సాక్షి, ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వేకు అంతా సిద్ధమైంది. జిల్లా అధికారులు ఈ సర్వేకు సంబంధించి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 8.75 లక్షల కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేయనున్నారు. దీనికి 32,204 మంది సిబ్బందిని నియమించారు. ప్రభుత్వం అధికారికంగా సర్వే చేపడుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్, విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా ఆరోజు సెలవు ప్రకటించాయి.
జిల్లావ్యాప్తంగా సర్వే చేయనున్న కుటుంబాలను యంత్రాంగం అధికారికంగా గుర్తించింది. మొత్తంమీద 8,75,970 కుటుంబాలను సర్వే చేయనున్నారు. ఈ సర్వేకు సంబంధించి జిల్లాలో 758 గ్రామ పంచాయతీల పరిధిలో 778 మంది సూపర్‌వైజర్లు, 238 మంది జోనల్ ఆఫీసర్లను నియమించారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ను వివరాలు నమోదు చేయడానికి ఏర్పాటు చేశారు.
ఉదయం నుంచి సర్వే అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రారంభం కానుంది. జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించబడిన, పోలవరం ముంపు మండలాలు చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, వేలేరుపాడు, కుక్కునూరు, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో పోలవరం ముంపులోకి వెళ్లిన గ్రామాల్లో కూడా సర్వే చేయడానికి సిబ్బంది వెళ్తున్నారు.
సర్వేకు వెళ్లే ఎన్యూమరేటర్లకు ఆయా మండల కేంద్రాల్లోనే సోమవారం సర్వే ఫామ్‌లు అందజేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో కుటుంబాల వారీగా ప్రభుత్వ స్టిక్కర్లు అంటించడంతో ఎన్ని కుటుంబాలున్నాయో అధికారికంగా తేలింది. వీటి ఆధారంగానే సర్వేను అధికారులు పకడ్బందీగా చేయించనున్నారు.
సర్వం బంద్...
సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సర్వే జరిగే రోజును ప్రభుత్వం అధికారిక సెలవుదినంగా ప్రకటించింది. కుటుంబాలుగాా నమోదైన వారు తప్పనిసరిగా సర్వే రోజు తమ కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లకు వివరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటే మంచిది.
ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలను ఆ కుటుంబ యజమాని ఇస్తే సరిపోతుంది. అలాగే ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న వారి వివరాలను కూడా కుటుంబ యజమాని చెప్పాల్సి ఉంటుంది. సర్వేకు ఉన్న ప్రాధాన్యతతో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పెట్రోల్‌బంక్‌లు, సినిమాహాల్స్, విద్యాసంస్థలు, బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఆరోజు మూతపడనున్నాయి.
అలాగే సింగరేణి కార్మికులకు కూడా యాజమాన్యం వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది. సర్వే రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి తమ వివరాలను నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన దృష్ట్యా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు.
జిల్లా యంత్రాంగం రెడీ..
సమగ్ర కుటుంబ సర్వే చేసేందుకు జిల్లా యంత్రాంగం రెడీ అయింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి ఈ సర్వేకు సంబంధించి అధికారులను సమాయత్తం చేశారు. సర్వే ఎంత పకడ్బందీగా నిర్వహించాల్సింది అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎన్యూమరేటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ఖమ్మం నగరానికి సంబంధించిన సర్వే బాధ్యతలను జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సర్వే ఎలా నిర్వహించాలనే దానిపై ఎన్యూమరేటర్లకు శిక్షణను ఇచ్చారు. అధికారికంగా ఎన్ని కుటుంబాలకు సర్వే నిర్వహించాలనే దానిపై కూడా అధికారులు ఒక అవగాహనకు రావడంతో ఆ మేరకు సర్వేకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జిల్లాలో అన్ని సంస్థలకూ రేపు సెలవు
Published Mon, Aug 18 2014 2:48 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement