Godavari River Flood Severe Dowleswaram Barrage Heavy Rains - Sakshi
Sakshi News home page

Dowleswaram Barrage: మహోగ్ర గోదావరి.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

Published Thu, Jul 14 2022 3:21 AM | Last Updated on Thu, Jul 14 2022 3:10 PM

Godavari River Flood severe Dhavaleshwaram Barrage Heavy Rains - Sakshi

పోలవరం వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి

సాక్షి, అమరావతి/అమలాపురం/ధవళేశ్వరం/పోలవరం రూరల్‌/చింతూరు/ఎటపాక: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం.. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరి నది బుధవారం మహోగ్రరూపం దాల్చింది. వరద తీవ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీకి గల 175 గేట్లు ఎత్తేశారు. బుధవారం రాత్రి 8 గంటలకు బ్యారేజీలోకి 15,11,169 క్యూసెక్కులు చేరుతుండగా.. వరద మట్టం 15.1 అడుగులకు చేరుకుంది. దాంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఎగువన కాళేశ్వరంలో 14.67 మీటర్లు, పేరూరులో 16.46 మీటర్లు, దుమ్ముగూడెంలో 14.41 మీటర్లు, కూనవరంలో 22.27మీటర్లు, కుంటలో 13.31 మీటర్లు, పోలవరంలో 13.84 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 17.23 మీటర్ల చొప్పున నీటిమట్టాలు నమోదయ్యాయి. వరద తీవ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజీకి గల 175 గేట్లు ఎత్తేశారు.

డెల్టా కాలువలకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 15,07,169 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం 19 లక్షల క్యూసెక్కులు దాటితే ఇళ్లలోకి నీరు చేరుతుందని భావిస్తున్నారు. గురువారం రాత్రికి బ్యారేజీలోకి భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.  
  
పోటెత్తిన కడెం ప్రాజెక్ట్‌ 
చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో జూలై రెండో వారంలోనే గరిష్ట స్థాయిలో వరద ప్రవాహం కడలి వైపు పరుగులు తీస్తోంది. తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో 3.82 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో కడెం ప్రాజెక్టు స్పిల్‌ వేను నిర్మిస్తే.. ఆ ప్రాజెక్టులోకి కడెం వాగు నుంచి 5.69 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మి, సరస్వతి బ్యారేజీల గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తేసి.. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దాంతో తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క బ్యారేజీలోకి 17.65 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది.

అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహం పెరుగుతోంది. బుధవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్దకు 15,14,976 క్యూసెక్కులు చేరుతుండగా.. వరద మట్టం 54.70 అడుగులకు చేరుకుంది. దాంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయానికి భద్రాచలం వద్దకు 18 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉందని.. నీటిమట్టం 60 అడుగులకు చేరే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. గోదావరి చరిత్రలో ఆగస్టు 16, 1986లో గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు.. భద్రాచలం వద్ద వరద మట్టం 75.6 అడుగులుగా నమోదైంది.  
 
పోలవరం వద్ద 24 గంటలూ అప్రమత్తత 
ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వరద నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి బుధవారం రాత్రి 8 గంటలకు 14,54,636 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్‌ వే వద్ద నీటిమట్టం 34.21 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తేసి అంతే స్థాయిలో దిగువకు వరద విడుదల చేస్తుండటంతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద వరద మట్టం 26 మీటర్లకు చేరుకుంది. గురువారం ఉదయానికి పోలవరం ప్రాజెక్టులోకి 18 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  
 
లంకల్ని ముంచెత్తిన వరద 
– నీట మునిగిన రహదారులు.. కాజ్‌వేలు 
కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో వరద ముంపు మరింత పెరిగింది. ప్రధాన రహదారులు ముంపుబారిన పడ్డాయి. ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. ఆయా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక, ఊడుమూడిలంక,  నాగుల్లంక, కె.ఏనుగుపల్లి ముంపుబారిన పడ్డాయి. ఈ గ్రామాల్లో నాలుగు అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. అలాగే మానేపల్లి శివారు పల్లిపాలెం, శివాయలంక జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ మండలాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని అయోధ్యలంక, పుచ్చల్లంక, కనకాయలంక, పెదమల్లంలంక, అనగారలంక సైతం నీట మునిగాయి.

మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి కాజ్‌వే, అయినవిల్లి మండలం ఎదురుబిడియం కాజ్‌వే మీదుగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముమ్మిడివరం మండలం గురజాపులంక, లంకాఫ్‌ ఠాన్నేల్లంకలో ఎస్సీ కాలనీలు ముంపుబారిన పడ్డాయి. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు పరిధిలో పొగాకులంక, పొట్టిలంకల్లో రోడ్ల మీద నీరు ప్రవహిస్తోంది. కె.గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీలో ముంపుబారిన పడింది. పాండిచ్చేరి పరిధిలోని యానాంలో బాలయోగి నగర్‌ కాలనీ, ఓల్డ్‌ రాజీవ్‌ నగర్‌ వద్ద వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 43 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  
 
ముంపులోనే విలీన మండలాలు 
తగ్గినట్టే తగ్గిన గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. వరుసగా మూడో రోజు కూడా పోలవరం ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. వరద మరింత పెరిగే పరిస్థితి నెలకొంది. నాలుగు మండలాల్లో 87 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా ఇప్పటికే 6,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్లూరి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ చింతూరు ఐటీడీఏలో మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బోటులో ప్రయాణించి వరద పరిస్థితిని, సహాయక కార్యక్రమాలను పరిశీలించారు. చింతూరు నుంచి బోట్లు, లాంచీల సాయంతో నిత్యావసర సరుకులను ముంపు మండలాలకు తరలిస్తున్నారు.  
 
బోటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్‌! .. 
గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉధృతి కారణంగా పర్యాటక శాఖ బోటింగ్‌ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. పోచమ్మగండి నుంచి పాపికొండలుకు విహార యాత్రను రద్దు చేసింది. రాజమండ్రి ఘాట్లతో పాటు దిండి ప్రాంతంలో బోటింగ్‌ ఆపేసింది. విజయవాడలోని బెరంపార్క్‌–భవానీ ద్వీపానికి జల ప్రయాణానికి విరామం ప్రకటించింది. 
 
చురుగ్గా సహాయక చర్యలు 
గోదావరి వరద సహాయక చర్యల్లో 6 ఎన్డీఆర్‌ఎఫ్, 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నిమగ్నమై ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. గోదావరి లంక గ్రామాల ప్రజలు వారి ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 1070, 1800–425–0101, 08632377118లో సంప్రదించాలన్నారు. కాగా, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదుల వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నామన్నారు. మూడో ప్రమాద హెచ్చరిక వస్తే ప్రభావితం చూపే మండలాలపై జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు. 
 
కృష్ణా నదిలో వరద పరవళ్లు 
కృష్ణా నదితోపాటు ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డాŠయ్‌మ్‌లలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరడం, ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో గేట్లు ఎత్తేసి దిగువకు భారీ ఎత్తున వరదను విడుదుల చేస్తున్నారు. దాంతో శ్రీశైలంలోకి గురువారం నుంచి వరద ప్రవాహం పెరగనుంది. పశ్చిమ కనుమల్లో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ దృష్ట్యా శ్రీశైలంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది.

శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 167.49 టీఎంసీలు అసవరం. నాగార్జునసాగర్‌కు దిగువన కురుస్తున్న వర్షాల వల్ల మూసీ నుంచి పులిచింతల్లోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతలకు దిగువన కురుస్తున్న వర్షాల  ప్రభావం వల్ల మున్నేరు, కట్టలేరు తదితర వాగులు, వంకల నుంచి వరద కృష్ణా నది మీదుగా ప్రకాశం బ్యారేజీలోకి 27,746 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టాకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 23,746 క్యూసెక్కులను 30 గేట్లను అరడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement