సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశ్వ కీర్తికి లంగరెత్తిన ఉక్కు నగరి విశాఖ.. ప్రకృతి కాంత పురివిప్పి నాట్యమా డే సాగర సోయగాల ఇలాకా విశాఖ.. ఇప్పుడది వెండి తెరకు వెలుగు రేఖగా మారనుంది. యారాడ కొండ పైనుంచి చూస్తే విశాఖ అందం తనను రోజుకో విధంగా సమ్మోహన పరుస్తుందని, ఎప్పటికైనా ఈ నగరంపై 18 ఆశ్వాసాల మహాకావ్యాన్ని రచిస్తానన్నారు మహా కవి శ్రీశ్రీ. అలనాటి దిగ్గజ దర్శకుడు బాలచందర్ చెన్నైలోని మెరీనా బీచ్‌ను కాదని విశాఖ ఆర్కే బీచ్‌పైనే మక్కువ చూపించి.. ‘మరో చరిత్ర’ సృష్టించారు. ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు.. నలభై శాతానికి పైగా షూటింగ్ విశాఖ మన్యంలోనే జరిగింది. ఏఎన్‌ఆర్ ఖాతాలోని సూపర్ హిట్ సినిమాలైన.. బంగారు బాబు, ప్రేమ కానుక చిత్రీకరణ అరకు లోయలోనే పూర్తి చేసుకుంది. చిరంజీవి సినిమాల్లో చరిత్ర సృష్టించిన జగదేకవీరుడు.. అతిలోక సుందరి సినిమాలోని కీలక సన్నివేశాలే కాదు.. చిరు కెరీర్ తొలినాళ్లలోని అభిలాష, ఛాలెంజ్ మొదలు.. ఘరానా మొగుడు, ముఠామేస్త్రి సినిమాల్లోని సూపర్ డూపర్ హిట్ పాటల షూటింగ్‌కు విశాఖ తీరమే వేదిక. బాలకృష్ణ, నాగార్జున మొదలు ఇప్పటి ఎందరో హీరోల చిత్రాలకు ప్రాణవాయువు అం దించిన అందమైన నగరం. జంధ్యాల మార్కు సినిమాలు, రాజమౌళికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన బాహుబలిలోని సన్నివేశాలు ఇక్కడే రూపుదిద్దుకున్నాయి. విదేశాలకు వెళ్లకుండా.. అందమైన లొకేషన్లు కావాలంటే ఎవరైనా విశాఖ వైపే చూడాల్సిందే.
మళ్లీ తెరపైకి వచ్చిన విశాఖ
చెన్నపట్నం నుంచి భాగ్యనగరి హైదరాబాద్‌కు చేరిన తెలుగు సినీ పరిశ్రమ.. తన వైభవాన్ని కొనసాగించేందుకు విశాఖపట్నానికి తరలివచ్చే తరుణం ఆసన్నమైంది. తెలుగు సినీరంగ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇటీవల కలవడంతో విశాఖ నగరం సినీ హబ్ కావడానికి గల అవకాశాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. విశాఖలో చిత్ర పరిశ్రమకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలో స్టూడియోల నిర్మాణాలకు ప్రభుత్వం సహకరిస్తుందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు.
సినీ దిగ్గజాల నగరి
మహాకవి శ్రీ శ్రీ, ఆరుద్ర, గానకోకిల సుశీల, గొల్లపూడి మారుతీరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, మిశ్రో, వంకాయల వంటి నిష్ణాతులు విశాఖ తీరం నుంచే ప్రస్థానం మొదలుపెట్టారు. కొండవలస లక్ష్మణరావు, పూర్ణిమ, గౌతమి, వైజాగ్ ప్రసాద్, కళ్లు చిదంబరం, రాజ్‌తరుణ్, బట్టల సత్యం (పీలా మల్లికార్జునరావు), సుమన్‌శెట్టి, పూరీ జగన్నాథ్, గుణశేఖర్, గేయ రచయిత కులశేఖర్, రాజా, సుత్తివేలు, ప్రిన్స్.. వీళ్లే కాకుండా ఎందరో బుల్లి తెర నటులు, యాంకర్లు, హీరోలు, హీరోయిన్లు ఇక్కడి వారే. ప్రస్తు తం సినీ పరిశ్రమలో ఎందరో హీరోలకు శిక్షణనిచ్చిన స్టార్ మేకర్ సత్యానంద్ వంటి గురువులకు నివాస కేంద్రం కూడా విశాఖే. అగ్ర నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి విశాఖలోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నా రు. ఇక మెగాస్టార్ చిరంజీవికి
విశాఖతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
వైఎస్ హయాంలో అంకురార్పణ
గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో విశాఖలో చిత్ర పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. ఆయన ప్రోద్బలంతోనే ప్రముఖ సినీ నిర్మా త, మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు బీచ్ రోడ్డులోని రుషికొండకు సమీపంలో 35 ఎకరాల్లో స్టూడియో నిర్మించారు. ఇది మొ దలు హైదరాబాద్‌కు దీటు గా సినిమా రంగాన్ని ఇక్కడ అభివృద్ధి చేయాలని వైఎస్ సంక ల్పించారు. ఆయన హఠాన్మరణంతో వి శాఖలో సినీరంగ ప్రస్థానానికి ఆదిలోనే బ్రేక్ పడింది. తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్ర‘గతి’ మాదిరిగానే విశాఖలోను సినీ పరిశ్రమ అభివృద్ధీ అడుగంటింది. చంద్రబాబు అట్టహాసంగా.. ఆర్భాటంగా హామీలిచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సొసైటీకి భూముల కేటాయింపు, భవనాలు, కళాకారుల ఇళ్ల నిర్మాణాలు అటకెక్కాయి.
అందిపుచ్చుకోవడమే ఆలస్యం
► వైఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని సినీ పరిశ్రమలోని 24 విభాగాలను విశాఖలో స్థిరపడేలా చేస్తే రాష్ట్రానికి, తెలుగు సినీ పరిశ్రమకు మేలు కలుగుతుంది.
► విశాఖ పరిసర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో సినీ హబ్ ఏర్పాటు చేసి.. దక్షిణాది సినీ నిర్మాతలందరికీ గమ్యస్థానంగా మార్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
► తెలుగు, తమిళ, మలయాళ, ఒడియా, బెంగాలీ చిత్రాల నిర్మాణ కేంద్రంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ కలసికట్టుగా ముందడుగు వేయాల్సి ఉంది.
► ఇటీవల తనను కలిసిన సినీ పెద్దలకు అడిగిందే తడవుగా షూటింగులకు అనుమతులివ్వడమే కాకుండా, ఇంకేం కావాలో చెప్పండని సీఎం వైఎస్ జగన్ అడిగి వారిని సంభ్రమాశ్చర్యాలకు
గురిచేశారు.
సీఎం చొరవ అభినందనీయం
విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చూపిస్తున్న చొరవ అభినందనీయం. సింగి ల్ విండో విధానంలో ఉచితంగా సినిమా షూటింగ్‌లకు అనుమ తులు ఇవ్వడం హర్షణీయం. దీనివల్ల చిత్రీకరణ అనుమతులు వేగంగా రావడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. విశాఖకు ఎడిటింగ్ రూమ్‌లు, డబ్బింగ్ థియేటర్లు, ఆధునిక రికార్డింగ్ థియేటర్లు.. 24 క్రాఫ్ట్స్ వచ్చే విధంగా మార్గదర్శకాలు రూపొందించి చర్యలు తీసుకోవాలి.
– సత్యానంద్, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత
జగన్ నిర్ణయం హర్షణీయం
ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్నివిధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయం. మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు. విశాఖ జిల్లా సినిమాల చిత్రీకరణకు ఎంతో బాగుంటుంది. ఇక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందితే ఎంతోమంది కళాకారులకు పుట్టినిల్లయిన ఉత్తరాంధ్రలో వేలాది కళాకారులకు ఉపాధి దొరుకుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతర రంగాలకు చెందిన వారూ లబ్ధి పొందుతారు.
– మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్
Comments
Please login to add a commentAdd a comment