data entry operator
-
హైటెక్ మోసాల ఆటకట్టు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నిందితుడి వద్ద శిక్షణ తీసుకొని, ఆపై సొంతంగా నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి తెలంగాణ సహా దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ సైబర్ ముఠా గుట్టురట్టయింది. డేటా ఎంట్రీ జాబ్స్ పేరిట నిరుద్యోగులకు వల వేసి.. ఆపై కంపెనీ షరతులను ఉల్లంఘించారని పేర్కొంటూ నకిలీ లీగల్ నోటీసులు పంపించి బాధితుల నుంచి సొమ్ము వసూలు చేసిందీ గ్యాంగ్. తెలంగాణ, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి 25కుపైగా రాష్ట్రాలలో 358 సైబర్ కేసులున్న ఈ ముఠా.. ఇప్పటివరకు సుమారు రూ.100 కోట్లకు పైగానే సొమ్ము వసూలు చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ శిల్పవల్లి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. టెలీ కాలర్గా పని చేసి.. గుజరాత్‌లోని సూరత్‌లో నకిలీ డేటా ఎంట్రీ కంపెనీలో దిండోలి ప్రాంతానికి చెందిన రాహుల్ అశోక్ భాయ్ భాస్కర్ టెలీ కాలర్గా పని చేశాడు. ఓ సైబర్ క్రైమ్ కేసు దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసులు కంపెనీ యజమాని నితీష్ ను అరెస్టు చేసి, కాల్ సెంటర్‌ను మూసేశారు. కాల్ సెంటర్, డేటా ఎంట్రీ కార్యకలాపాలపై పట్టు సాధించిన రాహుల్.. తన స్నేహితులైన సాగర్ పాటిల్, కల్పేష్ థోరట్, నీలేష్ పాటిల్‌లను సంప్రదించి సైబర్ మోసాల గురించి వివరించాడు. ఈ నలుగురూ కలిసి సూరత్‌లో ఫ్లోరా సొల్యూషన్ పేరుతో నకిలీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ పోర్టల్స్ నుంచి నిరుద్యోగుల డేటాను సేకరించి, వారికి వాట్సాప్ ద్వారా డేటా ఎంట్రీ జాబ్ సందేశాలను పంపించేవారు. ఆసక్తి కనబరిచిన వారికి జాబ్ లాగిన్ కోసం ఐడీ, పాస్వర్డ్ అందించేవారు. నకిలీ లీగల్ నోటీసులతో బెదిరింపులు.. డేటా ఎంట్రీ పని పూర్తయ్యాక ఉద్యోగికి సొమ్ము చెల్లించకుండా కంపెనీ ప్రమాణాలకు తగిన స్థాయిలో డేటా ఎంట్రీ లేదని మాయమాటలు చెబుతూ సొమ్ము చెల్లించరు. దీంతో కొంతకాలం ఎదురుచూసిన ఉద్యోగికి డేటా ఎంట్రీ చేయడం మానేస్తాడు. అప్పుడే నిందితులు రంగంలోకి దిగుతారు. కంపెనీ నిబంధనలు, షరతులను ఉల్లంఘించారని పేర్కొంటూ నకిలీ లీగర్ నోటీసులను బాధితులకు వాట్సాప్, ఈ–మెయిల్ ద్వారా పంపించి బెదిరింపులకు తెగిస్తారు. నోటీసులు రద్దు చేసుకోవాలంటే చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. ఈక్రమంలో సైబరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు వీరి వలలో చిక్కి రూ.6.17 లక్షలు మోసపోయాడు. ఇప్పటికే ఈ ముఠాపై సైబరాబాద్‌లో 11 కేసులున్నాయి. వేలాది బ్యాంకు ఖాతాల విశ్లేషణ.. బాధితులు పంపించిన సొమ్ము ఏ బ్యాంకు ఖాతాలు నుంచి ఎక్కడికి బదిలీ అయ్యాయో విశ్లేíÙంచారు. ఇతరత్రా సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులు రాహుల్, సాగర్, కల్పేష్, నీలేష్లు సూరత్‌లో ఉన్నట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం వారిని అరెస్టు చేసి, స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారంట్ నగరానికి తీసుకొచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి ఆరు ఫోన్లు, ల్యాప్‌టాప్, 5 డెబిట్ కార్డులను స్వాదీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు సోమవారం కస్టడీకి పిటీషన్ దాఖలు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. -
డబ్ల్యూడీసీడబ్ల్యూ, రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ చిల్డ్రన్(డబ్ల్యూడీసీడబ్ల్యూ).. రంగారెడ్డి జిల్లా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 27 ► పోస్టుల వివరాలు: లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్–01, అవుట్‌రీచ్ వర్కర్(మేల్)–01, డేటా ఎంట్రీ ఆపరేటర్–02, సా మేనేజర్–01, సోషల్ వర్కర్–01, ఆయా –17, చౌకీదార్–03, ఏఎన్ఎం–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, పీజీ డిగ్రీ(ఎల్ఎల్బీ/ఎల్ఎల్ఎం) ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వేతనం: నెలకు రూ.6000 నుంచి రూ.21000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చిరునామా: జిల్లా సంక్షేమ అధికారి, రంగారెడ్డి జిల్లా, వెంగళరావు నగర్–500038. ► దరఖాస్తులకు చివరి తేది: 20.11.2021 ► వెబ్సైట్: https://wdcw.tg.nic.in -
కడప, వైజాగ్‌లలో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
కడప జిల్లా అంగన్వాడీల్లో 288 ఖాళీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం.. అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 288 ► పోస్టుల వివరాలు: అంగన్వాడీ కార్యకర్తలు–50, అంగన్వాడీ సహాయకురాలు–225, మినీ అంగన్వాడీ కార్యకర్తలు–13. ► అర్హత: అంగన్ వాడీ కార్యకర్త పోస్టులకు పదో తరగతి, అంగన్వాడీ సహాయకురాలు, మినీ అంగన్ వాడీ కార్యకర్త పోస్టులకు ఏడో ఉత్తీర్ణత ఉండాలి. స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: అర్హత ప్రమాణాలు, ఓరల్ ఇంట ర్వ్యూ, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును స్త్రీశిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపించాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021 ► వెబ్సైట్: kadapa.ap.gov.in డబ్ల్యూడీసీడబ్ల్యూ, విశాఖపట్నంలో 12 పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 12 ► పోస్టుల వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్–07, కంప్యూటర్ ఆపరేటర్–05. ► డేటా ఎంట్రీ ఆపరేటర్: పని చేయాల్సిన ప్రాంతాలు: కొయ్యూరు, ముంచంగిపుట్, పాడేరు, పెదబయలు,డుంబ్రీగూడ,అనకాపల్లి, రావికమతం. ► కంప్యూటర్ ఆపరేటర్: పని చేయాల్సిన ప్రాంతాలు: భీమునిపట్నం, నర్సీపట్నం,పెందుర్తి, నక్కపల్లి, ఎలమంచిలి. ► అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.15,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021 ► వెబ్సైట్: https://visakhapatnam.ap.gov.in -
‘నా చావుకు మాజీ కమిషనరే కారణం’
సూసైడ్ నోట్ రాసి ఐకేపీ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆత్మహత్య తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరు ఐకేపీ డేటాఎంట్రీ ఆపరేటర్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నా చావుకు తాండూరు మున్సిపల్ మాజీ కమిషనర్ గోపయ్య, అకౌంటెంట్ సుధాతన్బాబులే కారణం’ అని సూసైడ్ నోట్లో రాశాడు. పెద్దేముల్ మండలం గాజీపూర్వాసి జి.మహేష్(31) తాండూరు మున్సిపాలిటీలో డేటాఎంట్రీ ఆపరేటర్. పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ ఈ నెలాఖరున చేపట్టిన విచారణకు హాజరుకావాల్సి ఉంది. చేయని తప్పునకు బలిచేశారని మహేష్ బాధపడేవాడు. దీంతో బుధవారం తాండూరు-రుక్మాపూర్ మార్గంలో రైలు కిందపడి చనిపోయాడు. -
డేటా ఎంట్రీ ఆపరేటర్ సస్పెన్షన్
బీవీపాళెం(తడ): బీవీపాళెం చెక్‌పోస్టు వాణిజ్య పన్నుల శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రవిబాబుని శనివారం డీసీ సస్పెండ్ చేశారు. ఈనెల 13వ తేదీన బయటి రాష్టం నుంచి మూడు లారీలు తమిళనాడు వైపు పప్పు దినుసుల లోడుతో వెళుతున్నాయని ఆ లారీలు చెక్‌పోస్టుకు వస్తే ఆపాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ నిర్లక్ష్యం వహించి లారీలకు యధావిధిగా పాసులు కొట్టి పంపించడం జరిగింది. దీనిపై విచారణ సాగించిన డీసీ దీనికి సంబంధించి ఆ రోజు విధుల్లో ఉన్న అధికారిని సీసీ కెమెరా ఫుటేజీలు, ఇచ్చిన పాసులో ఉన్న వివరాల ఆధారంగా బాధ్యుడిని గుర్తించి శనివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాలు ఎగ్జిట్ చెక్‌పోస్టులో ఎంటర్ కావాల్సి ఉండగా అవి ఇన్కమింగ్ చెక్‌పోస్టులో ఎగ్జిట్ అవడం విశేషం. -
‘ఇంటిదొంగ’ గుట్టురట్టు
జేడీఏ కార్యాలయంలో రూ.3 కోట్లు కాజేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ సంగారెడ్డి రూరల్: మెదక్ జిల్లా వ్యవసాయ కార్యాలయం నుంచి డబ్బులు కాజేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎట్టకేలకు దొరికాడు. సంతకాలు ఫోర్జరీ చేసి రూ.3.35 కోట్లు కాజేసిన మానయ్య అలియాస్ మాణిక్యం (29)ను సంగారెడ్డి రూరల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. డీఎస్పీ తిరుపతన్న కేసు వివరాలను విలేకరులకు వివరించారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ మానయ్య రూ.3 కోట్లకుపైగా అక్రమం గా డబ్బులు డ్రా చేశారని జేడీఏ హుక్యానాయక్ గత నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానితుల సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా ఆఫీసులో డేటా ఎం ట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శంకర్పల్లి మం డలం లక్ష్మీరెడ్డిగూడెంకు చెందిన మానయ్య జేడీఏ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్‌కేబీవై పథకానికి చెందిన రూ.కోటికి పైగా, ఎన్ ఎఫ్ఎస్ఎం నుంచి రూ. 2 కోట్లకు పైగా డ్రా చేశాడు. జాతకం మార్చిన ఫోన్‌కాల్: ‘షెవర్ల్లెట్ కంపె నీ నుంచి రూ.7 కోట్లు గెలుచుకున్నారు. ఆ డబ్బు పొందాలంటే రూ.3.50కోట్లను తాము సూచించిన అకౌంట్లలో జమ చేయాలి’ అని మానయ్య ఫోన్‌కు ఎస్ఎంఎస్ వచ్చింది. దీంతో మానయ్య.. తాను పని చేస్తున్న కార్యాలయం నుంచి డబ్బులను డ్రా చేసి సదరు కంపెనీ అకౌంట్‌కు పంపించాడు. ఈ క్రమం లో ఓ బ్యాంక్ కర్ల్క్‌కు అనుమానం వచ్చి జేడీఏ హుక్యానాయక్‌కు లేఖ రాయడంతో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో ఇతర సిబ్బంది ప్రమేయం ఉందా? లేదా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎస్ఎంఎస్లను రిసీవ్ చేసుకొనే వ్యక్తులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల లో డబ్బు ఆన్లైన్ ద్వారా అక్రమంగా డ్రా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. -
సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ
అదనంగా ఆపరేటర్ల నియామకం - ఇప్పటివరకు 38.79శాతం కంప్యూట రీకరణ - గ్రామీణ మండలాల్లో నత్తనడక.. పట్టణ ప్రాంతాల్లో చకచకా సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణలో జిల్లా యంత్రాంగం వేగాన్ని పెంచింది. సేకరించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు అదనంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను రంగంలోకి దించింది. సమగ్ర సర్వేను కంప్యూటరీకరించేందుకు జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంట్లో రెండు వేల కంప్యూటర్లను సమకూర్చిన యంత్రాంగం.. సర్వే సమాచారాన్ని నమోదు చేయడానికి అదేస్థాయిలో ఆపరేటర్లను నియమించింది. తొలి రెండు రోజులు కేవలం 900 మంది మాత్రమే హాజరుకావడం, కంప్యూటరీకరణ ఆలస్యమవుతుండడాన్ని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే డీటీపీ ఆపరేటర్లను అందరినీ ఈ విధులకు వినియోగించుకున్నప్పటికీ, నిర్ణీత వ్యవధిలో సమాచార నిక్షిప్తం కష్టసాధ్యమని భావించింది. ఈ క్రమంలో ప్రైవేటు ఆపరేటర్లను భారీగా వినియోగించింది. ఒక్కో కుటుంబం సమాచారాన్ని ఎంట్రీ చేసేందుకు ఐదు రూపాయలు ఇచ్చింది. అయినప్పటికీ కావాల్సినంతమంది ఆపరేటర్లు దొరకకపోవడంతో దీన్ని రూ.8, ఆ తర్వాత పది రూపాయలకు పెంచింది. దీంతో ఆపరేటర్లు ఇబ్బడిముబ్బడిగా సమకూరారు. ఈ నేపథ్యంలోనే డేటా ఎంట్రీ పనులు వేగాన్ని అందుకున్నాయి. గత నెల 19వ తేదీన జిల్లావ్యాప్తంగా(జీహెచ్ఎంసీ పరిధి మినహా) 8.41 లక్షల కుటుంబాల సర్వే వివరాలు నమోదు చేయగా, దీంట్లో ఇప్పటివరకు 3.40లక్షల కుటుంబాల సమాచారం కంప్యూటరీకరణకు నోచుకుంది. ఈ నెల 10వ తేదీ నాటికీ సర్వే సమాచారాన్ని కంప్యూటర్లలో పొందుపరచాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ ప్రాంతాల్లో వడివడిగా.... పట్టణ ప్రాంతాల్లో కంప్యూటరీకరణ వడివడి గా సాగుతున్నా.. గ్రామీణ మండలాల్లో మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో డేటా ఎంట్రీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. అతి తక్కువ శాతం కుల్కచర్ల మండలంలో ఆదివారం వరకు 9.53% మాత్రమే సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. అలాగే బషీరాబాద్ 10.49%, గండేడ్ 10.88%, తాండూరు నగర పంచాయతీలో 11%, పెద్దేముల్లో 11.18%, వికారాబాద్ 11.89%, యాలాల 15.62%, మర్పల్లిలో 16 శాతం మాత్రమే డేటా ఎంట్రీ పూర్తయింది. నగర శివార్లలో మేడ్చల్, హయత్‌నగర్ మండలాల్లో ఇప్పటికే కంప్యూటరీకరణ ప్రక్రియ ముగిసింది. సరూర్‌నగర్ 92.49%, ఇబ్రహీంపట్నం 78.1%, శామీర్‌పేట 72.7%, మంచాల 72.25 శాతం పూర్తికాగా, మిగిలిన మండలాల్లో సగం కుటుంబాల సమాచారాన్ని ఇప్పటివరకు కంప్యూటరీకరించారు. -
సిబ్బంది లేరు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియలో జిల్లా యంత్రాంగానికి మరో తలనొప్పి వచ్చిపడింది. సర్వే ప్రక్రియలో సిబ్బంది కొరతతో సతమతమైన యంత్రాంగం.. చివరకు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, విద్యార్థులను వినియోగించుకుని పరిస్థితిని గట్టెక్కించింది. తాజాగా ఈ సర్వే వివరాల కంప్యూటరీకరణకు కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్లు కరువయ్యారు. వివరాల నమోదు ప్రక్రియ మొదలుపెట్టి ఐదురోజులు కావస్తున్నా.. ఇప్పటివరకు కేవలం 50వేల కుటుంబాలకు సంబంధించి మాత్రమే నమోదు పూర్తయింది. మరోవైపు సర్కారు విధించిన గడువు ముంచుకొస్తుండగా.. నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం తో జిల్లా యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆరు శాతమే! జిల్లాలోని గ్రామీణ ప్రాంతాన్ని మాత్రమే యంత్రాంగం సర్వే చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని జిల్లా పరిధినంతా జీహెచ్ఎంసీ అధికారులు సర్వే చేశారు. అయితే గ్రామీణ ప్రాంతంలో దాదాపు ఎనిమిది లక్షల కుటుంబాలను సర్వే చేయగా.. వాటిని ప్రస్తుతం కంప్యూటర్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకుగాను శివార్లలోని ఇంజినీరింగ్ కళాశాలలను నమోదు కేంద్రాలుగా ఎంపిక చేశారు. అక్కడ కంప్యూటర్లు అందుబాటులో ఉండడంతో ప్రక్రియ సులభతరమవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. వివరాల నమోదుకు రెండువేల కంప్యూటర్లు వినియోగించేలా ఏర్పాట్లు చేసింది. ఇంతవరకు అధికారులు విజయవంతంగా ప్రక్రియను పూర్తిచేశారు. కానీ అసలు చిక్కంతా డాటా ఎంట్రీ ఆపరేటర్ల అంశంలో వచ్చిపడింది. రెండువేల మంది ఆపరేటర్లను వినియోగించుకుని రెండువేల కంప్యూటర్ల ద్వారా నమోదు చేయాలని అధికారుల భావించినా.. కేవలం తొమ్మిది వందల మంది ఆపరేటర్లు మాత్రమే లభించారు. అందుబాటులో ఉన్న ఆపరేటర్లతో నమోదు ప్రక్రియ చేపట్టగా.. ఇప్పటివరకు కేవలం 50వేల కుటుంబాల వివరాలు మాత్రమే నమోదు చేశారు. నిర్దేశిత లక్ష్యంలో కేవలం ఆరుశాతం మాత్రమే పూర్తిచేయడంతో అధికారగణం ఆందోళన చెందుతోంది. గడువులోగా కష్టమే.. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియంతా సెప్టెంబర్ రెండోతేదీ నాటికి పూర్తిచేయాలని సర్కారు స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో ఈనెల 22 నుంచి నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించింది. అయితే జిల్లాలో మాత్రం కంప్యూటర్ల నిర్వహణలో సమస్య తలెత్తడంతో కొంత జాప్యం జరిగింది. ఫలితంగా మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో నమోదు ప్రక్రియ ప్రారంభించగా.. ఇప్పటివరకు 50వేల ఫారాలను కంప్యూటరీకరించారు. సగటున రోజుకు 25వేల దరఖాస్తులు పూర్తవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సర్కారు విధించిన గడువు నాటికి కేవలం 25శాతం మాత్రమే పూర్తవుతుందని తె లుస్తోంది. మరోవైపు డాటాఎంట్రీ ఆపరేటర్ల సంఖ్య పెంచేందుకు యంత్రాంగం ప్రత్యేక తాయిలాలు ప్రకటిస్తోంది. ప్రస్తుతం డాటా ఎంట్రీ చేస్తున్న ప్రభుత్వం సంబంధిత ఉద్యోగులకు ఒక్కో దరఖాస్తుకు రూ.5 చెల్లిస్తుండగా.. ప్రైవేటు సిబ్బందికి రూ.10వరకు చెల్లిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆపరేటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సెప్టెంబర్ పదో తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని కలెక్టర్ ఎన్.శ్రీధర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో టెన్షన్
ఈ నెలాఖరుతో ముగియనున్న కాలపరిమితి కొత్తగా టెండర్లు పిలుస్తారో.. పాత వారినే తీసుకుంటారో? చిత్తూరు (టౌన్): జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖల పరిధిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి ఈనెలాఖరుతో ముగియనుంది. దీంతో ఇటు అధికారులకు అటు ఉద్యోగులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ప్రతి శాఖలోనూ పదుల సంఖ్యలో ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. కొన్ని శాఖల్లో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై ఇప్పట్లో తేల్చే పరి స్థితి కనిపించక పోవడంతో కొన్ని శాఖల అధికారులు డీలాపడిపోతున్నారు. 2013-14కు గాను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న సిబ్బంది కాలపరిమితి గత మార్చి 31వ తేదీతో పూర్తయింది. అయితే రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నందున గవర్నర్ అనుమతితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు వారి కాలపరిమితిని మూడు నెలలు పొడిగించారు. ఆ పొడిగింపు ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. అయితే పొడిగింపు ఆదేశాలిచ్చిన అధికారులు వారి జీతాల బడ్జెట్ సంగతిని ఇప్పటికీ తేల్చలేదు. కాలపరిమితి పూర్తయ్యే లోగా ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాలను క్లియర్ చేయాల్సి ఉంది. పాతవారినే కొనసాగిస్తే ఫర్వాలేదు కానీ టెండర్ల ప్రక్రియ ద్వారా కొత్తవారిని తీసుకుంటే ఇప్పుడున్న వారి జీతాలను ఎలా క్లియర్ చేయాలనేడైలమాలో అధికారులు ఉన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లే కీలకం జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమశాఖ, డీఆర్డీఏ, డ్వామా, హౌసింగ్, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ తదితర శాఖల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ శాఖల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా, డేటాఎంట్రీ ఆపరేటర్లుగా చాలామంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులే పనిచేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని జూలై నుంచి టెండర్ల ద్వారా కొత్తవారిని తీసుకుంటే అప్పుడేం చేయాలనేది ఈ శాఖల అధికారులకు పాలుపోవడం లేదు. కొత్తగా వచ్చేవారు పని నేర్చుకునే వరకు జరగాల్సిన రోజువారి విధులను ఎలా నిర్వర్తించాలనే ప్రశ్న వారిని వేధిస్తోంది. సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల్లాంటి కీలక శాఖల్లో విద్యార్థులు, వారికి వర్తించే పథకాలు, ప్రభుత్వం నుంచి విడుదలయ్యే బడ్జెట్ తదితరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టడం, డౌన్లోడ్ చేసుకోవడం తదితరాలను నిత్యం చేపడుతూ రావాలి. ఈ విషయాల్లో నిత్యం జిల్లా ప్రగతిని ఉన్నతాధికారులకు నివేదికలు పంపాలి. అయితే ఇప్పటి వరకు కొన్ని శాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులే కీలకంగా వ్యవహరిస్తుండడంతో వారు లేకుం టే ఏం చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. జిల్లాలోని పలుశాఖల్లో నాలుగు వేలకు పైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా వీరందరి కాలపరిమితి పూర్తికానుంది. దాంతో ఆయా శాఖల అధికారులతోపాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. -
జీతాలు రాక అల్లాడుతున్న ఆర్వీఎం సిబ్బంది
రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న 294మంది సి.ఆర్.పిలకు (క్లస్టర్ రిసోర్స్ పర్సన్) గడచిన 2 నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్నారు. ఏప్రిల్, మే నెల జీతాలు రాకపోగా, జూన్ నెలలో ఇప్పటికే సగం రోజులు గడచిపోయాయి. సి.ఆర్.పీలతో పాటు జిల్లా వ్యాప్తంగా 50మంది ఎం.ఐ.ఎస్ కో-ఆర్డినేటర్లు, 50మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 50మంది మెసెంజర్లు మొత్తం 444మంది పనిచేస్తున్నారు. వీరందరూ జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి రీజాయినింగ్ ఆర్డరు ఇవ్వకపోవటంతో జీతాలు రావడటం లేదని ఆర్.వి.ఎం ప్రాజెక్టు అధికారిణికి మొరపెట్టుకుంటున్నారు. రాజీవ్ విద్యామిషన్‌లో ఇటీవల పరిపాలనలో నెలకొన్న కొన్ని సంఘటనలు కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రాకుండా చేశాయని వాపోతున్నారు. ఐ.ఆర్.టి టీచర్లకూ తప్పని కష్టాలు... రాజీవ్ విద్యామిషన్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలలకు (వికలాంగులు) విద్య నేర్పేందుకు శిక్షణ కలిగిన 72మంది ఐ.ఆర్.టి టీచర్లు జిల్లాలోని భవిత కేంద్రాలలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారు. వీరికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి నాటికి రీజాయినింగ్ ఆర్డర్లు ఇచ్చే వారు. ఈ సంవత్సరం ఇంతవరకూ ఆర్డరు ఇవ్వని కారణంగా వీరికి మే నెల జీతం చేతికందలేదు. అంతేగాక భవిత కేంద్రాల్లో బాలలకు అందించాల్సిన ఉపకరణాలు (చంక కర్రలు, కాలిపర్స్, వినికిడి యంత్రాలు తదితరాలు) ఇంతవరకూ ఆ కేంద్రాలకు చేరలేదు. దీంతో ప్రత్యేకావసరాలు కావలసిన బాలలు ఉసూరుమంటున్నారు. రాజీవ్ విద్యామిషన్‌లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న సి.ఆర్.పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎం.ఐ.ఎస్ కో-ఆర్డినేటర్లు, మెసెంజర్లు, ఐ.ఆర్.టి టీచర్లుకు వెంటనే రీజాయినింగ్ ఆర్డర్లు అందించి, వారికి వెంటనే జీతాలు చెల్లింపులు చేయాలని సి.ఆర్.పీల సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎస్.వెంకట్ డిమాండ్ చేశారు. జీతాల్లేక ఉద్యోగులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పరిస్థితుల పై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. -
మండలానికో రీసోర్స్ భవనం
ఇందూరు,న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రతి మండలంలో పంచాయతీ రాజ్ శాఖ రీసోర్స్ సెంటర్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఒక్కో భవనానికి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయనుంది. ఈ మేరకు పంచాయతీ శాఖ అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి సమావేశాలు నిర్వహించుకోవాలన్నా... అధికారులు, పాలక వర్గాలు ఏదైనా హోట్‌ల్‌లోని కాన్ఫరెన్స్ హాటళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. స్థలాలు వెదకడం పూర్తికాగానే రీసోర్స్ సెంటర్ భవనాల నిర్మాణాల పనులు ప్రారంభమవుతాయి. ఐదు నెలల క్రితమే గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఏర్పాటు కాగా, త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. కొత్త పాలక వర్గాలకు పంచాయతీరాజ్ శాఖ తరపున శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అధికారులు కూడా శిక్షణ తరగతులను ఈ భవనాల్లో నిర్వహించుకోవచ్చు. రీసోర్స్ సెంటర్ల నిర్వహణ కోసం కో ఆర్డినేటర్, బిల్డింగ్ సూపర్వైజర్, సివిల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, డాటాఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తారు. జిల్లా కేంద్రంలోనూ.. మండల కేంద్రాల్లో పంచాయతీ రీసోర్స్ సెంటర్ల మాదిరిగానే జిల్లా కేంద్రంలోనూ జిల్లా పంచాయతీ రీసోర్స్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ భవన నిర్మాణం కోసం కోటి రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ భవన నిర్మాణం కోసం ముందుగా సిర్పూర్ గ్రామ శివారులో స్థలం వెదికారు. అయితే జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటంతో దానిని రద్దు చేశారు.ప్రస్తుతం జిల్లా పరిషత్ కార్యాలయం వెనుక శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లను కూలివేసి అక్కడ భవనాన్ని నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ భవనాన్ని త్వరితంగా నిర్మించేందుకు నిధుల విడుదల కోసం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. సమావేశాలకు,శిక్షణ తరగతులకు అనువుగా ఉంటుంది... - సురేశ్ బాబు, జిల్లా పంచాయతీ అధికారి జిల్లాలో నిర్మించే రీసోర్స్ సెంటర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు పాలక వర్గాలకు సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటాయి. వేరే భవనాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. -
వేతనాలివ్వండి మహాప్రభో!
కూచిపూడి, న్యూస్‌లైన్ : దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి గ్రామీణప్రాంత ప్రజల ఆరోగ్యరీత్యా ప్రవేశపెట్టిన 104 పథకంలో అతితక్కువ వేతనానికే సేవలందిస్తున్న సిబ్బంది జీతాలు లేక అలమటిస్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు లే(రా)క పస్తులుంటున్నామని వాపోతున్నారు. జిలాల్లోని 14క్లస్టర్లలో 19 వరకు 104 సంచార వైద్యశాలలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క క్లస్టర్లో డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్), ల్యాబ్‌టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, వ్యాన్ డ్రైవర్ విధులు నిర్వర్తిస్తుంటారు. వీరికి గతేడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల వేతనాలు రాక అప్పులు చేసుకుంటూ దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇదిలా ఉండగా మిగిలిన జిల్లాలో రెండో శనివారం సెలవులిస్తుండగా ఈ జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ నుంచి సెలవు రద్దు చేసినట్లు సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. సెలవును పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. 104 వాహనానికి డీజిల్, మందులకు మాత్రం నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం సిబ్బందికి మాత్రం జీతాలివ్వకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాపం పండింది
మహబూబ్‌నగర్ లీగల్/క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో సంచలనం సృష్టించిన బాలిక కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా జడ్జి టి.గంగిరెడ్డి శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే... స్థానిక టీచర్స్ కాలనీకి చెందిన పి.నాగరాజు, రజిత దంపతుల కుమార్తె శ్రీయ(6)ను అదే ఇంట్లో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మహ్మద్ యాకూబ్ డబ్బు కోసం కిడ్నాప్ చేసేందుకు పథకం రూపొందించారు. తన స్నేహితులు నసీర్, అమీర్ సహకారంతో గత ఏప్రిల్ 17వ తేదీన చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్యచేసి అడ్డాకుల మండలం పోల్కంపల్లి శివారులో ఓ పాడుబడ్డ వ్యవసాయ బావిలో పడేసి వెళ్లిపోయారు. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయగా, పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాప్ హత్యను ఛేదించారు. సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఎస్ఐ సుదర్శన్‌బాబు దర్యాప్తు చేసి నిందితులపై చార్జిషీటు దాఖలు చేశారు. పీపీ వినోద్‌కుమార్ మొత్తం 20 మందిసాక్షులను ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలు నిరూపణ కావడంతో నిందితులకు కోర్టు బాలికను హత్య చేసినందుకు జీవిత ఖైదు, కిడ్నాప్ చేసినందుకు పదేళ్లు కఠిన కారాగార శిక్ష విధించారు. సాక్ష్యాలను మార్చేం దుకు ప్రయత్నించినందుకు అదనంగా జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అప్పీల్‌కు వెళ్తున్నాం: పీపీ ఈ కేసును సంచలనాత్మకమైన, క్రూరమైన కేసుగా భావించి నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోరుతూ హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్తున్నట్లు పీపీ వినోద్‌కుమార్ తెలిపారు. నిందితులకు ఉరిశిక్ష పడడానికి తగిన సాక్షాధారాలు కోర్టు ముందు ఉంచామన్నారు. నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించడంపై కక్షిదారులు, న్యాయవాదులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందోనని జిల్లా ప్రజలు ఉత్కం ఠతో ఎదురుచూశారు. శుక్రవారం తీర్పు వినేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో కోర్టు ఆవరణ కిక్కిరిసింది. అత్యాశతో కటకటాల పాలు... మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులు రాత్రికి రాత్రే శ్రీమంతులు కావాలన్న దురాశ వారి జీవితాలను కటకటాలపాలు చేసింది. మనుషుల మధ్య నమ్మకం అన్న పదానికి వీరి అత్యాశ అర్థం లేకుండా చేసింది. అన్నం పెట్టి ఆదరించిన యజమాని, ‘అంకుల్’ అంటూ వారిని అంటిపెట్టుకు తిరిగిన చిన్నారిని పాశావికంగా హత్య చేశారు. కేసులో ప్రధాన నిందితుడు యాకుబ్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. జీవనోపాధి కోసం శ్రీయ తల్లిదండ్రుల వద్ద కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరాడు. నెల నెల వచ్చే జీతంతో జల్సాలు తీరకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో బాలిక కిడ్నాప్‌నకు ప్రణాళిక వేశాడు. చివరికి బాలికను హత్యచేసి కటకటాలపాలయ్యాడు. కేవలం 26 ఏళ్లకే అత్యాశతో జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. అమీర్, నసీర్‌లు ఆటోడ్రైవర్లు... రోజంతా ఆటో నడిపితే తప్ప జీవనం లేని పరిస్థితి అమీర్, నసీర్ కుటుంబాలది. ఆటో నడుపుతూ వచ్చిన డబ్బులతో తమ కుటుంబాలను పొషిస్తున్నారు. కుటుం బ పరిస్థితులు బాగో లేకపోవడంతో చదువుకునే వయసులోనే ఆటో డ్రైవర్లుగా మారారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సులువుగా డబ్బులు వస్తాయని ఆశపడి యాకుబ్ ఉచ్చు లో పడ్డారు. చివరికి హత్యకేసులో 20 ఏళ్లకే జైలుపాలై నిండు జీవితాన్ని కోల్పోయారు.