కేసముద్రంలో వివరాలు సేకరిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే సిబ్బంది
రాష్ట్రంలో 90 శాతానికి పైగా పూర్తయిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే
సర్వే ప్రశ్నావళిలో కుటుంబ సభ్యులు, కులం వంటి సాధారణ సమాచారమే ఇస్తున్న ప్రజలు
ఆధార్, ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించని తీరు.. ఉద్యోగం, ఆదాయం, సంక్షేమ పథకాల లబ్ధిపైనా గోప్యతే!
ఈ అరకొర వివరాలతో సర్కారు ఎలా ముందుకు వెళ్తుందనే సందేహం
ఎన్యుమరేటర్లతో కలసి వెళ్లి ప్రజల స్పందనపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన
రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే తగిన ఫలితం ఇస్తుందా? దాని ఆధారంగా సర్కారు ముందుకు వెళుతుందా? ఆ వివరాలతో సంక్షేమ పథకాల అమలు కుదురుతుందా? అసలు ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందా?.. ఇలా ఎన్నో సందేహాలు ముసురుకుంటున్నాయి. సర్వేలో చాలా ప్రశ్నలకు అరకొర సమాచారమే వస్తుండటం.. ముఖ్యమైన ప్రశ్నలకు ప్రజలు ఎదురుప్రశ్నలు వేయడం.. పైగా ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం.. ఎన్యుమరేటర్లు చేసేదేమీ లేక ఆ వివరాల కాలమ్‌లను ఖాళీగా వదిలేస్తుండటంతో సర్వేకు ‘సమగ్రత’ చేకూరడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాల సేకరణే ప్రధానంగా చేపట్టిన ఈ సర్వేపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఎన్యుమరేటర్లతో కలసి వెళ్లి... సర్వేలో ప్రజల స్పందన ఎలా ఉందన్నది స్వయంగా పరిశీలించింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామంలోని ఏడవ వార్డులో ఎన్యుమరేటర్ శనివారం సర్వే నిర్వహించాడు. భద్రయ్య కుటుంబాన్ని సర్వే చేస్తుండగా.. బ్యాంకు ఖాతా, టీవీ, కూలర్ ఉన్నాయా అన్న ప్రశ్నలకు అతడు తడబడ్డాడు. జీరో బిల్లుకు ఏమైనా సమస్య వస్తుందా అనే సందేహంతో తడబడినట్లు తెలిపారు. అతనికి కొడుకు, కోడలు, మనుమరాళ్లు ఉండగా వారి వివరాలను తెలపడానికీ ససేమిరా అన్నాడు. తమ ఇల్లు ఇరుకుగా ఉందని, కొడుకుకు రేషన్ కార్డు ఉన్నందున సర్వేను వేరుగా రాస్తే వారికి ప్రభుత్వం నుంచి ఇల్లు, ఇతర పథకాలు వస్తాయని చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో ఓ వృద్ధురాలిని వివరాలు అడుగుతూ ఇల్లు ఉందా అని ప్రశ్నించగా, తనకు రేకుల ఇల్లు ఉందని మీరు రాసుకున్నంత మాత్రాన తనకు ఇల్లు వస్తదన్న నమ్మకం లేదని.. ఇంతకుముందు కూడా ఇలాగే రాసుకొని వెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో మెజారిటీ ప్రశ్నలకు ప్రజల నుంచి స్పందన రావడం లేదు. 75 ప్రశ్నలతో సర్వే ఫారాన్ని తయారు చేస్తే.. అందులో 40 వరకు ప్రశ్నలకు ప్రజల నుంచి వివరాలు అందడం లేదు. సాధారణంగా ఏదైనా సర్వే నిర్వహించేటపుడు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలి.
అప్పుడే ఆ సర్వే లక్ష్యం నెరవేరుతుంది. కానీ ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర ఇంటింటి సర్వేలో మెజారిటీ ప్రశ్నలకు, అందులోనూ కీలకమైన వాటికి ప్రజల నుంచి స్పందన లేకపోవడం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సమగ్ర సర్వే 90 శాతానికిపైగా పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. సర్వే ఫారాల కంప్యూటరీకరణ కూడా సాగుతోంది.
40 ప్రశ్నలకు అరకొర జవాబులు..
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు ఉన్నాయి. అందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు. మొత్తం ప్రశ్నావళి రెండు భాగాలుగా ఉంది. మొదటి విభాగం (పార్ట్–1)లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ వివరాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. రెండో విభాగం (పార్ట్–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతుల అంశాలు ఉన్నాయి.
రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, రేషన్ కార్డు, నివాస గృహానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో చాలా ప్రశ్నలకు ప్రజలు సమాచారం ఇవ్వడం లేదని ఎన్యుమరేటర్లు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త మెరుగ్గా ఉన్నా.. పట్టణ ప్రాంతాల్లో స్పందన అంతంతగానే ఉందంటున్నారు. 56 ప్రధాన ప్రశ్నల్లో సుమారు 40 ప్రశ్నలకు సరైన విధంగా జవాబులు రావడం లేదని పేర్కొంటున్నారు.
⇒ సర్వే ఫారం మొదటి విభాగంలో 1 నుంచి 10వ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు జనం ఎలాంటి ఇబ్బందిపడటం లేదు. ఇందులో కుటుంబ సభ్యుల పేర్లు, లింగం, మతం, సామాజికవర్గం, కులం, వయసు తదితర ప్రశ్నలున్నాయి. 11, 12వ ప్రశ్నలు ఆధార్, ఫోన్ నంబర్లకు సంబంధించినవి. ఇవి ఐచ్ఛికమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వివరాలను చెప్పేందుకు గ్రామీణ ప్రాంతాల వారు ముందుకొస్తున్నా.. పట్టణ ప్రాంతాల్లో చెప్పేందుకు ఇష్టపడటం లేదు.
⇒ ఇక కాలమ్ 13 నుంచి 19 వరకు ప్రశ్నలు భౌతిక, వివాహ స్థితి, పాఠశాల, విద్యార్హతలు, మాధ్యమం, డ్రాపౌట్ తదితర వివరాలకు సమాధానాలు వస్తున్నాయి.
⇒ కాలమ్ 20 నుంచి 56 వరకు ఉన్న ప్రశ్నలకు సమాచారం చెప్పడంలో జనం వెనక్కి తగ్గుతున్నారు. అందులో చాలావరకు వ్యక్తిగత వివరాలు ఉన్నాయని.. అవి వెల్లడించలేమని నిర్మొహమాటంగా చెబుతున్నారు.
⇒ 20వ కాలమ్ నుంచి ఉన్న ప్రశ్నల్లో ఎక్కువగా వ్యక్తిగత అంశాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలే ఉన్నాయి. వృత్తి, వ్యాపారం, వేతనం, కులవృత్తి, వ్యాధులు, వార్షికాదాయం, పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతాలు, వ్యవసాయ భూములు, ధరణి పాస్‌బుక్ వివరాలు, భూమి రకం, నీటిపారుదల వనరులు, కౌలు, రిజర్వేషన్ల ద్వారా పొందిన విద్యావకాశాలు, ఉద్యోగ ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి, ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం, నామినేటెడ్ పోస్టులు, వలసలు, అందుకు కారణాలు, బ్యాంకు లేదా ఇతర సంస్థల నుంచి రుణాలు, వాటి చెల్లింపులు, పశుసంపద, స్థిర, చరాస్తి వివరాలు, రేషన్ కార్డు, నివాసగృహం, ఇంటికి సంబంధించిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు రావడం లేదని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు.
‘అసలు’వివరాలే రావట్లే!
సమగ్ర కుటుంబ సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాల సేకరణే కీలకం. కానీ ఉద్యోగం, వృత్తి, ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వకపోతుండటంతో ఎన్యుమరేటర్లు సైతం చేతులెత్తేస్తున్నారు. వివరాలు చెప్పాలని మళ్లీ మళ్లీ అడిగితే... ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఇచ్చిన వివరాలు నమోదు చేసుకుంటూ ఇతర కాలమ్స్‌ను వదిలేస్తున్నారు. కొన్ని చోట్ల గట్టిగా ఎదురు ప్రశ్నిస్తుండటంతో చాలామంది ఎన్యుమరేటర్లు తర్వాత అడగడమే మానేశారు.
అయితే నిర్దేశించిన ప్రశ్నల్లో సగానికి పైగా సమాధానాలు రాకపోతే సర్వే లక్ష్యం నెరవేరే అవకాశాలు తక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల ఎన్యుమరేటర్లు పెన్సిల్‌తో సర్వే ఫారం పూరిస్తున్నారు. తర్వాత వాటిని పెన్నుతో రాస్తామని చెప్తున్నారు. తప్పులు దొర్లకుండా ఈ విధానం అనుసరిస్తున్నట్టు ఎన్యుమరేటర్లు చెప్తున్నా... పెన్నుతో రాసే సమయంలో ఇతర వివరాలు నమోదు చేస్తారేమోనని జనంలో ఆందోళన కనిపిస్తున్న పరిస్థితి.
ఎన్నో అపోహలు.. మరెన్నో అనుమానాలు!
సమగ్ర సర్వేపై ఎన్నో అపోహలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని నివృత్తి చేయడంలో అధికార యంత్రాంగం సఫలీకృతం కాకపోవడంతోనే... సర్వేలో చాలా ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన సమాచారాన్ని చాలా మంది వెల్లడించడం లేదు. ఒకవేళ ఆస్తుల లెక్కలు చెబితే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కోత పడుతుందనే ఆందోళన కనిపిస్తోంది.
ఈ కారణంగానే ఆధార్ వివరాలను కూడా ఈ కారణంగానే బహిర్గతం చేయడం లేదని అంటున్నారు. వాహనాలు, ఇళ్లు, స్థిర, చరాస్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎక్కువ మంది చెప్పడం లేదు. ప్రధానంగా పింఛన్లు, ఉచిత కరెంటు, రేషన్‌కార్డు, ఉచిత నల్లా కనెక్షన్, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్íÙప్ తదితర పథకాలు ఆగిపోతాయేమోనన్న కారణంతో వాస్తవాలను దాచేస్తున్న పరిస్థితి.
స్టిక్కర్లు వేయని ఇళ్ల మాటేంటి?
పట్టణ ప్రాంతాల్లో చాలా ఇళ్లకు ఇప్పటికీ స్టిక్కర్లు వేయలేదని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు, నాలుగైదు అంతస్తుల భవనాల్లోని చాలా ఇళ్లకు స్టిక్కర్లు వేయలేదని అంటున్నారు. పూర్తిస్థాయి సర్వేలో ఇలాంటి ఇళ్లను గుర్తించి, వివరాలు నమోదు చేసే అవకాశం లేకుండా పోయిందన్న ఫిర్యాదులు వస్తున్నాయి. సర్వే సమయంలో అలాంటి ఇళ్లను కూడా గుర్తించాలని అధికారులు సూచిస్తున్నా.. ఎన్యుమరేటర్లు వచ్చే సమయం తెలియక ఇబ్బందిగా మారిందని ప్రజలు పేర్కొంటున్నారు.
సర్వేతో ఒరిగేదేమిటి..
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేశారు. వెంకటేశ్వరకాలనీ 4బీ రోడ్‌లో నివాసం ఉంటున్న మంద సతీష్ రెడ్డి ఇంటికి రాగా.. సర్వేతో తమకు ఎంత మేరకు ప్రయోజనం చేకూరుతుందని.. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా సర్వే చేసింది.. అప్పుడు అన్ని చెప్పాం.. మళ్లీ కొత్తగా చెప్పేది ఏముంటుందని ప్రశ్నించారు. దీంతో ఎన్యుమరేటర్ నచ్చజెప్పి వివరాలను నమోదు చేశారు.
కుల వృత్తికి సంబంధించి ప్రశ్న అడగ్గా.. రెడ్డిలకు ఏ కుల వృత్తి ఉంటుందని ఎదురు ప్రశ్నించారు. అలాగే, ఆదాయ వివరాలు ఎందుకు చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు. తాము అప్పులు చేసి కొన్న ఫ్రిజ్, టీవీ, ఏసీ, వాహనం వంటి వివరాలు అడగడం తగదన్నారు. రుణమాఫీ, రైతుబంధు, రేషన్‌కార్డు, పింఛన్లు ఇవ్వకుండా సర్వే చేయడం అనవసరమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment