
సాక్షి, కడప: కడప జిల్లా కేంద్రంలోని మౌంట్‌ఫోర్ట్ హైస్కూలు విద్యార్థి చరణ్‌రెడ్డి అనుమానాస్పదమృతి మిస్టరీ వీడక ముందే తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. జిల్లాలోని సింహాద్రిపురం కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని వెంకటేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ లోనే వెంకటేశ్వరి బలన్మరణానికి పాల్పడిందని, సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ విద్యార్థిని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈనెల 12వ తేదీ తెల్లవారుజామున కడప పట్టణ శివార్లలోని మౌంట్‌ఫోర్ట్ స్కూలు హాస్టల్‌లోనే చరణ్‌రెడ్డి అనే విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ధరించిన టైతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నప్పటికీ, విద్యార్థి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.