ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలతో నేలవాలిన వరి
కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన ధాన్యం.. ఇరవై రోజులుగా కొనుగోళ్లు లేక ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలు
ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
పిడుగుపాటుతో ఇద్దరు మృతి
మెదక్/ సిరిసిల్ల/ వీర్నపల్లి/ రుద్రంగి/ నిర్మల్/ వాజేడు: ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చాయి. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నీటి పాలవగా.. కొన్నిచోట్ల కోతకు వచ్చిన వరిపంట పొలాల్లోనే నేలకొరిగింది. దీనితో అన్నదాతలు ఆందోళనలో పడిపోయారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి ఇన్నిరోజులైనా ఇంకా కొనుగోళ్లు ఊపందుకోలేదని.. వర్షాలతో తమ ధాన్యం తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసు్తన్నారు. ఇప్పటికే ఆరిపోయి తేమశాతం తగ్గిన వడ్లు కూడా వర్షానికి తడిశాయని, మళ్లీ ఆరబెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రతీ గింజ కొంటామని ప్రభుత్వం ప్రకటించిందని.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని మండిపడుతున్నారు.
తడిసిపోయిన ధాన్యం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే 156 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు మాత్రం మొదలుకాలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం హఠాత్తుగా కురిసిన వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. వీర్నపల్లి, రుద్రంగి మండల కేంద్రాల్లో టార్పాలిన్లు లేకపోవడంతో వడ్లు తడిసిపోయాయి. రుద్రంగి మండలం పరిధిలో రైస్‌మిల్లర్లు ధాన్యం దింపుకోబోమని చెప్తున్నారని రైతులు వాపోతున్నారు.
⇒ మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. దుబ్బాక, మెదక్, నర్సాపూర్, కొల్చారం, చిన్నశంకరంపేట, కౌడిపల్లి, చిలప్‌చెడ్, నిజాంపేట, హత్నూర మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వేలాది క్వింటాళ్ల ధాన్యం నీటిపాలైంది. వర్షాల నేపథ్యంలో కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.
⇒ నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో శుక్రవారం గంటకుపైగా వాన కురిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపైకి వరద చేరింది. కుంటాల మండలంలో కోతకు వచ్చిన వరి నేలవాలింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి, జైపూర్ మండలాల్లో సుమారు 4000 ఎకరాలకుపైగా వరి నేలవాలింది. భీమిని, కన్నెపల్లి మండలాల్లో వందల ఎకరాల్లో పత్తి తడిసిపోయింది.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
రాష్ట్రంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో పత్తి ఏరుతుండగా పిడుగుపడి గడ్డం నాగమ్మ (26) అనే మహిళ మృతి చెందింది. ఇక ములుగు జిల్లా వాజేడు మండలం కృష్ణాపురంలో వ్యవసాయ భూమిలో ఎడ్లను మేపుతుండగా పిడుగుపాటుకు గురై సొనప నవీన్ (24) మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment