n.sridhar
-
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కొత్త స్కీమ్
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో పదవీ విరమణ చేసిన కార్మికులతోపాటు వాళ్ల జీవిత భాగస్వామికి రూ.5 లక్షల విలువైన వైద్య సేవలందించే కాంట్రిబ్యూటరీ పోస్టు రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్‌ను సింగరేణి యాజమాన్యం ఆమోదించింది. శుక్రవారం సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పథకానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని సంస్థ యాజమాన్యం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సలహాదారుడు డీఎన్ ప్రసాద్, డెరైక్టర్ ఎస్డీ అషఫ్, ర వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ సీఎండీ ఆర్ఆర్ మిశ్రా, సింగరేణి డెరైక్టర్లు బి.రమేశ్ కుమార్, ఎ.మనోహర్ రావు, జె.పవిత్రన్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
సింగరేణికి బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డ్
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు సింగరేణి సంస్థకు దక్కింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా సీఎండీ ఎన్.శ్రీధర్ అవార్డు అందుకున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 60.04 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 15 శాతం వృద్ధిరేటుతో జాతీయ బొగ్గు రంగ పరిశ్రమలకే తలమానికంగా నిలిచింది. అలాగే బొగ్గు రవాణాలోనూ అగ్రస్థానంలో నిలిచి పాత రికార్డులను తిరగరాసింది. కార్మికులకు సంక్షేమ కార్యక్రమాల అమలు, పారిశ్రామిక సంబంధాల విషయంలో సీఎండీ చూపిన చొరవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ.. సింగరేణీయులు అందించిన సహకారం వల్లే సంస్థ అభివృద్ధి సాధించగలిగిందని ప్రశంసించారు. కార్మిక సంఘాల సహకారంతో సమ్మెలు లేని సంస్థగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
పవర్ ప్రాజెక్ట్ పరిశీలించిన సింగరేణి చైర్మన్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో సిగరేణి సంస్థ కొత్తగా నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్ట్ పనులను ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఉద్యోగులకు సూచించారు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది అధికారులు పాల్గొన్నారు. -
సింగరేణి సిగలో ‘బయ్యారం’
ఐరన్ ఓర్ వెలికితీతకు శ్రీకారం 2014-15లో 100 % బొగ్గు ఉత్పత్తి రూ.14083 కోట్ల ఆదాయం సెప్టెంబర్‌లోగా 5512 పోస్టులు భర్తీ సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. బొగ్గు గనుల తవ్వకాల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సింగరేణి త్వరలో ఐరన్ ఓర్ అన్వేషణ రంగంలో ప్రవేశించనుంది. ఇప్పటివరకు తెలంగాణ భూభాగంలోనే గనుల తవ్వకాలు జరిపిన సంస్థ సమీప భవిష్యత్తులో తన కార్యకలాపాలను దేశ విదేశాలకు విస్తరింపజేయనుంది. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన పురోగతితోపాటు భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఖమ్మం జిల్లా బయ్యారంలో ఐరన్ ఓర్ నిక్షేపాల అన్వేషణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బయ్యారంలో నిక్షిప్తమై ఉన్న ఐరన్‌ఓర్ పరిమాణం, నాణ్యతపై 45 రోజుల్లో ప్రాథమిక అధ్యయనం జరపనున్నామని చెప్పారు. ఒడిషాలోని టాల్చేర్ వద్ద గల నైనీ బొగ్గుగనులను చేజిక్కించుకున్నామని, ఉత్కల్లోని బొగ్గు గను ల వేలంలో సైతం పాల్గొంటున్నామన్నారు. దక్షిణాఫ్రికా, ఇతర ఆఫ్రికా దేశాలు, ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాల్లో బొగ్గు గనుల తవ్వకాలకు ఆసక్తిని ప్రదర్శిస్తూ ఈ నెల రెండోవారంలో గ్లోబల్ ప్రకటనను జారీ చేస్తామన్నారు. రాష్ట్రం లో సంస్థ 48 బ్లాకుల్లో బొగ్గు తవ్వకాలు జరుపుతుండగా.. మరో 14 కొత్త బ్లాకుల్లో తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఎన్నడూలేని విధంగా 2014-15లో సింగరేణి మంచి ఫలి తాలు సాధించిందని శ్రీధర్ పేర్కొన్నారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు 100 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని, గతేడాది బొగ్గు ఉత్పత్తిని 52 మిలి యన్ టన్నులకు పెంచామని, రానున్న నాలుగేళ్లలో 80 ఎం.టి.లకు తీసుకెళ్తామన్నారు. సింగరేణికి గోల్డెన్ పీకాక్ పురస్కారం.. గనుల తవ్వకాల్లో బయటపడిన మట్టితో నిర్మా ణ రంగ వస్తువులను తయారు చేసినందుకు సింగరేణిని గోల్డెన్ పీకాక్ ఎన్నోవేటివ్ ప్రాడక్ట్/సర్వీసు అవార్డు వరించింది. ఈ నెల 20న దుబాయ్‌లో యూఏఈ మంత్రి ముబారక్ల్ దీనిని ప్రదానం చేయనున్నారని తెలిపారు. సెప్టెంబర్‌లోగా 5 వేల ఉద్యోగాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా సంస్థలో 5512 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. అందులో 2744 పోస్టులను సంస్థ ఉద్యోగుల సంబంధీకులకు, 539 పోస్టులను పదోన్నతుల ద్వారా, 2229 పోస్టులను బయటి వ్యక్తులకు కేటాయించామన్నారు. ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి పలికామని, రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుపుతామన్నారు. కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో సంస్థ ఆధ్వర్యంలో వైద్య కళాశాల ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. -
ప్రతి ఇంటికీ రెండు బ్యాంకు ఖాతాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రతి ఇంట్లో భర్తతోపాటు భార్యకూ బ్యాంకు ఖాతా ఉండేలా కేంద్రప్రభుత్వం జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ ఎన్.శ్రీధర్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్బీహెచ్లో జన్‌ధన్ యోజన ఖాతాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద, బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. ఎలాంటి ప్రీమియం లేకుండా ఖాతాదారులకు రూ. లక్ష బీమాతో కూడిన జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరవడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్లోని ఎస్బీహెచ్ బ్రాంచ్‌లో 300 ఖాతాల లక్ష్యం త్వరలో పూర్తి కానున్నట్లు చెప్పారు. ఖాతాలు తెరిచిన వారికి కలెక్టర్ పాసుపుస్తకాలు అందజేశారు. -
నేటినుంచి సర్వే వివరాల కంప్యూటరీకరణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా నమోదు చేసిన వివరాలను శుక్రవారం నుంచి కంప్యూటరీకరిస్తామని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. ఇందుకు ఎంపిక చేసిన ఇంజనీరింగ్ కళాశాలల్లో డాటా ఎంట్రీ ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గురువారం ఆర్డీఓలు, మండల తహసీల్దార్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డాటా ఎంట్రీ కేంద్రాల్లో విద్యుత్తు సమస్య ఉంటే ప్రత్యామ్నాయంగా జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు ఈ బాధ్యతలు తీసుకోవాలని, పదిరోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. అనంతరం రుణమాఫీపై సమీక్షిస్తూ ఈనెల 23లోగా శాఖలవారీగా లబ్ధిదారుల వివరాలు ఖరారు చేయాలన్నారు. 26 నుంచి మండలస్థాయి బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి 27,28 తేదీల్లో గ్రామపంచాయతీల్లో రుణమాఫీ లబ్ధిదారుల వివరాలు ప్రదర్శించాలన్నారు. అభ్యంతరాలుంటే వాటిని సరిచేసి 28న తుదిజాబితాను రూపొందించి 30న నిర్వహించే జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆమోదించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూపంపిణీలో భాగంగా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన లబ్ధిదారులకు వారంలోగా భూములను చూపించాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించిన వారందరికీ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ ఎంవీరెడ్డి, డీఆర్వో సూర్యారావు, జేడీఏ విజయ్‌కుమార్, జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
వచ్చేనెల తొలివారంలోగా రుణమాఫీ కలెక్టర్ శ్రీధర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రైతుల రుణమాఫీకి సంబంధించి సెప్టెంబర్ మొదటి వారంలోగా లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖలు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, ఆ ఉత్తర్వుల ప్రకారం అర్హులను తేల్చాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 33 బ్యాంకులకు చెందిన 627 శాఖల ద్వారా రైతులు రుణాలు పొందినట్లు ప్రాథమిక సమాచారముందన్నారు. ఈమేరకు పరిశీలనచేసి అర్హులను గుర్తించాలన్నారు. తహసీల్దార్లు వారి మండలాల్లో భూములను పరిశీలించి రుణం తీసుకున్నట్లు నిర్ధారణచేసిన తర్వాతే అర్హుల జాబితా ఖరారు చేయాలన్నారు. అదేవిధంగా ఈనెల 31తో ఖరీఫ్ ముగుస్తున్నందున కొత్తరుణాలు విడుదల చేయాలన్నారు. సమావేశంలో ఎల్డీఎం వెంకట్‌రెడ్డి, జేడీఏ విజయ్‌కుమార్, ఉద్యానశాఖ ఏడీ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
నిర్భయంగా వివరాలివ్వండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఈనెల 19న చేపట్టే సమగ్ర కుటుంబ సర్వే కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకోసమే. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులుండవు. మీ వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని నిర్భయంగా ఎన్యూమరేటర్లకు చెప్పొచ్చు.’ అని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ స్ఫూర్తిభవన్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో దాదాపు 8 లక్షల ఇళ్లనుంచి వివరాలు సేకరిస్తామని, పట్టణ ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సర్వేపై ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ఉన్న వివరాలే చూపించండి సర్వేలో భాగంగా ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు మీ వద్ద అందుబాటులో ఉన్న వివరాలు మాత్రమే చూపించండి. 19న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినందున ప్రతిఒక్కరూ అందుబాటులో ఉంటే కచ్చితమైన వివరాలు వస్తాయి. హాస్టళ్లు, ఇతర అత్యవసర సేవలు పొందే వాళ్లు అందుబాటులో లేనప్పటికీ వారి పేర్లుకూడా సేకరిస్తాం. ఈ సర్వేలో రేషన్ కార్డుల ప్రస్తావనలేదు. ప్రతి ఎన్యూమరేటర్‌కు గుర్తింపు కార్డు, 30 సర్వేఫారాలు, చెక్‌లిస్ట్ ఇస్తాం. వివరాల సేకరణ పూర్తయిన తర్వాత ఆ ఇంటికి స్టిక్కర్ అతికిస్తారు. ఒకవేళ కుటుంబసభ్యులు అందుబాటులో లేకుంటే డోర్‌లాక్ స్టిక్కర్ అతికిస్తారు. ఏమైనా సందేహాలుంటే ఎన్యూమరేటర్ వద్ద ఉన్న హాండ్‌బుక్ ఆధారంగా వాటిని నివృత్తి చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాలు మాత్రమే రికార్డు చేస్తాం. అందుబాటులో వివరాలు లేకుంటే నిల్ అని రాస్తాం. ఆ మేరకు ప్రజలు సహకరించాలి. 28 వేల సిబ్బందితో.. సమగ్ర కుటుంబ సర్వేకోసం 28వేల మంది సిబ్బందిని నియమించాం. ప్రభుత్వ, ఎయిడెడ్ సంస్థలతోపాటు కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బందిని కూడా ఈ సర్వేలో ఉపయోగిస్తున్నాం. ఇప్పటికే సిబ్బందికి దాదాపు శిక్షణ పూర్తయింది. నేటినుంచి సెక్టోరియల్ అధికారులకు బాధ్యతలు ఇస్తాం. వీరు రేపట్నుంచి గ్రామాల్లో పర్యటించి ముందస్తుగా అంచనాకు వస్తారు. పంచాయతీ, మండలం, మున్సిపల్ వార్డులకు ప్రత్యేకంగా అధికారులను నియమించాం. సర్వే మెటీరియల్ అంతా ఈనెల 18న ప్రత్యేకాధికారులకు అందజేస్తాం. 19 ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ సర్వే కొనసాగుతుంది. అనంతరం 9గంటల కల్లా గ్రామ, మండల, జిల్లాస్థాయిలో వివరాలు క్రోడీకరించి నివేదిక తయారుచేస్తాం. సమగ్ర పర్యవేక్షణ.. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో స్పష్టత కోసమే ఈ సర్వే. ఇందులో భాగంగా సర్వే ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా చేస్తున్నాం. ఎన్యూమరేటర్లు చేసే సర్వే ప్రక్రియను వెనువెంటనే పరిశీలిస్తా. ప్రతిచోట ప్రత్యేకాధికారులు ర్యాండమ్‌గా 5నుంచి10 ఇళ్లు తనిఖీ చేస్తారు. వివరాల సేకరణలో ఎన్యూమరేటర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. గ్రామీణ ప్రాంతంలోచేసే సర్వేకు సంబంధించి ప్రశ్నావళిలో దాదాపు 90 రకాల అంశాలు ఉంటాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరిన్ని వివరాలు సేకరిస్తారు. రెండు వారాల్లో కంప్యూటరీకరణ ఈ నెల 20వ తేదీ నుంచి సర్వే వివరాలు కంప్యూటరీకరిస్తాం. ఇందుకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్లతోపాటు, ఇంజినీరింగ్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న కంప్యూటర్లను వినియోగించుకుంటున్నాం. దాదాపు 1500కంప్యూటర్లు అవసరమవుతాయి. ప్రతి ఫారాన్ని స్కాన్‌చేసి ఆ వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేస్తాం. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ 2వ తేదీ కల్లా పూర్తవుతుంది. -
సమగ్ర సర్వే అపోహలు, అనుమానాలు వద్దు:ఎన్.శ్రీధర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గత కొద్దిరోజులుగా ప్రతి ఇంట్లో చర్చకు వస్తున్న అంశం.. సమగ్ర సర్వే. ఈనెల 19న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సమగ్ర సర్వేపై ప్రజల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో సంక్షేమ పథకాల అమలులో కీలకం కానున్న ‘ఇంటింటి సర్వే’ గురించి జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ పలు విషయాలు వెల్లడించారు. రేషన్ కార్డుల ఏరివేత, గ్యాస్ కనెక్షన్ తొలగిస్తారనే ప్రచారం సరికాదని స్పష్టం చేశారు. సర్వేపై ప్రజల్లో నెలకొన్న పలు సందేహాలను నివృత్తి చేస్తూ ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... అర్హులకే ఫలాలు.. ఏ సంక్షేమ పథకం అమలుకైనా సమగ్ర ప్రణాళిక అవసరం. జనగణన, వివరాలు సరిగ్గా ఉంటేనే ప్రభుత్వ ఫలాలు ప్రజల దరికి చేరుతాయి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ప్రత్యేక గణాంకాల్లేవు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన జనగణన ప్రకారమే పథకాల అమలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ‘ఇంటింటి సర్వే’కు శ్రీకారం చుడుతోంది. సూక్ష్మంగా నిర్వహించే ఈ సర్వేతో ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వ దరికి చేరుతుంది. తద్వారా సంక్షేమ ఫలాలు అర్హులకే అందుతాయి. ఈ ఉద్దేశంతోనే సమగ్ర సర్వేకు సమాయత్తమవుతున్నాం. సపరివారం ఉండాల్సిందే.. 19వ తేదీన ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్ వస్తారు. ఆరోజు విధిగా కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉండాలి. ఎన్యూమరేటర్ అడిగిన ప్రశ్నావళికి సూటికి, క్లుప్తంగా సమాధానం ఇస్తే సరిపోతుంది. కుటుంబసభ్యుల హాజరు తప్పనిసరి. కేవలం హాస్టల్లో ఉండే పిల్లలు, అత్యవసర వైద్య సేవలు తీసుకునే సభ్యులు, సర్వే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఇతర దేశాల్లో నివసిస్తున్న కుటుంబసభ్యుల వివరాలు మాత్రం నమోదు చేయం. సేకరించిన డేటాను సర్వే రోజు సాయంత్రమే ఫ్రీజ్ చేస్తాం. ఈ సమాచారాన్ని సెప్టెంబర్ 3 నాటికి ఎంట్రీ చేస్తాం. ఏదో ఒకటి చూపాలి.. సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్‌కు కుటుంబసభ్యులు ధ్రువీకరణ చూపాలి. రేషన్ కార్డు, బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతా, ఎల్పీజీ, కరెంట్ బిల్లు, ఆధార్, వికలాంగులు ట్రై సైకిల్‌ను ధ్రువీకరణగా చూపాలి. వీటి ఆధారంగానే కుటుంబసభ్యుల వివరాలు సేకరించనున్నాం. కుటుంబాల విభజనకు మాత్రమే ‘వంట గదుల’ను ప్రామాణికంగా తీసుకుంటాం. ఒకే సమూహంలో పలు జంటలు జీవనం సాగిస్తున్నప్పటికీ, దానిని ఒక కుటుంబంగానే పరిగణిస్తాం. వివాహాలు జరిగి ఒకే ఇంట్లో వేర్వేరు కిచెన్లు ఉంటే మాత్రం దానికి అనుగుణంగా కుటుంబాలను నమోదు చేస్తాం. తాళం వేసి ఉన్న ఇంటి యజమాని వివరాలను మాత్రం పొరుగింటి వారి ద్వారా సేకరిస్తాం. మిగతా వివరాల జోలికి వెళ్లం. ఆస్తులూ నమోదు.. సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి పౌరుడికి సంబంధించిన సమగ్ర సమాచారం నమోదు చేయనున్నాం. ముఖ్యంగా రేషన్ కార్డు మొదలు ఆదాయపన్ను చెల్లింపు వరకు ప్రతి వివరాలను సేకరిస్తాం. భూములున్నాయా? వాహనాలు కలిగియున్నారా? బ్యాంక్ అకౌంట్ వంటి పలు అంశాలకు సంబంధించిన ప్రశ్నావళి ఉంటుంది. వీటన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కుటుంబసభ్యులదే. భవిష్యత్తులో ఈ వివరాల ఆధారంగానే పథకాలు అమలు కానున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ‘స్థానికత’ నిర్ధారించం.. ‘స్థానికత’ను నిర్దేశించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారనే ప్రచారం అవాస్తవం. ఇక్కడ నివసించే ప్రతిపౌరుడి సమాచారం సేకరించాలనేదే ప్రభుత్వం ఉద్దేశం. రేషన్‌కార్డులు ఏరివేస్తారనో, గ్యాస్ కనెక్షన్లను తొలగిస్తారనో అపోహలు సరికాదు. కుటుంబాల సమాచారం నమోదులో కచ్చితత్వం ఉండాలనేదే సర్కారు లక్ష్యం తప్ప ఎలాంటి దురుద్దేశం లేదు. రవాణా సేవలు.. సర్వే సిబ్బందిని నిర్దేశిత గ్రామాలు/వార్డులకు తరలించేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే జరుగుతుంది. ఈ సర్వే ఎన్యూమరేటర్లు మండల కేంద్రం నుంచి తరలివెళ్లేందుకు జిల్లావ్యాప్తంగా 548 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. వీటికి అదనంగా 165 మినీ బస్సులు, 261 జీపులను సమకూరుస్తున్నాం. -
‘సర్వే’యర్ల కొరత !
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇంటింటి సర్వే’ జిల్లా యంత్రాంగానికి కత్తిమీదసాములా మారింది. ఈ నెల 19న ఒకేరోజు సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టంచేసిన నేపథ్యంలో ఉద్యోగులను సమకూర్చుకోవడం అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. జిల్లాలో 13 లక్షల ఇళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు 54వేల మంది సిబ్బంది అవసరమని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు 30వేల మంది ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు వీరందరినీ పోలింగ్ విధులకు వినియోగించుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ సంఖ్యకంటే అదనంగా మరో 14వేల మంది అవసరం కానుండడంతో ఏంచేయాలో అధికారగణానికి పాలుపోవడంలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం సీఎం కేసీఆర్ ఆయా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ‘సమగ్ర సర్వే’ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను కలెక్టర్ ఎన్.శ్రీధర్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలో ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడం, సర్వేకు సరిపడా ఉద్యోగులు లేనందున.. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈనేపథ్యంలోనే ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో సర్వే విధానంపై విడిగా సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. పక్కాగా ‘స్థానికత’ సమగ్ర సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ‘ఫాస్ట్’ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసినందున.. స్థానికత ధ్రువీకరణ పత్రాల మంజూరులో అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేసినట్లు చెప్పారు. సేకరించిన సర్వే వివరాలను రెండు వారాల్లో కంప్యూటరీకరించాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. సమగ్ర సర్వేకు 54వేల మంది సిబ్బంది అవసరమని, ఆ మేరకు సమీకరించుకునేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా జిల్లాలో విరివిగా మొక్కలు నాటాలని సీఎం చెప్పారన్నారు. -
బ్లాక్‌లిస్టులో పెట్టేస్తాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పనులు సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని కలెక్టర్ ఎన్.శ్రీధర్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఆదర్శ పాఠశాలల నిర్మాణ పనులను సమీక్షించారు. అదేవిధంగా అదనపు తరగతిగదులు, కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలల నిర్మాణ పనుల తీరునూ పరిశీలించారు. పరిగి, షాబాద్ తదితర ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలల నిర్మాణ పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయని కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా సమస్యలుంటే మండల తహసీల్దార్, ఎంపీడీఓలను సంప్రదించి పరిష్కరించుకోవాలని, అలాకాకుండా పనులు నిలిపివేస్తే ఊరుకునేది లేదని అన్నారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈ పనులు పూర్తి చేయాలన్నారు. మొదటిసారి సమావేశం నిర్వహిస్తున్నందున హెచ్చరికలతో సరిపెడుతున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. వచ్చే నెలలో మరోమారు సమీక్షిస్తానని, పురోగతి లేకుంటే ఆ కాంట్రాక్టు రద్దు చేయడంతోపాటు కాంట్రాక్టరు పేరును బ్లాక్ లిస్టులో పెడతామని అన్నారు. సదరు కాంట్రాక్టరుకు ప్రభుత్వపరంగా ఎలాంటి పనులు మంజూరుకావని తేల్చి చెప్పారు. ఇటీవల మంజూరైన అదనపు తరగతి గదుల పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీఎం అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లకు వదిలేస్తే సరిపోదు.. సర్వశిక్షా అభియాన్ కింద చేపట్టిన కస్తూరా్భా గాంధీ బాలికల పాఠశాలల పనుల్లో తీవ్ర జాప్యం చేయడంపై కలెక్టర్ ఆగ్రహించారు. తొమ్మిది నెలల్లో చేపట్టాల్సిన పనులు ఏడాదిన్నర పూర్తయినా చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్ఎస్ఏ ఇంజినీర్లు ఈ పనులు ఎందుకు సమీక్షించడంలేదంటూ ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఇంజినీరింగ్ అధికారులు చోద్యం చూడకుండా పనులను క్రమం తప్పకుండా పరిశీలించాలన్నారు. ఇకపై ఇలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. నెలావారీగా లక్ష్యాలు నిర్దేశించి పనుల్లో పురోగతి సాధించాలన్నారు. కేజీబీవీలకు ప్రహరీలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి తెచ్చేందుకు ప్రణాళిక తయారు చేయాలన్నారు. సమావేశంలో డీఈఓ సోమిరెడ్డి, ఎస్ఎస్ఏ పీఓ కిషన్‌రావు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎస్ఈ మల్లేష్, ఈఈ నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మీపై ఎందుకు వేటు వేయకూడదు?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ ఎన్నికల్లో గీతదాటిన జెడ్పీటీసీ సభ్యులకు ఉచ్చు బిగుస్తోంది. పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి టీఆర్ఎస్కు ఓటేసిన ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సంజాయిషీ ఇవ్వాలని శనివారం జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ నోటీసులు జారీ చేశారు. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన ముంగి జ్యోతి (రాజేంద్రనగర్), కొంపల్లి యాదవరెడ్డి (నవాబ్‌పేట)ని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఆ పార్టీనేతలు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్టం-1994 రూల్ 22 కింద ‘మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని’ కలెక్టర్ శ్రీధర్ నోటీసులిచ్చారు. విప్ ఉల్లంఘించారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన ఆధారాలను కూడా నోటీసులతోపాటు జతపరిచారు. దీనిపై ఈనెల 25లోపు సమాధానమివ్వాలని గడువు విధించారు. ఇదిలావుండగా పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన ముంగి జ్యోతిని ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్టు టీపీసీసీ ప్రకటించింది. విప్‌ను ధిక్కరించిన మరో జెడ్పీటీసీ యాదవరెడ్డిపై మాత్రం వేటు వేయకపోవడం గమనార్హం. ప్రస్తుత ం ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆయనపై చర్య తీసుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం అచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక కుల్కచర్ల, ధారూర్, మోమిన్‌పేట, మర్పల్లి మండల పరిషత్ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించి ప్రత్యర్థి పార్టీలకు ఓటేసిన ఎంపీటీసీలపైనా చర్య తీసుకోవాలని ఆయా పార్టీల అధిష్టానాలు ప్రిసైడింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయాలను శిరసావహించకుండా ఇత ర పార్టీల్లోకి ఫిరాయించిన సభ్యులు వారం రోజుల్లో సమాధానమివ్వాలని అధికారులు తాఖీదులు పంపారు. -
మళ్లీ వస్తా.. పనులు చూస్తా..
మోమిన్‌పేట: ఇంటింటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించాలి.. దీనికోసం ఎంత డబ్బు అవసరమవుతుందో చెప్పండి.. నిధులు విడుదల చేస్తాం.. కానీ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పాలని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) ఏఈని కలెక్టర్ ఎన్.శ్రీధర్ ప్రశ్నించారు. నెలరోజుల్లో పూర్తి చేస్తామని ఏఈ సమాధానమివ్వడంతో.. మళ్లీ వస్తానని.. పనులను చూస్తానని కలెక్టర్ అన్నారు. సోమవారం మండలంలోని వెల్చాల్ గ్రామంలో నిర్వహించిన ‘మన ఊరు- మన గ్రామం’ గ్రామసభలో అధికారులతో శాఖలవారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటి కీ కుళాయి ద్వారా తాగునీటిని అందించేందుకు అదనంగా రూ.2 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. చెత్తను సేకరించి గ్రామం బయట వేసేందుకు డంపింగ్‌యార్డును గుర్తించాలని తహసీల్దార్ రవీందర్‌ను ఆయన ఆదేశించారు. ప్రతీ కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ప్రభుత్వం అందుకు తగిన నిధులు ఇస్తుందన్నారు. ఉన్నత పాఠశాలకు ఐదు అదనపు తరగతి గదుల కోసం స్థలం, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రాధానోపాధ్యాయుడు ప్రభు కోరగా... మౌలిక వసతులు కల్పిస్తాం.. కానీ 10వ తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. నిరుద్యోగ యువకులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణనిప్పించి ఉద్యోగావకాశాలు కల్పించాలని ఐకేపీ ఏపీఎం రాజును కలెక్టర్ ఆదేశించారు. మహిళా సంఘాలు బ్యాంకులో తీసుకొంటున్న రుణాలతో యూనిట్లు పెట్టుకొవాలని ఆయన సూచించారు. గ్రామంలోని గర్భిణులు ఆస్పత్రుల్లోనే కాన్పులు చేసుకునేలా ఏఎన్ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, ఎంపీపీ నిఖిత, వైస్ ఎంపీపీ అమరేందర్‌రెడ్డి, సబ్ కలెక్టరు ఆమ్రపాలి, మండల ప్రత్యేకాధికారి రమణారెడ్డి, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు బిపాషా, ఎంపీడీఓ కె.సువిధ, వ్యసాయాధికారి నీరజ, డిప్యూటీ తహసీల్దార్ దీపక్, ఏపీఓ అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లయ్య, మాజీ సర్పంచులు విఠల్, ఇబ్రహీం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.