ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన ఎంపీలు
రాష్ట్రానికి సంబంధించిన అన్ని ముఖ్యాంశాలను పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తండి. పరిస్థితిని, వాస్తవాలను సమగ్రంగా వివరించి.. బకాయిలు వెంటనే విడుదల చేసేలా గట్టి ప్రయత్నం చేయండి. ఇందుకోసం సంబంధిత శాఖల మంత్రులు, అధికారులను కూడా కలిసి మాట్లాడండి. రాష్ట్రపతి, ఇతర ముఖ్య నేతలకు కూడా రాష్ట్ర పరిస్థితిని వివరించండి. అన్ని విధాలా రాష్ట్రానికి న్యాయం జరిగేలా అడుగులు ముందుకు వేయండి.
– వైఎస్సార్‌సీపీ ఎంపీలతో సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లుగా ఆమోదింపజేయడంతో పాటు కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు. 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఖరారు చేసి 29 నెలలు అవుతోందని సీఎం అన్నారు. గతంలో ఏదైనా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే కేంద్రమే ఆ ఖర్చంతా భరించే పరిస్థితులు ఉండేవని, అయితే పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాత రీయింబర్స్ చేసే విధానాన్ని కేంద్రం అనుసరిస్తోందని చెప్పారు.
మిగిలిన ఏ జాతీయ ప్రాజెక్టుల విషయంలో కూడా ఇలాంటి విధానాన్ని అనుసరించడం లేదని తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులకు ఖర్చు చేసిన నిధులు రూ.1,971 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. అయినప్పటికీ పోలవరం నిర్మాణం ఎక్కడా ఆగకుండా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చి పనులు జోరుగా ముందుకు సాగేలా చేస్తోందని స్పష్టం చేశారు. నిర్వాసితులకు సహాయ, పునరావాస (ఆర్‌అండ్‌ఆర్) ప్యాకేజీకి సంబంధించి దాదాపు రూ.33 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, ఈ మేరకు నిధులను సత్వరమే విడుదల చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడిన విషయాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కృష్ణా జలాల్లో వాటా నీటినే వాడుకుంటాం
► రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు విజ్ఞప్తి చేశాం. ఈ ఎత్తిపోతల కింద ఒక్క ఎకరం కూడా అదనపు ఆయుకట్టు లేదు. ఒక్క నీటి చుక్కనూ అదనంగా మనం తరలించడం లేదు.
► శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి వీలుంటుంది. గత 20 సంవత్సరాల్లో ఈ రెండేళ్లు మినహా సరాసరి ఏడాదికి 20–25 రోజులకు మించి శ్రీశైలంలో ఈ స్థాయిలో నీటి మట్టం ఉండటం లేదు. తెలంగాణాలో పెట్టిన అన్ని లిప్టులు 800 అడుగుల లోపలే నీటిని తీసుకునేలా ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి.
► చంద్రబాబు హయాంలో తెలంగాణ సర్కార్.. అనుమతి లేకుండా ఒక్క శ్రీశైలంలోనే 5 ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. 50 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకుంది. ఇది చట్టానికి పూర్తి భిన్నంగా జరిగింది.
► కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచి కడుతున్నారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను అనుమతి లేకుండా చేపట్టారు. ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ)ని విస్తరిస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు 800 అడుగుల లోపల నుంచే నీటిని తెలంగాణ తరలిస్తుంది.
► శ్రీశైలంలో 796 అడుగుల వద్దే విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం తెలంగాణాకు ఉంది. ఈ పరిస్థితుల్లో 881 అడుగుల నీటిమట్టం కొనసాగే పరిస్థితి లేదు కాబట్టి, మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 800 అడుగుల్లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. ఈ ఎత్తిపోతల ద్వారా మన వాటా నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లాలనేది ఆలోచన.
తెలంగాణ తీరు ఒప్పందాలకు భిన్నం
► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు 1976 మే 31న బచావత్ ట్రిబ్యునల్ నీటిని కేటాయించింది. అప్పట్లో రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తాంధ్రాకు 367.34 టీఎంసీలు, తెలంగాణాకు 298.96 టీఎంసీలు కేటాయించారు. దీనికి సంబంధించి ఒప్పందాలపై 2015 జూన్ 19న తెలంగాణా, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంతకాలు కూడా చేశారు.
► దానికి పూర్తి భిన్నంగా ఈరోజు తెలంగాణా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కృష్ణా బోర్డు ఉత్తర్వులు, ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించి శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో అక్రమంగా విద్యుదుత్పత్తి కోసం 63 టీఎంసీలను వాడుకుంది. ఇప్పటికే ఎనిమిది టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితిని సృష్టించి.. రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాస్తోంది. దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాం.
► వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ట్రిబ్యునల్ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాన్ని తక్షణమే నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరండి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం
► విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి సంబంధించి వైఎస్సార్‌సీపీ కేంద్రానికి మూడు ఆప్షన్లు ఇచ్చింది. నష్టాల్లో ఉంది కాబట్టి ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నష్టాల నుంచి లాభాల్లోకి రావాలంటే దీనికి క్యాప్టివ్ మైన్స్‌ను కేటాయించాలని కోరాం.
► రూ.14 వేల కోట్ల రుణాన్ని ఈక్విటీ కింద పరిగణిస్తే వడ్డీ భారం తగ్గుతుందని చెప్పాం. అలా చేస్తే నష్టాల నుంచి లాభాల్లోకి వస్తుంది. అప్పుడు ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని చెప్పాం.
► ప్రైవేటీకరణ చేసే బదులు.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కో, ఎన్‌ఎండీసీలోనే విలీనం చేస్తే బాగుంటుందన్న విషయాన్ని నొక్కి వక్కాణించి కేంద్రానికి తెలియజేశాం. పార్లమెంటులో ఇదే అంశాన్ని లేవనెత్తండి.
రూ.6,112 కోట్ల విద్యుత్ బకాయిలు రాబట్టండి
► 2014 నుంచి 2017 వరకు చంద్రబాబు హయాంలో మన రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేశారు. ఈ విద్యుత్ బిల్లుల విలువ రూ.6,112 కోట్లు. ఇప్పటి వరకు ఆ బిల్లులను తెలంగాణ సర్కార్ చెల్లించ లేదు. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్‌లో ప్రస్తావించండి.
► గతంలో హిమాచల్‌ప్రదేశ్, హర్యానా మధ్య.. పశ్చిమబెంగాల్, జార్ఖండ్ మధ్య తలెత్తిన వివాదాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఇదే రీతిలో మన రాష్ట్రానికి చెల్లించాల్సిన రూ.6,112 కోట్లను తెలంగాణ సర్కార్ చెల్లించకపోతే.. కేంద్ర ప్రభుత్వం డివల్యూషన్ (పన్నుల్లో వాటా)లో తెలంగాణా రాష్ట్రానికి విడుదల చేయాల్సిన నిధుల నుంచి వాటిని మినహాయించి మన రాష్ట్రానికి ఇచ్చే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దీన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసి, బకాయిలు రాబట్టండి.
జాతీయ ఆహార భద్రత చట్టంలో అసమానతలు
► రాష్ట్రం విడిపోయినప్పుడు ఆహార భద్రత చట్టంలో అసమానతల వల్ల తక్కువ రేషన్ కార్డులు వచ్చాయి. రేషన్ కార్డులు కేంద్రం ఎన్నైతే ఆమోదించిందో అంత వరకు మాత్రమే రేషన్ సబ్సిడీ కేంద్రం ఇస్తుంది. మిగిలినది రాష్ట్రం భరిస్తుంది. ఇందుకు రెండు ప్రామాణికాలు తీసుకున్నారు.
► రాష్ట్ర విభజన సందర్భంలో తీసుకున్న పర్సెంటేజ్ ప్రాతిపదికన రేషన్ కార్డులు విడదీశారు. దాని ఆధారంగానే సబ్సిడీ ఇస్తున్నారు. ఈ అంశంపై ఇటీవల కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశాం. మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీకి ఎంత అన్యాయం జరుగుతుందో వివరించాం.
► రేషన్ సబ్సిడీలో గ్రామీణ ప్రాంతంలో కర్ణాటకలో 76.04 శాతం, గుజరాత్‌లో 76.64 శాతం, మహారాష్ట్రలో 76.32 శాతం కవర్ అవుతున్నారు. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి కేవలం 60.96 శాతం మాత్రమే కవర్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేటప్పటికి కేవలం 60 శాతానికి పరిమితం చేసింది. ఈ అసమానతలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరండి.
► కేంద్రం నుంచి ధాన్యం బకాయిలు రూ.5,056 కోట్లు రావాల్సి ఉంది. వాటిని కేంద్రం విడుదల చేయక పోవడంతో కిందామీదా పడి రాష్ట్ర ఖజానా నుంచే సర్దుబాటు చేసి రైతులకు చెల్లిస్తున్నాం. ధాన్యం బకాయిలను తక్షణమే విడుదల చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెండి.
దిశ చట్టాన్ని ఆమోదించాలని ఒత్తిడి చేయండి
► దిశ చట్టం చాలా కాలంగా కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉంది. దాన్ని తక్షణమే ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి.
► రాష్ట్రంలో 17,005 లేఅవుట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశా>ం. ఆ నిధులను రాబట్టడానికి ప్రయత్నించండి. ఉపాధి హామీ పథకం కింద రూ.6,750 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెండి.
గిరిజన ప్రాంతంలోనే గిరిజన విశ్వవిద్యాలయం
► విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్రం మంజూరు చేసింది. దానికి భూమిని గత ప్రభుత్వం గిరిజనేతర ప్రాంతంలో కేటాయించింది. గిరిజన యూనివర్సిటీ గిరిజన ప్రాంతంలోనే ఉండాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం ఎస్.కోట నియోజకవర్గం నుంచి సాలూరు నియోజకవర్గానికి తరలించి అక్కడ భూమిని కేటాయించింది.
► దాన్ని ఆమోదించి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయండి. విభజన చట్టానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీల్లో అమలుకు నోచుకోని వాటిని ప్రస్తావించి, వాటన్నింటిని కేంద్రం దృష్టికి తీసుకొచ్చి.. అమలు చేసేలా ఒత్తిడి తెండి.
కోవిడ్ సమయంలో అత్యుత్తమ సేవలు
► కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. దేశంలోనే అత్యుత్తమ సేవలు అందించిన తీరు.. మరణాలు అతి స్వల్పంగా నమోదైన రాష్ట్రాలలో రెండో స్థానంలో రాష్ట్రం ఉందనే అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించండి.
► రాష్ట్రంలో 12 సార్లు డోర్ టూ డోర్ సర్వే చేసి.. ప్రతి కుటుంబంలో ఎవరైనా జ్వరం లేదా ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్న వారందరికీ ఉచితంగా పరీక్షలు చేశాం. పరీక్షలు కావాలనుకున్న వారందరికీ పరీక్షలు చేశాం. కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసి, అత్యుత్తమ చికిత్స అందించడంలో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో రాష్ట్రం నిలిచింది.
► కేంద్రం 28 పీఎస్‌ఏ ప్లాంట్లు ఇస్తే.. వాటితో కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం 134 చోట్ల ఏర్పాటు చేస్తోంది. ఇవికాకుండా క్రయోజనిక్ ట్యాంకర్లు కూడా కొనుగోలు చేశాం. మొదటి వేవ్‌లో ఇంచుమించుగా రాష్ట్రం రూ.20 వేల కోట్లు నష్టపోయింది. కోవిడ్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇంచుమించు రూ.7 వేల కోట్లు ఖర్చు చేసింది. మూడో వేవ్ వస్తుందంటున్నారు. వచ్చినా రాకపోయినా ప్రభుత్వం పూర్తిగా సమాయత్తమై ఎదుర్కునే పరిస్థితి ఉంది. రేషన్‌ను ఉచితంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.400 కోట్లు ఖర్చు చేస్తోంది.
కేంద్ర పన్నుల్లో తగ్గుతున్న వాటా
► కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రం వాటా 42 శాతం. డెవల్యూషన్ ఫండ్స్ ఏడాదికి ఏడాది తగ్గుతూ వస్తున్నాయి. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి.. వాటా నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయండి.
► పార్లమెంట్‌లో వాస్తవాలనే ప్రస్తావించండి. సమావేశాలకు సభ్యులంతా విధిగా హాజరై.. చర్చల్లో పాల్గొని.. రాష్ట్ర సమస్యలు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి.
అన్ని అంశాలపై ఒత్తిడి తెస్తాం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నాలుగు వారాలు జరుగుతాయి. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీకి కేటాయించిన సమయంలోనే సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేసిన అంశాలన్నీ ప్రస్తావిస్తాం. ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. ప్రత్యేక హోదా కావాలే తప్ప ప్రత్యామ్నాయం లేదని మేం మొదటి నుంచి చెబుతున్నాం. చంద్రబాబు హోదాను కేంద్రానికి అమ్మేశాడు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. ప్రత్యేక హోదా అవసరం లేదని, తనకు ఒక ప్యాకేజి ఇస్తే చాలని ముందుకెళ్లాడు. కాబట్టే ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం జాప్యం చేస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఇంచుమించుగా ఇప్పటి దాకా ఢిల్లీకి వెళ్లిన 12 సందర్భాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాన మంత్రి, హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడే సమస్య లేదు.
-వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత
Comments
Please login to add a commentAdd a comment