సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ
అదనంగా ఆపరేటర్ల నియామకం
- ఇప్పటివరకు 38.79శాతం కంప్యూట రీకరణ
- గ్రామీణ మండలాల్లో నత్తనడక.. పట్టణ ప్రాంతాల్లో చకచకా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణలో జిల్లా యంత్రాంగం వేగాన్ని పెంచింది. సేకరించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు అదనంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను రంగంలోకి దించింది. సమగ్ర సర్వేను కంప్యూటరీకరించేందుకు జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంట్లో రెండు వేల కంప్యూటర్లను సమకూర్చిన యంత్రాంగం.. సర్వే సమాచారాన్ని నమోదు చేయడానికి అదేస్థాయిలో ఆపరేటర్లను నియమించింది. తొలి రెండు రోజులు కేవలం 900 మంది మాత్రమే హాజరుకావడం, కంప్యూటరీకరణ ఆలస్యమవుతుండడాన్ని అధికారులు గుర్తించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే డీటీపీ ఆపరేటర్లను అందరినీ ఈ విధులకు వినియోగించుకున్నప్పటికీ, నిర్ణీత వ్యవధిలో సమాచార నిక్షిప్తం కష్టసాధ్యమని భావించింది. ఈ క్రమంలో ప్రైవేటు ఆపరేటర్లను భారీగా వినియోగించింది. ఒక్కో కుటుంబం సమాచారాన్ని ఎంట్రీ చేసేందుకు ఐదు రూపాయలు ఇచ్చింది. అయినప్పటికీ కావాల్సినంతమంది ఆపరేటర్లు దొరకకపోవడంతో దీన్ని రూ.8, ఆ తర్వాత పది రూపాయలకు పెంచింది.
దీంతో ఆపరేటర్లు ఇబ్బడిముబ్బడిగా సమకూరారు. ఈ నేపథ్యంలోనే డేటా ఎంట్రీ పనులు వేగాన్ని అందుకున్నాయి. గత నెల 19వ తేదీన జిల్లావ్యాప్తంగా(జీహెచ్‌ఎంసీ పరిధి మినహా) 8.41 లక్షల కుటుంబాల సర్వే వివరాలు నమోదు చేయగా, దీంట్లో ఇప్పటివరకు 3.40లక్షల కుటుంబాల సమాచారం కంప్యూటరీకరణకు నోచుకుంది. ఈ నెల 10వ తేదీ నాటికీ సర్వే సమాచారాన్ని కంప్యూటర్లలో పొందుపరచాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.
పట్టణ ప్రాంతాల్లో వడివడిగా....
పట్టణ ప్రాంతాల్లో కంప్యూటరీకరణ వడివడి గా సాగుతున్నా.. గ్రామీణ మండలాల్లో మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో డేటా ఎంట్రీ చాలా ఆలస్యంగా జరుగుతోంది.
అతి తక్కువ శాతం కుల్కచర్ల మండలంలో ఆదివారం వరకు 9.53% మాత్రమే సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. అలాగే బషీరాబాద్ 10.49%, గండేడ్ 10.88%, తాండూరు నగర పంచాయతీలో 11%, పెద్దేముల్‌లో 11.18%, వికారాబాద్ 11.89%, యాలాల 15.62%, మర్పల్లిలో 16 శాతం మాత్రమే డేటా ఎంట్రీ పూర్తయింది. నగర శివార్లలో మేడ్చల్, హయత్‌నగర్ మండలాల్లో ఇప్పటికే కంప్యూటరీకరణ ప్రక్రియ ముగిసింది. సరూర్‌నగర్ 92.49%, ఇబ్రహీంపట్నం 78.1%, శామీర్‌పేట 72.7%, మంచాల 72.25 శాతం పూర్తికాగా, మిగిలిన మండలాల్లో సగం కుటుంబాల సమాచారాన్ని ఇప్పటివరకు కంప్యూటరీకరించారు.