రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న 294మంది సి.ఆర్.పిలకు (క్లస్టర్ రిసోర్స్ పర్సన్) గడచిన 2 నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్నారు. ఏప్రిల్, మే నెల జీతాలు రాకపోగా, జూన్ నెలలో ఇప్పటికే సగం రోజులు గడచిపోయాయి. సి.ఆర్.పీలతో పాటు జిల్లా వ్యాప్తంగా 50మంది ఎం.ఐ.ఎస్ కో-ఆర్డినేటర్లు, 50మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 50మంది మెసెంజర్లు మొత్తం 444మంది పనిచేస్తున్నారు. వీరందరూ జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి రీజాయినింగ్ ఆర్డరు ఇవ్వకపోవటంతో జీతాలు రావడటం లేదని ఆర్.వి.ఎం ప్రాజెక్టు అధికారిణికి మొరపెట్టుకుంటున్నారు. రాజీవ్ విద్యామిషన్‌లో ఇటీవల పరిపాలనలో నెలకొన్న కొన్ని సంఘటనలు కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రాకుండా చేశాయని వాపోతున్నారు.
ఐ.ఆర్.టి టీచర్లకూ తప్పని కష్టాలు...
రాజీవ్ విద్యామిషన్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలలకు (వికలాంగులు) విద్య నేర్పేందుకు శిక్షణ కలిగిన 72మంది ఐ.ఆర్.టి టీచర్లు జిల్లాలోని భవిత కేంద్రాలలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారు. వీరికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి నాటికి రీజాయినింగ్ ఆర్డర్లు ఇచ్చే వారు. ఈ సంవత్సరం ఇంతవరకూ ఆర్డరు ఇవ్వని కారణంగా వీరికి మే నెల జీతం చేతికందలేదు. అంతేగాక భవిత కేంద్రాల్లో బాలలకు అందించాల్సిన ఉపకరణాలు (చంక కర్రలు, కాలిపర్స్, వినికిడి యంత్రాలు తదితరాలు) ఇంతవరకూ ఆ కేంద్రాలకు చేరలేదు. దీంతో ప్రత్యేకావసరాలు కావలసిన బాలలు ఉసూరుమంటున్నారు.
రాజీవ్ విద్యామిషన్‌లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న సి.ఆర్.పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎం.ఐ.ఎస్ కో-ఆర్డినేటర్లు, మెసెంజర్లు, ఐ.ఆర్.టి టీచర్లుకు వెంటనే రీజాయినింగ్ ఆర్డర్లు అందించి, వారికి వెంటనే జీతాలు చెల్లింపులు చేయాలని సి.ఆర్.పీల సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎస్.వెంకట్ డిమాండ్ చేశారు. జీతాల్లేక ఉద్యోగులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పరిస్థితుల పై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
జీతాలు రాక అల్లాడుతున్న ఆర్వీఎం సిబ్బంది
Published Wed, Jun 18 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM
Advertisement