మహబూబ్‌నగర్ లీగల్/క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో సంచలనం సృష్టించిన బాలిక కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా జడ్జి టి.గంగిరెడ్డి శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే... స్థానిక టీచర్స్ కాలనీకి చెందిన పి.నాగరాజు, రజిత దంపతుల కుమార్తె శ్రీయ(6)ను అదే ఇంట్లో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మహ్మద్ యాకూబ్ డబ్బు కోసం కిడ్నాప్ చేసేందుకు పథకం రూపొందించారు.
తన స్నేహితులు నసీర్, అమీర్ సహకారంతో గత ఏప్రిల్ 17వ తేదీన చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్యచేసి అడ్డాకుల మండలం పోల్కంపల్లి శివారులో ఓ పాడుబడ్డ వ్యవసాయ బావిలో పడేసి వెళ్లిపోయారు. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయగా, పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాప్ హత్యను ఛేదించారు.
సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సుదర్శన్‌బాబు దర్యాప్తు చేసి నిందితులపై చార్జిషీటు దాఖలు చేశారు. పీపీ వినోద్‌కుమార్ మొత్తం 20 మందిసాక్షులను ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలు నిరూపణ కావడంతో నిందితులకు కోర్టు బాలికను హత్య చేసినందుకు జీవిత ఖైదు, కిడ్నాప్ చేసినందుకు పదేళ్లు కఠిన కారాగార శిక్ష విధించారు. సాక్ష్యాలను మార్చేం దుకు ప్రయత్నించినందుకు అదనంగా జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
అప్పీల్‌కు వెళ్తున్నాం: పీపీ
ఈ కేసును సంచలనాత్మకమైన, క్రూరమైన కేసుగా భావించి నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోరుతూ హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్తున్నట్లు పీపీ వినోద్‌కుమార్ తెలిపారు. నిందితులకు ఉరిశిక్ష పడడానికి తగిన సాక్షాధారాలు కోర్టు ముందు ఉంచామన్నారు. నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించడంపై కక్షిదారులు, న్యాయవాదులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందోనని జిల్లా ప్రజలు ఉత్కం ఠతో ఎదురుచూశారు. శుక్రవారం తీర్పు వినేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో కోర్టు ఆవరణ కిక్కిరిసింది.
అత్యాశతో కటకటాల పాలు...
మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులు రాత్రికి రాత్రే శ్రీమంతులు కావాలన్న దురాశ వారి జీవితాలను కటకటాలపాలు చేసింది. మనుషుల మధ్య నమ్మకం అన్న పదానికి వీరి అత్యాశ అర్థం లేకుండా చేసింది. అన్నం పెట్టి ఆదరించిన యజమాని, ‘అంకుల్’ అంటూ వారిని అంటిపెట్టుకు తిరిగిన చిన్నారిని పాశావికంగా హత్య చేశారు. కేసులో ప్రధాన నిందితుడు యాకుబ్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. జీవనోపాధి కోసం శ్రీయ తల్లిదండ్రుల వద్ద కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరాడు. నెల నెల వచ్చే జీతంతో జల్సాలు తీరకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో బాలిక కిడ్నాప్‌నకు ప్రణాళిక వేశాడు. చివరికి బాలికను హత్యచేసి కటకటాలపాలయ్యాడు. కేవలం 26 ఏళ్లకే అత్యాశతో జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు.
అమీర్, నసీర్‌లు ఆటోడ్రైవర్లు...
రోజంతా ఆటో నడిపితే తప్ప జీవనం లేని పరిస్థితి అమీర్, నసీర్ కుటుంబాలది. ఆటో నడుపుతూ వచ్చిన డబ్బులతో తమ కుటుంబాలను పొషిస్తున్నారు. కుటుం బ పరిస్థితులు బాగో లేకపోవడంతో చదువుకునే వయసులోనే ఆటో డ్రైవర్లుగా మారారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సులువుగా డబ్బులు వస్తాయని ఆశపడి యాకుబ్ ఉచ్చు లో పడ్డారు. చివరికి హత్యకేసులో 20 ఏళ్లకే జైలుపాలై నిండు జీవితాన్ని కోల్పోయారు.
పాపం పండింది
Published Sat, Sep 28 2013 3:03 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement