Cluster Resource Person
-
ఎస్ఎస్ఏలో ‘కాంట్రాక్టు’ వేతనాలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న అటెండర్లు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)లకు వేతనాలను పెంచాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అటెండర్లకు ప్రస్తుత వేతనం రూ.7500 ఉండగా, దీన్ని రూ.10 వేలకు, సీఆర్పీల రూ.9500 వేతనాన్ని రూ.11,400లకు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం జరగనున్న ఎస్ఎస్ఏ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో పేరిణీ నృత్యం తరగతులను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని విద్యా శాఖ యోచిస్తోంది. పేరిణీ నృత్యం కోర్సులు చేసిన వారిని తెలుగు యూనివర్సిటీలో ఆర్ట్ ఎడ్యుకేషన్ కింద ఇన్స్ట్రక్టర్లుగా నియమించాలని భావిస్తోంది. దీనిపై కూడా ఎస్ఎస్ఏ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. -
సీఆర్పీల వేతనాలు నిలుపుదల
హెచ్ఎంల నిర్లక్ష్యం ఫలితమే కారణం మోర్తాడ్: సర్వశిక్ష అభియాన్ పథకంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)ల వేతనాలను జిల్లా అధికార యంత్రాంగం నిలిపి వేసింది. గ్రామీణ విద్యా రిజిస్టర్లను పూర్తి చేసి ఇవ్వడంలో హెచ్ఎంలు జాప్యం చేసిన కారణంగా అధికార యంత్రాం గం సీఆర్పీలపై చర్యలు తీసుకుంది. జిల్లాలో 209 మంది సీఆర్పీలు పని చేస్తున్నారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలలకు, మండల రిసోర్స్ సెంటర్కు మధ్య సీఆర్పీలు సమన్వయం చేస్తారు. వీరికి ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా రూ.8,500 వేతనం చెల్లిస్తుంది. అయితే, ఏప్రిల్కు సంబంధించిన వేతనాన్ని మాత్రం సర్వశిక్ష అభియాన్ ఉన్నతాధికారులు నిలపివేశారు. గ్రామీణ విద్యా రిజిస్టర్లను పూర్తి చేసి సర్వశిక్ష అభియాన్ పథకానికి అందించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉంది. కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ రిజిస్టర్లను అందించక పోవడంతో జిల్లాలోని అందరు సీఆర్పీల వేతనాన్ని అధికారులు నిలిపివేశారు. పాఠశాలలకు వేసవి సెలవులను ఇవ్వడంతో గ్రామీణ విద్యా రిజిస్టర్లను పూర్తి చేసివ్వడంపై హెచ్ఎంలు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయులు చేసిన తప్పిదానికి తమ వేతనం నిలిపి వేయడం ఎంతవరకు సబబు అని సీఆర్పీలు వాపోతున్నారు. వీరితో ఎంఐఎస్, కంప్యూటర్ ఆపరేటర్, మెస్సెంజర్ల వేతనాలను చెల్లించడం నిలిపివేసిన అధికారులు రెండ్రోజుల కింద సీఆర్పీలను మినహాయించి ఇతర ఉద్యోగుల వేతనాలు చెల్లించారు. ప్రభుత్వం స్పందించి తమకు కూడా వేతనాలు ఇప్పించాలని సీఆర్పీలు కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే.. గ్రామీణ విద్యా రిజిస్టర్లను అందచేయక పోవడంతో సీఆర్పీల వేతనాలు నిలిపి వే యాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. అందుకే వేతనాలు నిలిపివేశాం. తదుపరి ఆదేశాలు వస్తే వేతనాలు చెల్లిస్తాం. - రవికిరణ్, సర్వశిక్ష అభియాన్ ప్రతినిధి -
మూడు నెలలుగా జీతాల్లేవ్!
మందమర్రి రూరల్ : జిల్లాలోని 52 మండలాల్లో 251 మంది క్లస్టర్ రీసోర్సు పర్సన్ (సీఆర్పీ)లు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. వీరు ప్రతినెలా క్లస్టర్ పరిధిలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలను నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం సందర్శించాలి. ప్రతీరోజు ఒక పాఠశాలకు వెళ్లి ప్రార్థన సమయం నుంచి తరగతులు ముగిసి బడి మూసివేసే సమయం వరకు అక్కడే ఉండాలి. ఆ రోజంతా పాఠశాల పనితీరును పరిశీలిస్తూ భవనాలు, మరుగుదొడ్ల సౌకర్యం, నీటి వసతి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, విద్యార్థుల హాజరు తదితర అంశాలపై ఆరా తీయాలి. ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. ఆయా అంశాలపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారికి సమర్పించాలి. దీంతోపాటు బడిబయట ఉన్న చిన్నారులను గుర్తించి పాఠశాలలో చేర్పించే బాధ్యత కూడా వీరిదే. ఆర్వీఎం అధికారులు అడిగిన సమాచారాన్నీ అందించాలి. ఖర్చులకు ఇబ్బందులు.. ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సీఆర్పీలపై అదనపు పనిభారం ఉంటుంది. ఈ నెలల్లో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి జూన్లో పాఠశాలలు పునఃప్రారంభం కాగానే దగ్గరుండి బడిలో చేర్పించాలి. ఊరూరా తిరుగుతూ పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ఈ సమయంలోనే వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ ఏదో ఒక పాఠశాలకు వెళ్లడంతోపాటు ఆర్వీఎం అధికారులు అడిగిన సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ విధులు నిర్వర్తించేందుకు రోజుకు కనీసం రూ.50 నుంచి రూ.100 వరకు ఖర్చు అవుతుంది. మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో విధులు ఎలా నిర్వర్తించేదని సీఆర్పీలు ప్రశ్నిన్నారు. అధికారులకు విన్నవించినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితోపాటు ఎంఐసీ, సీసీవో, మేసెంజర్స్, ఐఈఆర్పీలకూ మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదు. పెరిగిన జీతం అందేనా? ప్రస్తుతం సీఆర్పీలకు నెలకు రూ.7000 చెల్లిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం మరో రూ.1500 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన జీతం జూన్ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇదీ సీఆర్పీలకు కాస్త ఊరట కలిగించే అంశం. అయినా జీతం చెల్లించకపోవడంతో పెరిగిన జీతం అమలుకు నోచుకుందో.. లేదో తెలియని పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా జీతం చెల్లించాలని జిల్లాలోని సీఆర్పీలు కోరుతున్నారు. -
జీతాలు రాక అల్లాడుతున్న ఆర్వీఎం సిబ్బంది
రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న 294మంది సి.ఆర్.పిలకు (క్లస్టర్ రిసోర్స్ పర్సన్) గడచిన 2 నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్నారు. ఏప్రిల్, మే నెల జీతాలు రాకపోగా, జూన్ నెలలో ఇప్పటికే సగం రోజులు గడచిపోయాయి. సి.ఆర్.పీలతో పాటు జిల్లా వ్యాప్తంగా 50మంది ఎం.ఐ.ఎస్ కో-ఆర్డినేటర్లు, 50మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 50మంది మెసెంజర్లు మొత్తం 444మంది పనిచేస్తున్నారు. వీరందరూ జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి రీజాయినింగ్ ఆర్డరు ఇవ్వకపోవటంతో జీతాలు రావడటం లేదని ఆర్.వి.ఎం ప్రాజెక్టు అధికారిణికి మొరపెట్టుకుంటున్నారు. రాజీవ్ విద్యామిషన్లో ఇటీవల పరిపాలనలో నెలకొన్న కొన్ని సంఘటనలు కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రాకుండా చేశాయని వాపోతున్నారు. ఐ.ఆర్.టి టీచర్లకూ తప్పని కష్టాలు... రాజీవ్ విద్యామిషన్లో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలలకు (వికలాంగులు) విద్య నేర్పేందుకు శిక్షణ కలిగిన 72మంది ఐ.ఆర్.టి టీచర్లు జిల్లాలోని భవిత కేంద్రాలలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారు. వీరికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి నాటికి రీజాయినింగ్ ఆర్డర్లు ఇచ్చే వారు. ఈ సంవత్సరం ఇంతవరకూ ఆర్డరు ఇవ్వని కారణంగా వీరికి మే నెల జీతం చేతికందలేదు. అంతేగాక భవిత కేంద్రాల్లో బాలలకు అందించాల్సిన ఉపకరణాలు (చంక కర్రలు, కాలిపర్స్, వినికిడి యంత్రాలు తదితరాలు) ఇంతవరకూ ఆ కేంద్రాలకు చేరలేదు. దీంతో ప్రత్యేకావసరాలు కావలసిన బాలలు ఉసూరుమంటున్నారు. రాజీవ్ విద్యామిషన్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న సి.ఆర్.పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎం.ఐ.ఎస్ కో-ఆర్డినేటర్లు, మెసెంజర్లు, ఐ.ఆర్.టి టీచర్లుకు వెంటనే రీజాయినింగ్ ఆర్డర్లు అందించి, వారికి వెంటనే జీతాలు చెల్లింపులు చేయాలని సి.ఆర్.పీల సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎస్.వెంకట్ డిమాండ్ చేశారు. జీతాల్లేక ఉద్యోగులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పరిస్థితుల పై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.