సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఈనెల 19న చేపట్టే సమగ్ర కుటుంబ సర్వే కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకోసమే. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులుండవు. మీ వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని నిర్భయంగా ఎన్యూమరేటర్లకు చెప్పొచ్చు.’ అని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ స్ఫూర్తిభవన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో దాదాపు 8 లక్షల ఇళ్లనుంచి వివరాలు సేకరిస్తామని, పట్టణ ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సర్వేపై ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు.
ఉన్న వివరాలే చూపించండి సర్వేలో భాగంగా ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు మీ వద్ద అందుబాటులో ఉన్న వివరాలు మాత్రమే చూపించండి. 19న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినందున ప్రతిఒక్కరూ అందుబాటులో ఉంటే కచ్చితమైన వివరాలు వస్తాయి. హాస్టళ్లు, ఇతర అత్యవసర సేవలు పొందే వాళ్లు అందుబాటులో లేనప్పటికీ వారి పేర్లుకూడా సేకరిస్తాం. ఈ సర్వేలో రేషన్ కార్డుల ప్రస్తావనలేదు. ప్రతి ఎన్యూమరేటర్‌కు గుర్తింపు కార్డు, 30 సర్వేఫారాలు, చెక్‌లిస్ట్ ఇస్తాం.
వివరాల సేకరణ పూర్తయిన తర్వాత ఆ ఇంటికి స్టిక్కర్ అతికిస్తారు. ఒకవేళ కుటుంబసభ్యులు అందుబాటులో లేకుంటే డోర్‌లాక్ స్టిక్కర్ అతికిస్తారు. ఏమైనా సందేహాలుంటే ఎన్యూమరేటర్ వద్ద ఉన్న హాండ్‌బుక్ ఆధారంగా వాటిని నివృత్తి చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాలు మాత్రమే రికార్డు చేస్తాం. అందుబాటులో వివరాలు లేకుంటే నిల్ అని రాస్తాం. ఆ మేరకు ప్రజలు సహకరించాలి.
28 వేల సిబ్బందితో..
సమగ్ర కుటుంబ సర్వేకోసం 28వేల మంది సిబ్బందిని నియమించాం. ప్రభుత్వ, ఎయిడెడ్ సంస్థలతోపాటు కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బందిని కూడా ఈ సర్వేలో ఉపయోగిస్తున్నాం. ఇప్పటికే సిబ్బందికి దాదాపు శిక్షణ పూర్తయింది. నేటినుంచి సెక్టోరియల్ అధికారులకు బాధ్యతలు ఇస్తాం. వీరు రేపట్నుంచి గ్రామాల్లో పర్యటించి ముందస్తుగా అంచనాకు వస్తారు. పంచాయతీ, మండలం, మున్సిపల్ వార్డులకు ప్రత్యేకంగా అధికారులను నియమించాం. సర్వే మెటీరియల్ అంతా ఈనెల 18న ప్రత్యేకాధికారులకు అందజేస్తాం. 19 ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ సర్వే కొనసాగుతుంది. అనంతరం 9గంటల కల్లా గ్రామ, మండల, జిల్లాస్థాయిలో వివరాలు క్రోడీకరించి నివేదిక తయారుచేస్తాం.
సమగ్ర పర్యవేక్షణ..
ప్రభుత్వ పథకాల రూపకల్పనలో స్పష్టత కోసమే ఈ సర్వే. ఇందులో భాగంగా సర్వే ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా చేస్తున్నాం. ఎన్యూమరేటర్లు చేసే సర్వే ప్రక్రియను వెనువెంటనే పరిశీలిస్తా. ప్రతిచోట ప్రత్యేకాధికారులు ర్యాండమ్‌గా 5నుంచి10 ఇళ్లు తనిఖీ చేస్తారు. వివరాల సేకరణలో ఎన్యూమరేటర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. గ్రామీణ ప్రాంతంలోచేసే సర్వేకు సంబంధించి ప్రశ్నావళిలో దాదాపు 90 రకాల అంశాలు ఉంటాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరిన్ని వివరాలు సేకరిస్తారు.
రెండు వారాల్లో కంప్యూటరీకరణ
ఈ నెల 20వ తేదీ నుంచి సర్వే వివరాలు కంప్యూటరీకరిస్తాం. ఇందుకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్లతోపాటు, ఇంజినీరింగ్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న కంప్యూటర్లను వినియోగించుకుంటున్నాం. దాదాపు 1500కంప్యూటర్లు అవసరమవుతాయి.
ప్రతి ఫారాన్ని స్కాన్‌చేసి ఆ వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేస్తాం. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ 2వ తేదీ కల్లా పూర్తవుతుంది.
నిర్భయంగా వివరాలివ్వండి
Published Thu, Aug 14 2014 11:47 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement