సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్ కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటగా 14 కోట్ల పని దినాల కల్పనకు ఆమోదం తెలిపిన కేంద్రం.. ప్రస్తుతం ఆ కేటాయింపులను 19 కోట్ల పని దినాలకు పెంచింది. ఈ పథకం ద్వారా ప్రస్తుత ఆర్థిక ఏడాదికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత పేదలకు పనుల కల్పనలో అదనపు పని దినాల కేటాయింపుపై గురువారం ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఒక్కో పని దినానికి రూ.428 చొప్పున కేటాయింపు
ఒక్కొక్క పని దినానికి గరిష్టంగా రూ.428 చొప్పున గ్రామీణాభివృద్ధి శాఖకు అందుతాయి. పేదలకు వారు చేసే రోజు వారీ పని ఆధారంగా కూలీ రూపంలో గరిష్టంగా రూ.257 చొప్పున అందజేస్తారు. కూలీల వేతనాల ఆధారంగా మిగిలిన రూ.171 మెటీరియల్ కేటగిరీ నిధులుగా పేర్కొంటారు. మెటీరియల్ కేటగిరీ నిధులను 75–25 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి ఇప్పటికే 17.30 కోట్ల పని దినాల పాటు పేదలకు పనులు కల్పన పూర్తయిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా.. 19 కోట్ల పని దినాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించింది. వీటిని పూర్తి చేసిన వెంటనే అదనపు పని దినాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయగా.. అదనపు కేటాయింపులు కూడా చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment