మళ్లీ వస్తా.. పనులు చూస్తా..
మోమిన్‌పేట: ఇంటింటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించాలి.. దీనికోసం ఎంత డబ్బు అవసరమవుతుందో చెప్పండి.. నిధులు విడుదల చేస్తాం.. కానీ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పాలని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్‌డబ్ల్యూఎస్) ఏఈని కలెక్టర్ ఎన్.శ్రీధర్ ప్రశ్నించారు. నెలరోజుల్లో పూర్తి చేస్తామని ఏఈ సమాధానమివ్వడంతో.. మళ్లీ వస్తానని.. పనులను చూస్తానని కలెక్టర్ అన్నారు.
సోమవారం మండలంలోని వెల్‌చాల్ గ్రామంలో నిర్వహించిన ‘మన ఊరు- మన గ్రామం’ గ్రామసభలో అధికారులతో శాఖలవారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటి కీ కుళాయి ద్వారా తాగునీటిని అందించేందుకు అదనంగా రూ.2 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. చెత్తను సేకరించి గ్రామం బయట వేసేందుకు డంపింగ్‌యార్డును గుర్తించాలని తహసీల్దార్ రవీందర్‌ను ఆయన ఆదేశించారు.
ప్రతీ కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ప్రభుత్వం అందుకు తగిన నిధులు ఇస్తుందన్నారు. ఉన్నత పాఠశాలకు ఐదు అదనపు తరగతి గదుల కోసం స్థలం, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రాధానోపాధ్యాయుడు ప్రభు కోరగా... మౌలిక వసతులు కల్పిస్తాం.. కానీ 10వ తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు.
నిరుద్యోగ యువకులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణనిప్పించి ఉద్యోగావకాశాలు కల్పించాలని ఐకేపీ ఏపీఎం రాజును కలెక్టర్ ఆదేశించారు. మహిళా సంఘాలు బ్యాంకులో తీసుకొంటున్న రుణాలతో యూనిట్లు పెట్టుకొవాలని ఆయన సూచించారు. గ్రామంలోని గర్భిణులు ఆస్పత్రుల్లోనే కాన్పులు చేసుకునేలా ఏఎన్‌ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, ఎంపీపీ నిఖిత, వైస్ ఎంపీపీ అమరేందర్‌రెడ్డి, సబ్ కలెక్టరు ఆమ్రపాలి, మండల ప్రత్యేకాధికారి రమణారెడ్డి, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు బిపాషా, ఎంపీడీఓ కె.సువిధ, వ్యసాయాధికారి నీరజ, డిప్యూటీ తహసీల్దార్ దీపక్, ఏపీఓ అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లయ్య, మాజీ సర్పంచులు విఠల్, ఇబ్రహీం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.