
సీఎం సహాయ నిధికి ఒకరోజు వేతనం... ముఖ్యమంత్రికి తీర్మాన ప్రతి అందజేత
పెన్షనర్ల జేఏసీ రూ.33 కోట్లు
మహబూబాబాద్/సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని, తమ వంతుగా సీఎం సహా య నిధికి ఒక రోజు మూల వేతనాన్ని ప్రకటించినట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మా రం జగదీశ్వర్, జనరల్ సెక్రెటరీ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు.
ఈ మేరకు మంగళవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని కలెక్టరేట్‌లో ఉద్యోగుల జేఏసీ నాయకులు కలిసి ఒకరోజు మూల వేతన తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒక్కరోజు మూల వేతనం ప్రభుత్వ ఖజానాలో జమయ్యేలా చూడాలని సీఎంను కోరారు.
సీఎస్‌కు సమ్మతి పత్రం అందజేత..
వరద బాధితుల సహాయార్థం రాష్ట్రంలోని ఉద్యోగులందరి తరఫున ఒక రోజు వేతనాన్ని ఇవ్వనున్నట్టు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు రూ.100 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్)కి అందజేయాలని కోరుతూ మంగళవారం సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిసి సమ్మతి పత్రాన్ని అందజేశారు.
సీఎస్‌ను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, నేతలు డాక్టర్ నిర్మల, కె.రాములు, శశిధర్‌రెడ్డి, దర్శన్‌గౌడ్, గోపాల్, అశ్వత్థామరెడ్డి, రమాదేవి, రాబర్ట్ బ్రూష్, మహిపాల్‌రెడ్డి, కె.రామకృష్ణ, ఎస్.రాములు, మహేశ్, తిరుపతి, సంపత్ తదితరులు ఉన్నారు.
వరద బాధితులకు ఒక రోజు మూలవేతనం
భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలను ఆదుకునేందుకు ఒకరోజు మూలవేతనం ఇవ్వా లని నిర్ణయించినట్లు తెలంగాణ ఉద్యోగు ల సంఘం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఉద్యోగుల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంది. సమావేశంలో చైర్మన్ పద్మాచారి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మఠం రవీంద్రకుమార్, సీహెచ్ హరీశ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్.నర్సింగ్‌రావు, సంఘం నేతలు జాకబ్, కృష్ణారావు, కిశోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మేము సైతం అంటూ పెన్షనర్ల జేఏసీ...
వరద బాధితుల సహయార్థం ఒక రోజు మూల వేతనాన్ని ఇస్తున్నట్లు పెన్షనర్ల జేఏసీ ప్రకటించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు విరాళం ఇచ్చేందుకు ఏకగ్రీవంగా నిర్ణయించామని, ఇది రూ.33 కోట్ల వరకు ఉంటుందని జేఏసీ చైర్మన్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి శుభాకర్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment