సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియలో జిల్లా యంత్రాంగానికి మరో తలనొప్పి వచ్చిపడింది. సర్వే ప్రక్రియలో సిబ్బంది కొరతతో సతమతమైన యంత్రాంగం.. చివరకు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, విద్యార్థులను వినియోగించుకుని పరిస్థితిని గట్టెక్కించింది. తాజాగా ఈ సర్వే వివరాల కంప్యూటరీకరణకు కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్లు కరువయ్యారు. వివరాల నమోదు ప్రక్రియ మొదలుపెట్టి ఐదురోజులు కావస్తున్నా.. ఇప్పటివరకు కేవలం 50వేల కుటుంబాలకు సంబంధించి మాత్రమే నమోదు పూర్తయింది.
మరోవైపు సర్కారు విధించిన గడువు ముంచుకొస్తుండగా..
నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం తో జిల్లా యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది.
ఆరు శాతమే!
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాన్ని మాత్రమే యంత్రాంగం సర్వే చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని జిల్లా పరిధినంతా జీహెచ్‌ఎంసీ అధికారులు సర్వే చేశారు. అయితే గ్రామీణ ప్రాంతంలో దాదాపు ఎనిమిది లక్షల కుటుంబాలను సర్వే చేయగా.. వాటిని ప్రస్తుతం కంప్యూటర్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకుగాను శివార్లలోని ఇంజినీరింగ్ కళాశాలలను నమోదు కేంద్రాలుగా ఎంపిక చేశారు.
అక్కడ కంప్యూటర్లు అందుబాటులో ఉండడంతో ప్రక్రియ సులభతరమవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. వివరాల నమోదుకు రెండువేల కంప్యూటర్లు వినియోగించేలా ఏర్పాట్లు చేసింది. ఇంతవరకు అధికారులు విజయవంతంగా ప్రక్రియను పూర్తిచేశారు. కానీ అసలు చిక్కంతా డాటా ఎంట్రీ ఆపరేటర్ల అంశంలో వచ్చిపడింది. రెండువేల మంది ఆపరేటర్లను వినియోగించుకుని రెండువేల కంప్యూటర్ల ద్వారా నమోదు చేయాలని అధికారుల భావించినా.. కేవలం తొమ్మిది వందల మంది ఆపరేటర్లు మాత్రమే లభించారు. అందుబాటులో ఉన్న ఆపరేటర్లతో నమోదు ప్రక్రియ చేపట్టగా.. ఇప్పటివరకు కేవలం 50వేల కుటుంబాల వివరాలు మాత్రమే నమోదు చేశారు. నిర్దేశిత లక్ష్యంలో కేవలం ఆరుశాతం మాత్రమే పూర్తిచేయడంతో అధికారగణం ఆందోళన చెందుతోంది.
గడువులోగా కష్టమే..
సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియంతా సెప్టెంబర్ రెండోతేదీ నాటికి పూర్తిచేయాలని సర్కారు స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో ఈనెల 22 నుంచి నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించింది. అయితే జిల్లాలో మాత్రం కంప్యూటర్ల నిర్వహణలో సమస్య తలెత్తడంతో కొంత జాప్యం జరిగింది. ఫలితంగా మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో నమోదు ప్రక్రియ ప్రారంభించగా.. ఇప్పటివరకు 50వేల ఫారాలను కంప్యూటరీకరించారు. సగటున రోజుకు 25వేల దరఖాస్తులు పూర్తవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో సర్కారు విధించిన గడువు నాటికి కేవలం 25శాతం మాత్రమే పూర్తవుతుందని తె లుస్తోంది. మరోవైపు డాటాఎంట్రీ ఆపరేటర్ల సంఖ్య పెంచేందుకు యంత్రాంగం ప్రత్యేక తాయిలాలు ప్రకటిస్తోంది. ప్రస్తుతం డాటా ఎంట్రీ చేస్తున్న ప్రభుత్వం సంబంధిత ఉద్యోగులకు ఒక్కో దరఖాస్తుకు రూ.5 చెల్లిస్తుండగా.. ప్రైవేటు సిబ్బందికి రూ.10వరకు చెల్లిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆపరేటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా సెప్టెంబర్ పదో తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని కలెక్టర్ ఎన్.శ్రీధర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
సిబ్బంది లేరు!
Published Thu, Aug 28 2014 12:04 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement