సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గత కొద్దిరోజులుగా ప్రతి ఇంట్లో చర్చకు వస్తున్న అంశం.. సమగ్ర సర్వే. ఈనెల 19న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సమగ్ర సర్వేపై ప్రజల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో సంక్షేమ పథకాల అమలులో కీలకం కానున్న ‘ఇంటింటి సర్వే’ గురించి జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ పలు విషయాలు వెల్లడించారు. రేషన్ కార్డుల ఏరివేత, గ్యాస్ కనెక్షన్ తొలగిస్తారనే ప్రచారం సరికాదని స్పష్టం చేశారు. సర్వేపై ప్రజల్లో నెలకొన్న పలు సందేహాలను నివృత్తి చేస్తూ ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే... అర్హులకే ఫలాలు..
ఏ సంక్షేమ పథకం అమలుకైనా సమగ్ర ప్రణాళిక అవసరం. జనగణన, వివరాలు సరిగ్గా ఉంటేనే ప్రభుత్వ ఫలాలు ప్రజల దరికి చేరుతాయి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ప్రత్యేక గణాంకాల్లేవు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన జనగణన ప్రకారమే పథకాల అమలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ‘ఇంటింటి సర్వే’కు శ్రీకారం చుడుతోంది. సూక్ష్మంగా నిర్వహించే ఈ సర్వేతో ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వ దరికి చేరుతుంది. తద్వారా సంక్షేమ ఫలాలు అర్హులకే అందుతాయి. ఈ ఉద్దేశంతోనే సమగ్ర సర్వేకు సమాయత్తమవుతున్నాం.
సపరివారం ఉండాల్సిందే..
19వ తేదీన ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్ వస్తారు. ఆరోజు విధిగా కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉండాలి. ఎన్యూమరేటర్ అడిగిన ప్రశ్నావళికి సూటికి, క్లుప్తంగా సమాధానం ఇస్తే సరిపోతుంది. కుటుంబసభ్యుల హాజరు తప్పనిసరి. కేవలం హాస్టల్‌లో ఉండే పిల్లలు, అత్యవసర వైద్య సేవలు తీసుకునే సభ్యులు, సర్వే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఇతర దేశాల్లో నివసిస్తున్న కుటుంబసభ్యుల వివరాలు మాత్రం నమోదు చేయం. సేకరించిన డేటాను సర్వే రోజు సాయంత్రమే ఫ్రీజ్ చేస్తాం. ఈ సమాచారాన్ని సెప్టెంబర్ 3 నాటికి ఎంట్రీ చేస్తాం.
ఏదో ఒకటి చూపాలి..
సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్‌కు కుటుంబసభ్యులు ధ్రువీకరణ చూపాలి. రేషన్ కార్డు, బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతా, ఎల్‌పీజీ, కరెంట్ బిల్లు, ఆధార్, వికలాంగులు ట్రై సైకిల్‌ను ధ్రువీకరణగా చూపాలి. వీటి ఆధారంగానే కుటుంబసభ్యుల వివరాలు సేకరించనున్నాం. కుటుంబాల విభజనకు మాత్రమే ‘వంట గదుల’ను ప్రామాణికంగా తీసుకుంటాం. ఒకే సమూహంలో పలు జంటలు జీవనం సాగిస్తున్నప్పటికీ, దానిని ఒక కుటుంబంగానే పరిగణిస్తాం. వివాహాలు జరిగి ఒకే ఇంట్లో వేర్వేరు కిచెన్‌లు ఉంటే మాత్రం దానికి అనుగుణంగా కుటుంబాలను నమోదు చేస్తాం. తాళం వేసి ఉన్న ఇంటి యజమాని వివరాలను మాత్రం పొరుగింటి వారి ద్వారా సేకరిస్తాం. మిగతా వివరాల జోలికి వెళ్లం.
ఆస్తులూ నమోదు..
సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి పౌరుడికి సంబంధించిన సమగ్ర సమాచారం నమోదు చేయనున్నాం. ముఖ్యంగా రేషన్ కార్డు మొదలు ఆదాయపన్ను చెల్లింపు వరకు ప్రతి వివరాలను సేకరిస్తాం. భూములున్నాయా? వాహనాలు కలిగియున్నారా? బ్యాంక్ అకౌంట్ వంటి పలు అంశాలకు సంబంధించిన ప్రశ్నావళి ఉంటుంది. వీటన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కుటుంబసభ్యులదే. భవిష్యత్తులో ఈ వివరాల ఆధారంగానే పథకాలు అమలు కానున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
‘స్థానికత’ నిర్ధారించం..
‘స్థానికత’ను నిర్దేశించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారనే ప్రచారం అవాస్తవం. ఇక్కడ నివసించే ప్రతిపౌరుడి సమాచారం సేకరించాలనేదే ప్రభుత్వం ఉద్దేశం. రేషన్‌కార్డులు ఏరివేస్తారనో, గ్యాస్ కనెక్షన్లను తొలగిస్తారనో అపోహలు సరికాదు. కుటుంబాల సమాచారం నమోదులో కచ్చితత్వం ఉండాలనేదే సర్కారు లక్ష్యం తప్ప ఎలాంటి దురుద్దేశం లేదు.
రవాణా సేవలు..
సర్వే సిబ్బందిని నిర్దేశిత గ్రామాలు/వార్డులకు తరలించేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే జరుగుతుంది. ఈ సర్వే ఎన్యూమరేటర్లు మండల కేంద్రం నుంచి తరలివెళ్లేందుకు జిల్లావ్యాప్తంగా 548 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. వీటికి అదనంగా 165 మినీ బస్సులు, 261 జీపులను సమకూరుస్తున్నాం.
సమగ్ర సర్వే అపోహలు, అనుమానాలు వద్దు:ఎన్.శ్రీధర్
Published Tue, Aug 12 2014 12:03 AM | Last Updated on Thu, May 24 2018 12:31 PM
Advertisement
Advertisement