విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ధర్నా చేస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజు కూడా యధాతథంగా కొనసాగింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు శనివారం సామూహిక రాయబారాలు సాగించారు. అర్ధనగ్న ప్రదర్శనలు, వంటా వార్పు, మానవ హారాలు, రాస్తారోకోలు నిర్వహించారు. మెడకు ఉరితాళ్లు వేసుకుని, తల కిందికి కాళ్లు పైకి పెట్టి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల టీడీపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, గుంటూరు జిల్లా మంగళగిరి, తెనాలి, అనంతపురం జిల్లా పుట్టపర్తి, హిందూపురం, ప్రకాశం జిల్లా అద్దంకి, చీమకుర్తి, ఒంగోలు, తూర్పుగోదావరి జిల్లా మండపేట, పెద్దాపురం, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామ, మచిలీపట్నం, ఉయ్యూరు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు మధ్య పోటీ కార్మికులతో పని చేయించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను కార్మికులు తిప్పికొట్టారు. జంగారెడ్డిగూడెంలో 10 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. కార్మిక సంఘం నేతలు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కార్మిక నాయకులకు బెదిరింపులు
మున్సిపల్ కార్మికుల సమ్మెను అణచివేసిందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేసింది. కార్మిక సంఘం నేతలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి కేసులు బనాయిస్తామని బెదిరించడమే కాకుండా పోటీ కార్మికులను అడ్డుకుంటే జైలుకు పంపుతామని ఉన్నతాధికారులు బెదిరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలు తిప్పికొట్టేందుకు అత్యవసర సేవలను సైతం నిలిపివేసేందుకు వెనకాడబోమని రాష్ట్ర మున్సిపల్ కార్మికుల జేఏసీ హెచ్చరించింది. ప్రకాశం జిల్లా అద్దంకిలో మృతిచెందిన మున్సిపల్ కార్మికుడు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని జేఏసీ నాయకులు కె.ఉమామహేశ్వరరావు, ఎస్.శంకరరావు, ఎం.శివలక్ష్మితో కూడిన బృందం పరామర్శించింది.
పేరుకుపోతున్న చెత్తా చెదారం
రాష్ట్రంలోని దాదాపు అన్ని మున్సిపాల్టీల్లో పారిశుధ్య కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోతోంది. ఓపెన్ డ్రెయిన్లలోని సిల్ట్‌ను తొలగించకపోవడంతో కాల్వలు ఉప్పొంగి మురుగు నీరంతా రహదారులపైకి చేరుకుంటోంది. దుర్గంధం వెదజల్లుతుండటంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ప్రభుత్వం సామరస్య ధోరణితో వ్యవహరించి, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, సమ్మెను వెంటనే విరమింపజేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment