పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి (ఏరియల్ వ్యూ)
సాక్షి, అమరావతి/కొవ్వూరు: గోదావరి నదిలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. ఎగువన తెలంగాణలో లక్ష్మి, సరస్వతి బ్యారేజీలు నిండుకుండలుగా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో బుధవారం సాయంత్రం 6 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు 1.20 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద వరద నీటిమట్టం 28.75 అడుగులకు చేరుకుంది. 10 రివర్ స్లూయిజ్ గేట్లు, 48 క్రస్ట్ గేట్ల ద్వారా వచ్చిన వరదను వచ్చినట్టుగా పోలవరం స్పిల్‌వే నుంచి దిగువకు వదిలేస్తున్నారు.
ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,15,549 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1,14,879 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులోకి చుక్క నీరు చేరకపోయినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దీనివల్ల శ్రీశైలంలో నీటిమట్టం 807.45 అడుగులకు, నీటి నిల్వ 32.80 టీఎంసీలకు పడిపోయింది. పులిచింతల నుంచి వదిలేసిన నీటితోపాటు వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీలోకి 11,442 క్యూసెక్కులు వస్తోంది. మిగులుగా ఉన్న 10,310 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment