'మాది అదానీ-అంబానీ ప్రభుత్వం కాదు'
న్యూఢిల్లీ: తమది అదానీ-అంబానీ ప్రభుత్వం కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వ కార్మికుల వేతనాలు 50 శాతం పెంచిన సందర్భంగా తనను కలిసిన వాణిజ్య సంస్థల ప్రతినిధులతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'కార్మికుల కనీస వేతనాలు 50 శాతం పెంచాం. భారీ స్థాయిలో ఉద్యోగులకు జీతాలు పెంచడంతో దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఎందుకంటే ఇది అదానీ-అంబానీ ప్రభుత్వం కాదు. మాది పేద కార్మికుల ప్రభుత్వమ'ని కేజ్రీవాల్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంబానీ జేబు సంస్థగా పనిచేస్తే, మోదీ సర్కారు అదానీ సేవలో తరిస్తోందని విమర్శించారు. గత మూడేళ్లలో అదానీ సంపద మూడింతలు పెరిగిందని వెల్లడించారు. పేదల ఆదాయం పెరిగితే ఆహారపు గింజలు, సైకిళ్లు కొనుక్కుంటారని.. అదానీ జేబులోకి సంపద వెళితే ఆయన భార్యకు హెలికాప్టర్ కొంటారని పేర్కొన్నారు. అదానీ చేసిన చాలునని, ఇక ప్రజలకు సేవ చేయాలని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ సూచించారు.