బ్లాక్‌లిస్టులో పెట్టేస్తాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పనులు సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని కలెక్టర్ ఎన్.శ్రీధర్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఆదర్శ పాఠశాలల నిర్మాణ పనులను సమీక్షించారు. అదేవిధంగా అదనపు తరగతిగదులు, కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలల నిర్మాణ పనుల తీరునూ పరిశీలించారు. పరిగి, షాబాద్ తదితర ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలల నిర్మాణ పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయని కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికంగా సమస్యలుంటే మండల తహసీల్దార్, ఎంపీడీఓలను సంప్రదించి పరిష్కరించుకోవాలని, అలాకాకుండా పనులు నిలిపివేస్తే ఊరుకునేది లేదని అన్నారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈ పనులు పూర్తి చేయాలన్నారు. మొదటిసారి సమావేశం నిర్వహిస్తున్నందున హెచ్చరికలతో సరిపెడుతున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. వచ్చే నెలలో మరోమారు సమీక్షిస్తానని, పురోగతి లేకుంటే ఆ కాంట్రాక్టు రద్దు చేయడంతోపాటు కాంట్రాక్టరు పేరును బ్లాక్ లిస్టులో పెడతామని అన్నారు. సదరు కాంట్రాక్టరుకు ప్రభుత్వపరంగా ఎలాంటి పనులు మంజూరుకావని తేల్చి చెప్పారు. ఇటీవల మంజూరైన అదనపు తరగతి గదుల పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీఎం అధికారులను ఆదేశించారు.
కాంట్రాక్టర్లకు వదిలేస్తే సరిపోదు..
సర్వశిక్షా అభియాన్ కింద చేపట్టిన కస్తూరా్భా గాంధీ బాలికల పాఠశాలల పనుల్లో తీవ్ర జాప్యం చేయడంపై కలెక్టర్ ఆగ్రహించారు. తొమ్మిది నెలల్లో చేపట్టాల్సిన పనులు ఏడాదిన్నర పూర్తయినా చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్‌ఎస్‌ఏ ఇంజినీర్లు ఈ పనులు ఎందుకు సమీక్షించడంలేదంటూ ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఇంజినీరింగ్ అధికారులు చోద్యం చూడకుండా పనులను క్రమం తప్పకుండా పరిశీలించాలన్నారు.
ఇకపై ఇలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. నెలావారీగా లక్ష్యాలు నిర్దేశించి పనుల్లో పురోగతి సాధించాలన్నారు. కేజీబీవీలకు ప్రహరీలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి తెచ్చేందుకు ప్రణాళిక తయారు చేయాలన్నారు. సమావేశంలో డీఈఓ సోమిరెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీఓ కిషన్‌రావు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎస్‌ఈ మల్లేష్, ఈఈ నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.