Computerized survey
-
సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ
అదనంగా ఆపరేటర్ల నియామకం - ఇప్పటివరకు 38.79శాతం కంప్యూట రీకరణ - గ్రామీణ మండలాల్లో నత్తనడక.. పట్టణ ప్రాంతాల్లో చకచకా సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణలో జిల్లా యంత్రాంగం వేగాన్ని పెంచింది. సేకరించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు అదనంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను రంగంలోకి దించింది. సమగ్ర సర్వేను కంప్యూటరీకరించేందుకు జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంట్లో రెండు వేల కంప్యూటర్లను సమకూర్చిన యంత్రాంగం.. సర్వే సమాచారాన్ని నమోదు చేయడానికి అదేస్థాయిలో ఆపరేటర్లను నియమించింది. తొలి రెండు రోజులు కేవలం 900 మంది మాత్రమే హాజరుకావడం, కంప్యూటరీకరణ ఆలస్యమవుతుండడాన్ని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే డీటీపీ ఆపరేటర్లను అందరినీ ఈ విధులకు వినియోగించుకున్నప్పటికీ, నిర్ణీత వ్యవధిలో సమాచార నిక్షిప్తం కష్టసాధ్యమని భావించింది. ఈ క్రమంలో ప్రైవేటు ఆపరేటర్లను భారీగా వినియోగించింది. ఒక్కో కుటుంబం సమాచారాన్ని ఎంట్రీ చేసేందుకు ఐదు రూపాయలు ఇచ్చింది. అయినప్పటికీ కావాల్సినంతమంది ఆపరేటర్లు దొరకకపోవడంతో దీన్ని రూ.8, ఆ తర్వాత పది రూపాయలకు పెంచింది. దీంతో ఆపరేటర్లు ఇబ్బడిముబ్బడిగా సమకూరారు. ఈ నేపథ్యంలోనే డేటా ఎంట్రీ పనులు వేగాన్ని అందుకున్నాయి. గత నెల 19వ తేదీన జిల్లావ్యాప్తంగా(జీహెచ్ఎంసీ పరిధి మినహా) 8.41 లక్షల కుటుంబాల సర్వే వివరాలు నమోదు చేయగా, దీంట్లో ఇప్పటివరకు 3.40లక్షల కుటుంబాల సమాచారం కంప్యూటరీకరణకు నోచుకుంది. ఈ నెల 10వ తేదీ నాటికీ సర్వే సమాచారాన్ని కంప్యూటర్లలో పొందుపరచాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ ప్రాంతాల్లో వడివడిగా.... పట్టణ ప్రాంతాల్లో కంప్యూటరీకరణ వడివడి గా సాగుతున్నా.. గ్రామీణ మండలాల్లో మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో డేటా ఎంట్రీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. అతి తక్కువ శాతం కుల్కచర్ల మండలంలో ఆదివారం వరకు 9.53% మాత్రమే సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. అలాగే బషీరాబాద్ 10.49%, గండేడ్ 10.88%, తాండూరు నగర పంచాయతీలో 11%, పెద్దేముల్లో 11.18%, వికారాబాద్ 11.89%, యాలాల 15.62%, మర్పల్లిలో 16 శాతం మాత్రమే డేటా ఎంట్రీ పూర్తయింది. నగర శివార్లలో మేడ్చల్, హయత్‌నగర్ మండలాల్లో ఇప్పటికే కంప్యూటరీకరణ ప్రక్రియ ముగిసింది. సరూర్‌నగర్ 92.49%, ఇబ్రహీంపట్నం 78.1%, శామీర్‌పేట 72.7%, మంచాల 72.25 శాతం పూర్తికాగా, మిగిలిన మండలాల్లో సగం కుటుంబాల సమాచారాన్ని ఇప్పటివరకు కంప్యూటరీకరించారు. -
ఫోన్ చేస్తారు..సమాచారం సేకరిస్తారు
సాక్షి, మంచిర్యాల :తెలంగాణ రాష్ట్ర సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైన నేపథ్యంలో తదుపరి దశల్లోనూ సర్కారు అదే స్పష్టతతో ముందుకెళ్తోంది. ఒక్కరోజే సర్వే చేయడం ద్వారా అక్రమాలకు తావు లేని విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా సర్వే ఫారాల క ంప్యూటరీకరణకు ముందు సైతం వివరాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా స్టార్ మార్కుతో ఉన్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు ఓ అధికారి వివరించారు. నోడల్ అధికారులుగా సర్వే బాధ్యతలు నిర్వర్తించిన తహశీల్దార్లు, ఎంపీడీవోలు, అగ్రికల్చర్ అధికారులు, ఎంఈవోలపై ఈ గురుతర బాధ్యత పెట ్టనున్నట్లు సమాచారం. ఈ నోడల్ అధికారులు సర్వే నమూనాలో నింపకుండా వదిలివేసిన వివరాలను లబ్ధిదారులు ఇచ్చిన ఫోన్ నంబరు ఆధారంగా సేకరించనున్నారు. స్టార్.. స్టార్.. గ్యాస్ కనెక్షన్, విద్యుత్ మీటరు కనెక్షన్ నంబరు వంటి ‘స్టార్’ గుర్తు గల విషయాలను ప్రాధాన్య అంశాలుగా తీసుకోనున్నారు. స్టార్ గుర్తున్న వివరాలు పూర్తి చేయని పక్షంలో సర్వే ఫామ్‌లో పేర్కొన్న సెల్‌ఫోన్‌కు కాల్ చేసి వాటిని తెలుసుకొని పెన్సిల్ ద్వారా పూర్తి చేయనున్నారు. ఈ విధంగా సర్వే జరిగిన అన్ని కుటుంబాల వివరాల విషయమై నోడల్ అధికారి పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఫామ్‌లోని అన్ని వివరాలు సమగ్రంగా ఉంటేనే ఆ కుటుంబ వివరాలను అప్డేట్ చేసేలా సాఫ్ట్వేర్ రూపకల్పన చేశారు. ఈ వివరాలను కంప్యూటరీకరణ చేసిన తర్వాత సైతం థర్డ్‌పార్టీ తనిఖీ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జిల్లాస్థాయి అధికారి ఒకరు వివరించారు. ఈ క్రమంలోనే సర్వే ఫామ్‌లోని వివరాలను క్షేత్రస్థాయి తనిఖీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో ఫామ్‌ల కంప్యూటరీకరణ ప్రక్రియను సైతం పరిశీలించే అవకాశాలున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. -
నేటినుంచి సర్వే వివరాల కంప్యూటరీకరణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా నమోదు చేసిన వివరాలను శుక్రవారం నుంచి కంప్యూటరీకరిస్తామని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. ఇందుకు ఎంపిక చేసిన ఇంజనీరింగ్ కళాశాలల్లో డాటా ఎంట్రీ ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గురువారం ఆర్డీఓలు, మండల తహసీల్దార్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డాటా ఎంట్రీ కేంద్రాల్లో విద్యుత్తు సమస్య ఉంటే ప్రత్యామ్నాయంగా జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు ఈ బాధ్యతలు తీసుకోవాలని, పదిరోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. అనంతరం రుణమాఫీపై సమీక్షిస్తూ ఈనెల 23లోగా శాఖలవారీగా లబ్ధిదారుల వివరాలు ఖరారు చేయాలన్నారు. 26 నుంచి మండలస్థాయి బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి 27,28 తేదీల్లో గ్రామపంచాయతీల్లో రుణమాఫీ లబ్ధిదారుల వివరాలు ప్రదర్శించాలన్నారు. అభ్యంతరాలుంటే వాటిని సరిచేసి 28న తుదిజాబితాను రూపొందించి 30న నిర్వహించే జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆమోదించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూపంపిణీలో భాగంగా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన లబ్ధిదారులకు వారంలోగా భూములను చూపించాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించిన వారందరికీ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ ఎంవీరెడ్డి, డీఆర్వో సూర్యారావు, జేడీఏ విజయ్‌కుమార్, జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.