అభిప్రాయం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా నమస్కారం! నా పేరు డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ. నేను పుట్టి పెరిగింది హిందూపురంలో. గత ఇరవై ఏళ్ళుగా అమెరికాలో, గత పదేళ్ళుగా టెక్సాస్‌లోని డాలస్ నగరంలో ఉంటున్నాం. వృత్తి రీత్యా అమెరికా ప్రభుత్వ వైద్యునిగా పని చేస్తున్నాను. నేను పుట్టి బుద్ధెరిగాక పట్టుకున్న మొదటి జెండా అన్నగారి ‘తెలుగుదేశం’ జెండానే! మా నాన్న హిందూపురంలో తెలుగుదేశం పార్టీ కోసం షామియానా వేసి, మైకుసెట్టు పెట్టి చేసిన ప్రచారం ఇంకా గుర్తుంది. అలాగే నేటికీ నలభై ఏళ్ళుగా గుండెల నిండా నింపుకున్న అభిమానంతో మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిని కూడా!
గత జనవరిలో నేను అనంతపురం వచ్చాను. అంతకు ముందు నేను పనిచేసిన పాతూరు ప్రభుత్వాసుపత్రిని సి.డి. ఆసుపత్రి అనేవారు. నేను పనిచేసినప్పుడు కానీ,గత రెండేళ్ళ వరకూ కానీ అది ఒక పాడుపడిన వందేళ్ళ నాటి పెంకుటిల్లులాంటి భవనంలో ఉండేది. రెండేళ్ళ క్రితం కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందించిన ఒక నూతన భవనంలో నడుస్తోంది. ఐదారు మంది డాక్టర్లు, పాతికమంది వరకూ ఇతర ఉద్యోగులతో మంచి వైద్యకేంద్రంగా రూపొందింది. ఆ ఆసుపత్రిని ఇలా చూడడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది.
మరో ముఖ్యమైన అంశం ప్రభుత్వ విద్య. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినవాళ్ళం... ఏదో కొంత మంది మాత్రమే ఉన్న కొద్ది వనరులను ఉపయోగించుకొని జీవితంలో ఓ స్థాయికి చేరాము. అలా సార్వజనీనమైన అవకాశాలను అందిపుచ్చుకొని అందరూ అదే రకమైన విజయాన్ని అందుకోలేక పోయారు. అలాంటిది, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు జరుగుతున్న విద్యాబోధన, తెలుగుతో పాటు ఆంగ్లమాధ్యమంలో చదివించడం, చిన్న తనం నుంచే డిజిటల్ మీడియాతో వాళ్ళకు విద్యను బోధించడం చాలాచోట్ల చూసి ఆశ్చర్యపోయాను. అలాగే నీటైన యూనిఫాం, బ్యాగులు, పుస్తకాలు, కాళ్లకు షూస్‌తో సహా వాళ్లకు అందించి పిల్లలలో ఆ వయస్సు నుంచే ఒక ఆత్మ విశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంచి వారి వ్యక్తిత్వానికి మంచి పునాదులు పడేలా చేసింది.
అభివృద్ధి అనేదానికి – పెద్ద నగరాల్లో ఓ పెద్ద ఐకియా స్టోర్, ఎంజాయ్ చేయడానికి పబ్బులు, పెద్ద పెద్ద బిల్డింగులు, విశాలమైన రోడ్లు – ఇవి మాత్రమే సూచికలు కాకూడదు. అభివృద్ధికి ఒక సూచిక ఏమిటంటే దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రజలు ఎంతవరకూ బాగుపడ్డారు? అది గత ఐదేళ్ళలో చూసుకుంటే సగటు ఆటోరిక్షా నడిపే కార్మికుడు, అరటికాయలు అమ్మి పొట్టపోసుకునే కార్మికురాలు, రోడ్డుసైడు మెకానిక్కు, ఒక సన్నకారు రైతు – వీళ్ళకు కనీస భరోసా లభిస్తోంది.
‘మా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది, మాకు రోగమొస్తే ప్రభుత్వ ప్రాథమిక వైద్యకేంద్రాల్లో కనీస వైద్యం అందుతుంది, నాకు క్యాన్సర్ వచ్చినా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం దొరుకుతుంది’ అన్న భరోసా గత ఐదేళ్ళలో దొరికింది. మొన్ననే ధర్మవరంలో జిలేబీలు అమ్ముకునే కార్మికురాలి కూతురుకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం పడింది. దీనిపై నేనొక చిన్న ట్వీట్ పెడితే, సీఎంవోలో డా.హరికృష్ణారెడ్డి గారు స్పందించి రూ.20 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు నాకు తెలిసే ఉన్నాయి.
2019 మేలో జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలలో ఘన విజయం సాధించినప్పుడు నేను సామాజిక మాధ్యమాల్లో ‘మీ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యాలుగా ‘‘విద్య’ – ‘వైద్యా’లను ఎన్నుకొని, వాటి రూపురేఖల్ని సమూలంగా మారుస్తూ ప్రజలకు అందుబాటులోనికి తేవాలని’ కోరాను. ఈనాడు ప్రభుత్వం ఆ ముఖ్యమైన రెండు విషయాల్లోనూ చాలా సమర్థంగా పనిచేసిందని ప్రత్యక్షంగా గమనించాను. ‘పల్లెటూళ్ళే పట్టుగొమ్మలని’ మహాత్మాగాంధీ గారన్నారు. పల్లెల్లో అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న దరిద్రనారాయణుడికి చేసే సేవే నిజమైన సేవ అని ఆయన భావించారు. అలా ప్రస్తుత ప్రభుత్వంలో సామాన్యుడికి కనీస అవసరాలైనా తీరుతున్నాయని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పేదేమిటంటే – నేనేదైతే ప్రభుత్వ ప్రాధమ్యాలుగా ఉండాలని, ప్రజలకు మెరుగ్గా సేవ చేయాలని భావించానో అవి నెరవేరాయి. నాకు తెలిసిన కొద్దిమందికి కూడా ఎంతో కొంత మేలు జరిగింది కాబట్టే ఇలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఏతావతా, చెప్పొచ్చేదేమిటంటే – అటూ ఇటూ జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నా, విద్య–వైద్య పరంగా స్థూలంగా నేను ఈ ప్రభుత్వానికి వందకు 80–90 మార్కులు వేయ గలుగుతాను.
ధన్యవాదాలు, జైహింద్.
డా‘‘ ఇస్మాయిల్ పెనుకొండ
వ్యాసకర్త అమెరికాలో వైద్యుడు
Comments
Please login to add a commentAdd a comment