సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం సర్వే ప్రారంభం కానుండగా.. అధికారులు మాత్రం సోమవారం రాత్రి నుంచే పల్లెలకు చేరుకున్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతమంతా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండడంతో, కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే జిల్లా యంత్రాంగం సర్వే చేపట్టనుంది.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 8.10 లక్షల కుటుంబాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 25లక్షల జనాభా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సర్వే నిర్వహణకు జిల్లా యంత్రాంగం 28 వేల మంది ఎన్యూమరేటర్లను నియమించింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే ప్రక్రియ కొనసాగనుంది.
పక్కాగా.. పకడ్బందీగా
సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియను పక్కా సమాచారంతో పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామీణ ప్రాంతాన్ని 380 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టారుకు ప్రత్యేకాధికారిని నియమించింది. ప్రతి పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని ఏర్పాటు చేసింది. మొత్తం 8.10 లక్షల కుటుంబాలకు గాను 8.30 లక్షల సర్వే పత్రాలను ముద్రించి మండల కేంద్రాలకు తరలించింది. కుటుంబ సభ్యులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, వారి ధ్రువీకరణ ప్రతాలను చూసిన తర్వాతే వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితులు, హాస్టళ్లలో చదివేవారు మాత్రం అందుబాటులో లేనప్పటికీ ధ్రువీకరణతో నమోదు చేసుకోనున్నారు.
ఉదయం 6గంటల నుంచే..
సర్వే ప్రక్రియలో భాగస్వాములయ్యే సిబ్బంది మంగళవారం ఉదయం 6గంటలకే మండల కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడికి చేరుకున్న ఉద్యోగులు అల్పాహారం పూర్తి చేసుకుని సర్వే మెటీరియల్‌ను తీసుకుని ఏడు గంటలకు బయలుదేరుతారు. వీరిని గ్రామాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం 1,300 బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ఉదయం 8గంటలకు వివరాల సేకరణ మొదలు పెట్టిన ఉద్యోగులు.. వారికి నిర్దేశించిన కుటుంబాల నుంచి సాయంత్రం 6గంటల లోపు వివరాలు సేకరించాలి. అనంతరం వాటిని క్లోజ్ చేస్తూ సమాచారాన్ని ప్రత్యేకాధికారికి అందించాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ అంతా రాత్రి ఎనిమిది గంటలలోపు పూర్తి చేయాలి. అలా వచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా స్థాయిలో సర్వే చేసిన సంఖ్యపై రాత్రి 9గంటలకు స్పష్టత వస్తుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా సర్వే ప్రక్రియకు సహకరించాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు.
నేడే ‘సర్వే’
Published Mon, Aug 18 2014 11:46 PM | Last Updated on Tue, Aug 21 2018 12:21 PM
Advertisement