
సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2021 జూన్ కంటే ముందే పూర్తయ్యేలా ప్రణాళికలు రచించామని మంత్రి తానేటి వనిత అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించిన విషయం తెలిసిందే. అనంతరం మంత్రి వనిత మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను విస్తృతంగా సమీక్షించారని, వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యే విధంగా అధికారులకు స్పష్టమైన అదేశాలు ఇచ్చారని తెలిపారు. మహానేత వైఎస్సార్ చేపట్టిన పొలవరాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్ పూర్తి చేయబోతున్నారని అన్నారు. (పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన సీఎం జగన్)
వైఎస్సార్ కలలను జగన్ నెరవేరుస్తారని స్పష్టం చేశారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో పోలవరం పేరుతో దోపిడీ చేశారని విమర్శించారు. ప్రాజెక్టు పనులు చేయకుండా వారం వారం ప్రచారం మాత్రమే చేశారని పేర్కొన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌తో రూ.630 కోట్లు ఆదా చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్సార్ మనసపుత్రికను పూర్తి చేస్తున్నందుకు రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.