సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ పూర్తయింది. కుటుంబాల సమగ్ర సమాచారాన్ని కంప్యూటరీకరించే ప్రక్రియను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. శనివారం నాటికి ఈ ప్రక్రియను కొలిక్కి తెచ్చిన యంత్రాంగం.. సర్వే రోజున మిగిలిపోయిన (ప్రి విజిట్‌లో ఇంటి నంబర్లు ఇవ్వని) కుటుంబాల వివరాలను కూడా నమోదు చేయాలని నిర్ణయించింది.
అదే సమయంలో సర్వే ఫారాల కొరత కారణంగా జిరాక్స్ కాపీల్లో నమోదు చేసిన వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీచేయడంతో అధికారయంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సర్వే కంప్యూటరీకరణలో ఆధార్ విషయమై ఆసక్తికర విషయం వెలుగు చూసింది. దాదాపు 7.89 లక్షల మంది తమ ఆధార్ వివరాలను ఇవ్వలేదు.
గత నెల 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంట్లో కేవలం గ్రేటర్ పరిధి మినహా మిగతా ప్రాంతంలో సర్వే నిర్వహణ బాధ్యతలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఈ సర్వేలో జిల్లావ్యాప్తంగా 8.41 లక్షల కుటుంబాలు వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించారు. ఈ డేటాను గత వారం రోజులుగా కంప్యూటరీకరిస్తున్న ఆపరేటర్లు.. శనివారం ఈ ప్రక్రియకు ముగింపు పలికారు.
తొలినాళ్లలో రోజుకు 50వేల కుటుంబాల వివరాలు మాత్రమే నిక్షిప్తం చేసిన సిబ్బంది.. దీన్ని లక్షకు చేర్చారు. దీంతో కంప్యూటరీకరణ మూడు రోజుల ముందుగానే ముగిసింది. ఇదిలావుండగా, అనివార్య పరిస్థితుల్లో సర్వే రోజున అందుబాటులో లేని (డోర్‌లాక్) కుటుంబాలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాయి.
లెక్కతప్పిన ఆధార్
ఆధార్ కార్డుల జారీలో రాష్ర్టంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
ఏకంగా 110 శాతం ఆధార్ కార్డులు ఇవ్వడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అయితే, సమగ్ర సర్వేలో ఆధార్ వివరాలు మాత్రం లెక్క తప్పాయి. కుటుంబ సభ్యుల సంఖ్యకు ఆధార్ కార్డుల జారీకి భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. శనివారం సాయంత్రం 7 గంటల వరకు జిల్లాలో 27,77,742 మంది వివరాలను కంప్యూటరీకరించగా, దీంట్లో 7,89,868 మంది తమ ఆధార్ వివరాలను సర్వేలో పొందుపరచలేదు. ఆధార్ సమాచారం సర్వేలో నమోదు కాకపోవడానికి జిల్లా యంత్రాంగం.. పలు రకాలుగా విశ్లేషిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 52.96 లక్షలు.
అయితే, ఆధార్ కార్డులు మాత్రం దీనికి పది లక్షల మేర అదనంగా జారీ అయ్యాయి. దీంట్లో నాలుగు లక్షల కార్డులను యూఐడీఐ తిరస్కరించింది. కాగా, తాజాగా నిర్వహించిన సమగ్ర సర్వేలో ఆధార్ యూఐడీ నంబర్‌ను విధిగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఒకవేళ ఆధార్ కార్డు అందకపోతే మాత్రం ఈఐడీ నంబర్‌ను పొందుపరచవద్దని స్పష్టం చేసింది. ఇది కూడా సర్వేలో ఆధార్ సంఖ్య తక్కువ నమోదు కావడానికి ఒక కారణంగా యంత్రాంగం చెబుతోంది.
గ్రామీణ మండలాల్లో కార్డులను పోగొట్టుకున్నా, ఎక్కడ భద్రపరుచుకున్నా, సమయానికి దొరకకపోయినా విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు కాకపోవచ్చని అంటోంది. అదే సమయంలో ఆధార్ కార్డు(యూఐడీ) జారీలో జరిగిన జాప్యం కూడా సర్వేపై ప్రభావం చూపే అవకాశంలేకపోలేదని పేర్కొంటోంది. ఈ కారణాల వల్లే కుటుంబసభ్యుల సంఖ్యకు ఆధార్ కార్డుల వివరాల నమోదుకు భారీ తేడా కనిపిస్తోందని జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
సర్వేలో నిరాధార్!
Published Sat, Sep 6 2014 11:42 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement