ఆకుపచ్చ ఉద్యమం
- భాగ్యనగరిలో వెల్లివిరిసిన హరిత స్ఫూర్తి
- 29.19 లక్షల మొక్కలు నాటిన సిటీజనులు
సాక్షి, హైదరాబాద్ : హరిత స్ఫూర్తి వెల్లివిరిసింది.. ‘మొక్క’వోని దీక్ష సక్సెస్ అయింది.. ఎటు చూసినా మొక్కల పండుగే.. వనం కోసం కదిలిన జనం నేలతల్లి మెడలో ‘పచ్చ’ల హారం వేశారు..! గ్రేటర్ హైదరాబాద్‌లో మహోద్యమంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతమైంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మహానగర వ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ విభాగాల ఆధ్వర్యంలో 3,985 చోట్ల వంద జాతులకు చెందిన సుమారు 29.19 లక్షల మొక్కలు నాటారు. 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నా అంతకుమించి రికార్డు స్థాయిలో మొక్కలు నాటడం విశేషం.
నగరంలో 41 చోట్ల జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు, వీఐపీలు, సినీ, క్రీడారంగ ప్రముఖులు పాల్గొన్నారు. సుమారు 200 ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు హరితహారంలో పాలుపంచుకున్నాయి. పదిచోట్ల మెగా హరితహారం నిర్వహించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్ వద్ద మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్స్ ప్రాంగణంలో కదంబం, రెండు వేప మొక్కలు నాటి నగరంలో హరితహారాన్ని లాం ఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలో వేప, రావి, మద్ది, మోదుగ వంటి సంప్రదాయ మొక్కలు నాటేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. ఈదురుగాలులు, విపత్తులను సమర్థవంతంగా తట్టుకునేందుకే ఈ మొక్కలు నాటినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కదంబం, వేప మొక్కలు నాటిన సీఎం
సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం 11.30 గంటలకు నిమ్స్‌లోని నర్సింగ్ కాలేజీ వెనుకభాగంలోని ఖాళీ స్థలంలో ఒక కదంబం, రెండు వేప మొక్కలు నాటారు. కార్యక్రమంలో భాగంగా నిమ్స్ ఆవరణలో 4 వేల మొక్కలు నాటినట్లు మంత్రి లకా్ష్మరెడ్డి తెలిపారు. వేప, కానుగ, సిల్వర్ ఓక్, నెమలినారలతోపాటు వెయ్యి ఔషధ మొక్కలు నాటామన్నారు. నిమ్స్ ఆవరణలో 2003లో అప్పటి రాష్ట్రపతి కలాం నాటిన మొక్క ఇప్పుడు అందరికీ నీడనిస్తోంది. ఆ తర్వాత సీఎం హోదాలో నిమ్స్ ఆవరణలో మొక్కలు నాటిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రి లక్ష్మారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రె డ్డి, నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ మనోహర్, అధికారులు, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. తమ శాఖ ఆధ్వర్యంలో 4 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. అనంతగిరి కొండలు, హిమాయత్ సాగర్ పరిసరాల్లో లక్ష ఔషధ మొక్కలు నాటనున్నట్లు చెప్పారు.
ఉద్యమ స్ఫూర్తితో సాగాలి: హరీష్
తెలంగాణలో కరువు పరిస్థితులను దూరం చేసేం దుకు ప్రజలందరూ మొక్కలు పెంచాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆదిలాబాద్, ఖమ్మంలో వర్షాలు బాగా పడుతున్నాయని, కానీ మెదక్ జిల్లాలో వర్షాలు కురవకపోవడానికి కారణం పచ్చదనం లేకపోవడమేనన్నారు. 33% అటవీప్రాంతం ఉంటేనే ప ర్యావరణం సమతుల్యంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో హరితహారం సాగాలన్నారు.
ప్రముఖులు ఎవరెవరు.. ఎక్కడ?
పాతబస్తీలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కుందన్‌భాగ్‌లో స్పీకర్ మధుసూదనాచారి, హైటెక్‌సిటీలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, ఖైరతాబాద్‌లో మంత్రి తలసాని, పార్శీగుట్టలో టి.పద్మారావు, జన్వాడలో మంత్రి హరీష్‌రావు, శ్రీనగర్‌కాలనీలో ఎంపీ కవిత, కేబీఆర్ పార్క్‌లో మేయర్ బొంతు రామ్మోహన్‌లు మొక్కలు నాటారు. గచ్చిబౌలిలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, సనత్‌నగర్‌లో ముఖేశ్, నోవాటెల్ వద్ద పీవీ సింధు, మజీద్‌బండ వద్ద శ్రీకాంత్, బంజారాహిల్స్‌లో చిరంజీవి, చిత్రపురిలో సినీరంగ ప్రముఖులు రాజేంద్రప్రసాద్, రెజీనా తదితరులు మొక్కలు నాటారు.
బృహత్తర యజ్ఞమిది: పేర్వారం
హరితహారం బృహత్తర యజ్ఞమని తెలంగాణ పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్ పేర్వారం రాములు, రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, టీఎస్‌టీడీసీ మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ పేర్కొన్నారు. సోమవారం లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ వెనుక ప్రాంతంలో వారు మొక్కలు నాటారు. టూరిజం ఆధ్వర్యంలో దాదాపు 5 లక్షల మొక్కలు నాటనున్నట్లు రాములు చెప్పారు.
ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు: కేటీఆర్
ఇకపై ఇంటి ఆవరణలో 10 మొక్కలు నాటితేనే ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన హరితహారం మానవ ఇతిహాసంలో మూడో అతిపెద్ద ప్రయత్నం అని చెప్పారు. దేశంలోని 28 రాష్ట్రాలలో కలిపి ఏటా 50 కోట్ల మొక్కలు నాటితే ఒక్క తెలంగాణలో ఏటా 46 కోట్ల మొక్కలు చొప్పున ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. మాదాపూర్‌లోని టీసీఎస్ క్యాంపస్, బయోడైవర్సిటీ పార్కులో మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ప్రస్తుతం తెలంగాణలో 24 శాతం మాత్రమే అటవీ ప్రాంతం ఉందని దాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
పూల బొకేలకు స్వస్తి పలుకుదాం: నరసింహన్
హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ నరసింహన్ అభిలషించారు. 10 మొక్కలు నాటితేనే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలనే నిబంధన తేవాలన్నారు. మొక్కలు బాగా పెంచిన వారికి అవార్డులివ్వాలని, పెంచని వారిని గుర్తించి జరిమానాలు విధించే విధానాలు తీసుకురావాలన్నారు. పూల బొకేలిచ్చే పద్ధతికి స్వస్తి పలకాలన్నారు. పూల బొకేలకు బదులుగా చిన్న మొక్కలను కుండీల్లో అతిథులకు ఇవ్వాలని సూచించారు. ఏడాదిపాటు పూలను తుంచకుండా ఉండాలన్నారు. మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, పి.మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో మాట్లాడూతూ.. ప్రస్తుతం నాటుతున్న మొక్కల వివరాలను తీసుకుంటున్నానని, ఆరు నెలల తర్వాత ఆ మొక్కల ఎదుగుదలపై ప్రత్యేకంగా సర్వే చేయిస్తానని చెప్పారు. ఒక్క మొక్క పెరగకపోయినా దానికి కారణాలను తెలుసుకుని బాధ్యుడైన వ్యక్తికి జరిమానా విధిస్తామన్నారు.