ఎస్‌ఎస్‌ఏలో ‘కాంట్రాక్టు’ వేతనాలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ)లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న అటెండర్లు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్‌పీ)లకు వేతనాలను పెంచాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అటెండర్లకు ప్రస్తుత వేతనం రూ.7500 ఉండగా, దీన్ని రూ.10 వేలకు, సీఆర్‌పీల రూ.9500 వేతనాన్ని రూ.11,400లకు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం జరగనున్న ఎస్‌ఎస్‌ఏ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో పేరిణీ నృత్యం తరగతులను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని విద్యా శాఖ యోచిస్తోంది. పేరిణీ నృత్యం కోర్సులు చేసిన వారిని తెలుగు యూనివర్సిటీలో ఆర్ట్ ఎడ్యుకేషన్ కింద ఇన్‌స్ట్రక్టర్లుగా నియమించాలని భావిస్తోంది. దీనిపై కూడా ఎస్‌ఎస్‌ఏ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.