అడవి బొగ్గుపాలు...
కలప టు కోల్ దందా
- జోర్‌పూర్ శివారు కేంద్రంగా బాగోతం
- కలపతో బట్టీల్లో బొగ్గు తయూరీ
- 15 రోజులకు 7,500 క్వింటాళ్ల విక్రయం
- రూ.1.50 కోట్ల మేర అక్రమ వ్యాపారం
- అధికారులతో అక్రమార్కుల కుమ్మక్కు
- ఇతర రాష్ట్రాలకు తరలింపు
- పట్టించుకోని యంత్రాంగం
- తగ్గుతున్న అటవీ సంపద
నందిపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి గొడ్డలి పెట్టుగా మారి కొందరు అక్రమార్కులు వృక్ష సంపదను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారు. ఏళ్ల తరబడి పెరిగిన వృక్షాలను నేలకూలుస్తూ.. కలపను వందలాది కిలోమీటర్లు తరలిస్తూ.. అక్రమంగా బొగ్గు తయారుచేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు కర్మాగారపు కేంద్రాలను తలపిస్తున్నాయి. ఉత్పత్తి చేసిన బొగ్గును నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కరాష్ట్రాలైన మహా రాష్ర్ట, రాజ స్థాన్‌కు తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు.
ఇలాంటి చర్యలను అడ్డుకోవాల్సిన అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుద్వాన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జోర్‌పూర్ గ్రామ శివారులోని మారుమూల ప్రాంతంలో మూడో కంటికి కనిపించకుండా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న దందా ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని జోర్‌పూర్ శివారులో మారుమూల ప్రాంతంలో సుమారు 6 ఎకరాల స్థలంలో బొగ్గు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని గత మూడు నెలల నుండి వందలాది టన్నుల కలపను కాల్చి బొగ్గును తయారు చేస్తున్నారు. ఉత్పత్తిని చేసిన బొగ్గును జిల్లా కేంద్రానికి తరలించి అక్కడి నుండి మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
పక్క జిల్లాల నుంచి కలప సరఫరా
బొగ్గు ఉత్పత్తికి కావల్సిన కలపను నిజామాబాద్‌తోపాటు పక్క జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్‌లోని అటవీ ప్రాంతంలోని మహా వృక్షాలను నరికి వేస్తూ, కలప దుంపలుగా తయారు చేసి చెక్‌పోస్టులను దాటుకుంటూ జోర్‌పూర్ శివారుకు తీసుకువస్తున్నారు. అక్రమ కలప తరలింపులో ఫారెస్టుల వద్ద అధికారుల నిఘా కొరవడడం, చెక్‌పోస్టు అధికారులతో వ్యాపారులు కుమ్మక్కు కావడంతో యథేచ్ఛగా బొగ్గు ఉత్పత్తికి కావాల్సిన కలప నందిపేట మండలంలోని జోర్‌పూర్ శివారుకు చేరుకుంటోంది. వారంలో రోజుకోసారి లారీల్లో కలప జోర్‌పూర్ శివారుకు వస్తున్నట్లు సమాచారం.
పక్క రాష్ట్రాలకు వేల క్వింటాల్లో బొగ్గు
బొగ్గు ఉత్పత్తికి ముడి సరుకైన రకరకాల కలప దుంపలను జోర్‌పూర్ శివారుకు దిగుమతి చేసుకుంటూ ఇటుక బట్టీలుగా పేర్చి నిప్పు పెడుతున్నారు. 15 రోజులుగా కాల్చుతూ బొగ్గు తయారు చేస్తున్నారు. ఇలా 15 రోజులకోసారి 5 బట్టీలతో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కో బట్టి నుంచి సుమారు 1,500 క్వింటాళ్ల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నట్లు అక్కడ పనిచేసే కార్మికులు చెబుతున్నారు. ఇలా వేల క్వింటాళ్లుగా తయారు చేసిన బొగ్గును పక్క రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. రాజస్థాన్, మహారాష్ట్రకు చెందిన 50 మంది కూలీలు తమ కుటుంబాలతో మూడు నెలలుగా బొగ్గు ఉత్పత్తి కేంద్రం వద్దే ఉంటున్నారు.
ఇక్కడ ఉత్పత్తి అయిన బొగ్గు నిల్వలు, ఉత్పత్తి కేంద్రంలో పనిచేసే కార్మికుల గుడారాలు కర్మాగారాన్ని తలపిస్తున్నాయి. మాది రాజస్థాన్ రాష్ట్రం. మాతో పాటు మహారాష్ర్ట నుంచి పనిచేసేందుకు 50 మంది కూలీలం కుటుంబాలతో వచ్చాం. మాకు ప్రతి ఒక్కరికి రోజుకు రూ. 300 కూలి ఇస్తున్నారు. కలపను పేర్చి నిప్పుపెట్టి బొగ్గును తయారు చేసి సంచుల్లో నింపి లారీల్లో లోడు చేస్తాం. బొగ్గు మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు వెళ్తోంది. కలప ఎక్కడి నుంచి వస్తోందో మాకు తెలవదు. మూడు నెలలుగా పనిచేస్తున్నాం.’అని బట్టీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు చెబుతుండడాన్ని బట్టి ఈ దందా ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
అధికారికంగా అనధికార దందా...
కుద్వాన్‌పూర్ పంచాయతీ.. జోర్‌పూర్ శివారు... సర్వే నంబర్ 55, 59 లోని అసైన్డ్ భూమిలో కలప టు కోల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. కలప కాల్చి బొగ్గును తయారు చేసేందుకు పంచాయతీ పాలకవర్గ సభ్యులు తీర్మానం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి వచ్చే ఏడాది ఈ సమయం వరకు కట్టెలు కాల్చి బొగ్గు తయూరు చేసుకునేలా ఆ భూమిని లీజుకు ఇచ్చారు.
ఇంటి నిర్మాణం కోసం రూ.1184 ఫీజును సైతం సదరు వ్యక్తి నుంచి వసూలు చేశారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు చార్‌కోల్ డిపో పేరిట అనుమతులు ఇచ్చారు. ఇంకేముంది.. అధికారికం గా అనుమతులు పొందిన సదరు వ్యక్తి ఆరు ఎకరాల్లో అనధికార బాగోతానికి తెరలేపాడు. 15 రోజులకు సుమారు రూ.1.50 కోట్ల దందా సాగిస్తున్నాడు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకానికి గొడ్డలిపెట్టుగా మారి.. అటవీ సంపద అంతరించిపోయే ప్రమాదం ఉంది.