శుక్రవారం మున్సిపల్ కార్మికుల జేఏసీతో చర్చలు జరుపుతున్న నాయిని
- విరమిస్తున్నట్టు ప్రకటించిన జేఏసీ.. నెగ్గిన సర్కారు పంతం
- డిమాండ్లు పరిష్కారం కాకుండానే ముగింపు
- నేటినుంచి విధుల్లోకి 14 వేల మంది కార్మికులు
- 67 మున్సిపాలిటీల్లో 40 రోజులు జరిగిన సమ్మె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పంతమే నెగ్గింది. కార్మిక ఐక్య సంఘాలు వెనక్కి తగ్గాయి. మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక జేఏసీ శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, కనీస వేతనాల పెంపుతో సహా 16 డిమాండ్ల సాధనకు జూలై 6 నుంచి చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా 67 మున్సిపాలిటీల్లోని 14 వేల మంది కార్మికులు శనివారం నుంచి విధుల్లో చేరనున్నారు.
జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే సమ్మెను విరమించడం తెలిసిందే. ఇటు ప్రభుత్వం, అటు కార్మిక జేఏసీ పంతాలు, పట్టింపుల వల్ల సమ్మె సుదీర్ఘంగా 40 రోజులు కొనసాగింది. జేఏసీ భారీగా ఆందోళలు చేసినా, విపక్షాలన్నీ మద్దతుగా నిలిచినా సర్కారు దిగిరాలేదు. జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాలను పెంచుతూ జూన్ 16నే నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, ఇతర మున్సిపాలిటీల కార్మికుల విషయంలో మాత్రం నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచారు. చివరిదాకా ప్రభుత్వం పట్టనట్టే వ్యవహరించింది.
శుక్రవారం కూడా ప్రభుత్వంతో చర్చలకు కార్మిక జేఏసీ తీవ్రంగా ప్రయత్నిచినా లాభం లేకపోయింది. సచివాలయంలో పలువురు మంత్రులను కలిసేందుకు జేఏసీ నేతలు విఫలయత్నం చేశారు. సమ్మెపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో మంత్రులెవరూ ఇందులో జోక్యం చేసుకోడానికి ఇష్టపడలేదు. దాంతో సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య నేతృత్వంలో కార్మిక జేఏసీ నేతలు శుక్రవారం రాత్రి మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు.
కానీ వారి డిమాండ్లపై ఎలాంటి హామీ ఇవ్వలేనంటూ ఆయన చేతులెత్తేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేనందున భావి కార్యాచరణపై జేఏసీ నేతలు డి.వెంకట్(సీపీఎం), ఎం.సాయిబాబ, రెబ్బా రమారావు, శేఖర్, ఏసు రత్నం, వి.కృష్ణ, ఎంకే బోస్ తదితరులు అక్కడే అత్యవసరంగా సమావేశమై, సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
ఆందోళనలు కొనసాగిస్తాం.. జేఏసీ
సమ్మెలో ఉన్నవారిలో 90 శాతానికి పైగా దళిత, మహిళా కార్మికులు గనుకనే వారిపట్ల ప్రభుత్వం వివక్ష చూపిందని కార్మిక జేఏసీ నేతలు పాలడుగు భాస్కర్, జె.వెంకటేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడకేయడం, డెంగీ మరణాలు చోటు చేసుకోవడంతో సమ్మెను విరమించామన్నారు. డిమాండ్లు పరిష్కారమయ్యే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు.