ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డు సింగరేణి సంస్థకు దక్కింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా సీఎండీ ఎన్.శ్రీధర్ అవార్డు అందుకున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 60.04 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 15 శాతం వృద్ధిరేటుతో జాతీయ బొగ్గు రంగ పరిశ్రమలకే తలమానికంగా నిలిచింది.
అలాగే బొగ్గు రవాణాలోనూ అగ్రస్థానంలో నిలిచి పాత రికార్డులను తిరగరాసింది. కార్మికులకు సంక్షేమ కార్యక్రమాల అమలు, పారిశ్రామిక సంబంధాల విషయంలో సీఎండీ చూపిన చొరవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ.. సింగరేణీయులు అందించిన సహకారం వల్లే సంస్థ అభివృద్ధి సాధించగలిగిందని ప్రశంసించారు. కార్మిక సంఘాల సహకారంతో సమ్మెలు లేని సంస్థగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.