సాక్షి, హైదరాబాద్: సైబర్ నిందితుడి వద్ద శిక్షణ తీసుకొని, ఆపై సొంతంగా నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి తెలంగాణ సహా దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ సైబర్ ముఠా గుట్టురట్టయింది. డేటా ఎంట్రీ జాబ్స్ పేరిట నిరుద్యోగులకు వల వేసి.. ఆపై కంపెనీ షరతులను ఉల్లంఘించారని పేర్కొంటూ నకిలీ లీగల్ నోటీసులు పంపించి బాధితుల నుంచి సొమ్ము వసూలు చేసిందీ గ్యాంగ్.
తెలంగాణ, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి 25కుపైగా రాష్ట్రాలలో 358 సైబర్ కేసులున్న ఈ ముఠా.. ఇప్పటివరకు సుమారు రూ.100 కోట్లకు పైగానే సొమ్ము వసూలు చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ శిల్పవల్లి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి..
టెలీ కాలర్‌గా పని చేసి..
గుజరాత్‌లోని సూరత్‌లో నకిలీ డేటా ఎంట్రీ కంపెనీలో దిండోలి ప్రాంతానికి చెందిన రాహుల్ అశోక్ భాయ్ భాస్కర్ టెలీ కాలర్‌గా పని చేశాడు. ఓ సైబర్ క్రైమ్ కేసు దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసులు కంపెనీ యజమాని నితీష్ ను అరెస్టు చేసి, కాల్ సెంటర్‌ను మూసేశారు. కాల్ సెంటర్, డేటా ఎంట్రీ కార్యకలాపాలపై పట్టు సాధించిన రాహుల్.. తన స్నేహితులైన సాగర్ పాటిల్, కల్పేష్ థోరట్, నీలేష్ పాటిల్‌లను సంప్రదించి సైబర్ మోసాల గురించి వివరించాడు.
ఈ నలుగురూ కలిసి సూరత్‌లో ఫ్లోరా సొల్యూషన్ పేరుతో నకిలీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ పోర్టల్స్ నుంచి నిరుద్యోగుల డేటాను సేకరించి, వారికి వాట్సాప్ ద్వారా డేటా ఎంట్రీ జాబ్ సందేశాలను పంపించేవారు. ఆసక్తి కనబరిచిన వారికి జాబ్ లాగిన్ కోసం ఐడీ, పాస్‌వర్డ్ అందించేవారు.
నకిలీ లీగల్ నోటీసులతో బెదిరింపులు..
డేటా ఎంట్రీ పని పూర్తయ్యాక ఉద్యోగికి సొమ్ము చెల్లించకుండా కంపెనీ ప్రమాణాలకు తగిన స్థాయిలో డేటా ఎంట్రీ లేదని మాయమాటలు చెబుతూ సొమ్ము చెల్లించరు. దీంతో కొంతకాలం ఎదురుచూసిన ఉద్యోగికి డేటా ఎంట్రీ చేయడం మానేస్తాడు. అప్పుడే నిందితులు రంగంలోకి దిగుతారు.
కంపెనీ నిబంధనలు, షరతులను ఉల్లంఘించారని పేర్కొంటూ నకిలీ లీగర్ నోటీసులను బాధితులకు వాట్సాప్, ఈ–మెయిల్ ద్వారా పంపించి బెదిరింపులకు తెగిస్తారు. నోటీసులు రద్దు చేసుకోవాలంటే చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. ఈక్రమంలో సైబరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు వీరి వలలో చిక్కి రూ.6.17 లక్షలు మోసపోయాడు. ఇప్పటికే ఈ ముఠాపై సైబరాబాద్‌లో 11 కేసులున్నాయి.
వేలాది బ్యాంకు ఖాతాల విశ్లేషణ..
బాధితులు పంపించిన సొమ్ము ఏ బ్యాంకు ఖాతాలు నుంచి ఎక్కడికి బదిలీ అయ్యాయో విశ్లేíÙంచారు. ఇతరత్రా సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులు రాహుల్, సాగర్, కల్పేష్, నీలేష్లు సూరత్‌లో ఉన్నట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం వారిని అరెస్టు చేసి, స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ట్రాన్సిట్ వారంట్ నగరానికి తీసుకొచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి ఆరు ఫోన్లు, ల్యాప్‌టాప్, 5 డెబిట్ కార్డులను స్వాదీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు సోమవారం కస్టడీకి పిటీషన్ దాఖలు చేయనున్నట్లు డీసీపీ
తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment