మందమర్రి రూరల్ : జిల్లాలోని 52 మండలాల్లో 251 మంది క్లస్టర్ రీసోర్సు పర్సన్ (సీఆర్పీ)లు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. వీరు ప్రతినెలా క్లస్టర్ పరిధిలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలను నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం సందర్శించాలి. ప్రతీరోజు ఒక పాఠశాలకు వెళ్లి ప్రార్థన సమయం నుంచి తరగతులు ముగిసి బడి మూసివేసే సమయం వరకు అక్కడే ఉండాలి.
ఆ రోజంతా పాఠశాల పనితీరును పరిశీలిస్తూ భవనాలు, మరుగుదొడ్ల సౌకర్యం, నీటి వసతి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, విద్యార్థుల హాజరు తదితర అంశాలపై ఆరా తీయాలి. ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. ఆయా అంశాలపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారికి సమర్పించాలి. దీంతోపాటు బడిబయట ఉన్న చిన్నారులను గుర్తించి పాఠశాలలో చేర్పించే బాధ్యత కూడా వీరిదే. ఆర్వీఎం అధికారులు అడిగిన సమాచారాన్నీ అందించాలి.
ఖర్చులకు ఇబ్బందులు..
ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సీఆర్పీలపై అదనపు పనిభారం ఉంటుంది. ఈ నెలల్లో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభం కాగానే దగ్గరుండి బడిలో చేర్పించాలి. ఊరూరా తిరుగుతూ పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ఈ సమయంలోనే వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ ఏదో ఒక పాఠశాలకు వెళ్లడంతోపాటు ఆర్వీఎం అధికారులు అడిగిన సమాచారం అందించాల్సి ఉంటుంది.
ఈ విధులు నిర్వర్తించేందుకు రోజుకు కనీసం రూ.50 నుంచి రూ.100 వరకు ఖర్చు అవుతుంది. మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో విధులు ఎలా నిర్వర్తించేదని సీఆర్పీలు ప్రశ్నిన్నారు. అధికారులకు విన్నవించినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితోపాటు ఎంఐసీ, సీసీవో, మేసెంజర్స్, ఐఈఆర్‌పీలకూ మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదు.
పెరిగిన జీతం అందేనా?
ప్రస్తుతం సీఆర్పీలకు నెలకు రూ.7000 చెల్లిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం మరో రూ.1500 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన జీతం జూన్ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇదీ సీఆర్పీలకు కాస్త ఊరట కలిగించే అంశం. అయినా జీతం చెల్లించకపోవడంతో పెరిగిన జీతం అమలుకు నోచుకుందో.. లేదో తెలియని పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా జీతం చెల్లించాలని జిల్లాలోని సీఆర్పీలు కోరుతున్నారు.
మూడు నెలలుగా జీతాల్లేవ్!
Published Thu, Jul 17 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM
Advertisement
Advertisement