సాక్షి, రంగారెడ్డి జిల్లా: సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా నమోదు చేసిన వివరాలను శుక్రవారం నుంచి కంప్యూటరీకరిస్తామని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. ఇందుకు ఎంపిక చేసిన ఇంజనీరింగ్ కళాశాలల్లో డాటా ఎంట్రీ ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గురువారం ఆర్డీఓలు, మండల తహసీల్దార్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డాటా ఎంట్రీ కేంద్రాల్లో విద్యుత్తు సమస్య ఉంటే ప్రత్యామ్నాయంగా జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు ఈ బాధ్యతలు తీసుకోవాలని, పదిరోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. అనంతరం రుణమాఫీపై సమీక్షిస్తూ ఈనెల 23లోగా శాఖలవారీగా లబ్ధిదారుల వివరాలు ఖరారు చేయాలన్నారు. 26 నుంచి మండలస్థాయి బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి 27,28 తేదీల్లో గ్రామపంచాయతీల్లో రుణమాఫీ లబ్ధిదారుల వివరాలు ప్రదర్శించాలన్నారు. అభ్యంతరాలుంటే వాటిని సరిచేసి 28న తుదిజాబితాను రూపొందించి 30న నిర్వహించే జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆమోదించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భూపంపిణీలో భాగంగా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన లబ్ధిదారులకు వారంలోగా భూములను చూపించాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించిన వారందరికీ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ ఎంవీరెడ్డి, డీఆర్వో సూర్యారావు, జేడీఏ విజయ్‌కుమార్, జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి సర్వే వివరాల కంప్యూటరీకరణ
Published Fri, Aug 22 2014 12:12 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement