరాలు అందగానే జీతాల పెంపు ఉత్తర్వులు వెలువడతాయని అధికారులు తెలిపారు. 



సర్కారుపై మరింత భారం: ఏయే వర్గాలకు వేతనాలు పెంచితే ఎంత మేర భారం పడుతుందన్న దానిపై ఆర్థిక శాఖ వర్గాలు లెక్కలు వేశాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గౌరవ వేతనం పెంపు ద్వారా ఖజానాపై రూ.35 కోట్ల మేర భారం పడనుంది. హోంగార్డులకు  పెంపు వల్ల రూ.130 కోట్లకు పైగా, వీఆర్‌ఏలకు రూ.83 కోట్లు, అంగన్‌వాడీ వర్కర్లకు రూ.135 కోట్లు, అసిస్టెంట్లకు పెంపుతో రూ.85 కోట్ల మేర అదనపు భారం పడనుంది. వీరితోపాటు సెర్ప్‌ సిబ్బంది, ఆశావర్కర్ల గౌరవ వేతనాలు కలిపితే.. ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.550 కోట్ల మేర భారం పడుతుందని అంచనా వేశారు.
 
ఆ కేటగిరీల్లోకి రాని తాత్కాలిక ఉద్యోగులకూ.. 
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 1, 2, 3 కేటగిరీల కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలను 30శాతం పెంచుతూ ప్రభుత్వం ఈనెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమితులైనా.. ఈ మూడు కేటగిరీల్లోకి రాకుండా నిర్ధారిత వేతనం మీద పనిచేస్తున్న సిబ్బందిని ఆ ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు. తాజాగా వారికి కూడా పెంపు అమలవుతుందని, అయితే 2020 రివైజ్డ్‌ పేస్కేల్‌ నిబంధనల ప్రకారం ఈ పెంపు ఉంటుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఆ కేటగిరీలకు పెంచుతూ ఉత్తర్వులు
దినసరి వేతనంపై పనిచేస్తున్నవారు, కంటింజెంట్‌ వర్కర్లు, కన్సాలిడేటెడ్‌ పే వర్కర్లు, పార్ట్‌టైమ్‌ వర్కర్లకు వేతనాలు 30 శాతం పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు మరో ఉత్తర్వు జారీ చేశారు. ఈ మేరకు జీవో నం.64ను విడుదల చేశారు. జూన్‌ నుంచే పెంపు అమల్లోకి వస్తుందని, జూలై నుంచి పెంచిన వేతనాలు అందుతాయని తెలిపారు.
 
గౌరవ వేతనం పెరిగే కేటగిరీలు, లబ్ధిదారుల సంఖ్య 

కేటగిరీ                             సంఖ్య             

హోంగార్డులు               17,850 
అంగన్‌వాడీ వర్కర్లు      35,700 
అంగన్‌వాడీ హెల్పర్లు    31,711 
వీఆర్‌ఏలు                     20,292 
ఆశా వర్కర్లు                  26,341 
సెర్ప్‌                            4,200 
జెడ్పీటీసీలు                 538 
ఎంపీటీసీలు                 5,817 
సర్పంచ్‌లు                 12,759

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement