సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో తెలుగు సినీ నిర్మాతలకూ, పరిశ్రమలోని 24 శాఖల కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ.పి. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కూ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశలో పురోగమిస్తున్నాయి. బుధవారం, శుక్రవారం జరిగిన చర్చల ఫలితంగా కార్మికులకు సగటున 35 నుంచి 40 శాతం దాకా వేతనాలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమలో 20వ తేదీ నుంచి జరుగుతున్న షూటింగ్‌ల బంద్‌కు తెరపడింది. శుక్రవారం నుంచి షూటింగ్‌లూ యధావిధిగా జరుగుతున్నాయి.
ఏ.పి. ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ ప్రతినిధులు చర్చించుకొంటూ, రోజుకు రెండు, మూడు యూనియన్ల వంతున ప్రతి ఒక్కరితో కొత్త వేతన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ‘‘నవంబర్ 9 నాటి కల్లా అన్ని శాఖలతో కొత్త వేతన ఒప్పందాలు పూర్తవుతాయి. కొత్త వేతనాలు అక్టోబర్ 24 నుంచే అమలులోకి వస్తాయి. నిర్మాతల మండలి నుంచి లిఖితపూర్వక హామీ కూడా ఇచ్చారు. ఈలోగా షూటింగులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. అందుకు మేమూ అంగీకరించాం’’ అని ఫెడరేషన్ అధ్యక్షుడు కొమర వెంకటేశ్, ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరుతో ముగిసిన మూడేళ్ళ వేతన ఒప్పందానికి కొనసాగింపుగా ఇప్పుడీ కొత్త ఒప్పందాలు అమలులోకి వస్తాయి. పెరిగిన ఖర్చుల దృష్ట్యా నూరు శాతం మేర వేతనాలు పెంచాలని కార్మికులు అభ్యర్థించారు. ఆ మేరకు పెరగనప్పటికీ, తాజా వేతనాల వల్ల 20 వేల మంది దాకా తెలుగు సినీ కార్మికులకు నేరుగా లబ్ధి కలగనున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
వేతన చర్చల్లో పురోగతి... యధావిధిగా మళ్ళీ షూటింగ్‌లు...
Published Fri, Oct 24 2014 10:57 PM | Last Updated on Thu, Mar 28 2019 5:30 PM
Advertisement
Advertisement